అమెరికాపై చైనా విమర్శలు: నెటిజన్ల ఫైర్‌!

China Jibe At US With Video On Covid 19 Twitter Hits Back - Sakshi

మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) తమ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా అమెరికా అధికార రిపబ్లికన్‌ పార్టీ నేతలు చైనాపై విరుచుకుపడుతున్నారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజుకు ఒకసారైనా డ్రాగన్‌ దేశంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వుహాన్‌ పట్టణంలో జన్మించిన ప్రాణాంతక వైరస్‌ గురించి చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేదని వాగ్యుద్ధానికి దిగుతున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడానికి ముమ్మాటికీ చైనానే కారణమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని చైనా రాయబార కార్యాలయం.. ‘‘వన్స్‌ అపాన్‌ ఏ వైరస్‌’’అనే క్యాప్షన్‌తో అమెరికాను విమర్శిస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది.(న్యూయార్క్‌లో శవాల గుట్ట!)

దాదాపు 39 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో.. ‘‘డిసెంబరులో అపరిచిత న్యూమోనియా బయటపడిందని చైనా.. డబ్ల్యూహెచ్‌ఓకు చెప్పింది. జనవరిలో కొత్త వైరస్‌ పుట్టిందని.. అది డేంజర్‌ అని చెబితే.. అమెరికా అది సాధారణ ఫ్లూ అని కొట్టిపారేసింది. మాస్కులు ధరించాలంటే వద్దని చెప్పింది. ఇంట్లోనే ఉండాలంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. తాత్కాలిక ఆస్పత్రులు నిర్మిస్తే షో ఆఫ్‌ చేస్తోందని ఎద్దేవా చేసింది. ఏప్రిల్‌ నాటికి చైనా అబద్ధాలు చెబుతోందని నిందించింది’’ అంటూ యానిమేటెడ్‌ దృశ్యాలను ప్రదర్శించింది.(కరోనా విపత్తు: చైనాను బెదిరించిన ట్రంప్‌!)

కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ప్రాణాంతక వైరస్‌ వుహాన్‌లోనే ఉద్భవించిందని.. ప్రస్తుతం ప్రపంచం ఈ విధంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి చైనానే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అది ప్రాణాంతక వైరస్‌ అని తెలిస్తే ముందే ఎందుకు అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపివేయలేదని ప్రశ్నిస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ అమెరికాను విమర్శల పాలుచేసేందుకు ఫ్రాన్స్‌లోని చైనా రాయబారి ఈ వీడియోను షేర్‌ చేశారంటూ సీఎన్‌ఓన్‌ యాంకర్‌ జేక్‌ టాపెర్‌ ధ్వజమెత్తారు. కాగా చైనాలో పురుడు పోసుకున్న కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top