ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష వేస్తే.. అక్కడే చచ్చిపోతాడు!

Harvey Weinstein Lawyers Urges Only 5 Years Sentence Over Ill Health - Sakshi

హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ న్యాయవాదులు

న్యూయార్క్‌: తమ క్లైంట్‌​కు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ తరఫు న్యాయవాదుల బృందం న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జేమ్స్‌ బుర్కేకు లేఖ రాశారు. హార్వే ఇప్పటికే సర్వం కోల్పోయారని.. వృద్ధాప్యంలో ఆయన ఇబ్బందులకు గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హార్వీ చేపట్టిన సామాజిక కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని శిక్షను సడలించే అవకాశాలు పరిశీలించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన హార్వీపై నమోదైన అభియోగాలు నిజమేనని న్యూయార్క్‌ ప్రత్యేక జ్యూరీ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు 29 ఏళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో హార్వీ బుధవారం(మార్చి 10) నాటి తీర్పు తర్వాత జైలు జీవితం గడపబోతున్నారు.(80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే)

ఈ సందర్భంగా హర్వీ తరఫు న్యాయవాదులు పలు కీలక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. ఇందులో.. హార్వీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. కారు ప్రమాదంలో గాయపడిన ఆయన ఇటీవలే సర్జరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఆయనను వెంటాడుతున్నాయని.. కాబట్టి ఐదేళ్ల జైలు శిక్షతోనే సరిపెట్టాలని కోరారు. హార్వీ వెన్నెముకకు గాయం అయ్యిందని.. కళ్లు కూడా సరిగా పనిచేయడం లేదని తెలిపారు. హాలీవుడ్‌ మూవీ మొఘల్‌గా ఎదిగిన క్రమంలో హార్వీ సమాజ సేవ చేశారని.. తుదితీర్పు వెలువరించే క్రమంలో దీనిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో జైలు జీవితం గడపలేక ఆయన అక్కడే మరణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి 67 ఏళ్ల వృద్ధుడైన, అనారోగ్యంతో బాధపడుతున్న హార్వీపై దయచూపాలని కోరారు. కాగా ఎంతో మంది నటీమణులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదర్కొంటున్న హార్వీ 2006, 2013లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువైన నేపథ్యంలో ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top