‘ప్రెజర్‌ కుక్కర్‌’ మూవీ రివ్యూ

Pressure Cooker Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌: ప్రెజర్‌ కుక్కర్‌
జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: సాయి రోనక్‌, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు
సంగీతం: సునీల్‌ కశ్యప్, రాహుల్‌ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
దర్శకత్వం: సుజోయ్, సుశీల్‌
నిర్మాతలు: సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి
నిడివి: 134.53 నిమిషాలు

సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్‌ తెరకెక్కించిన చిత్రం 'ప్రెజర్‌ కుక్కర్‌'. చిత్ర యూనిట్‌ టైటిల్‌ను అనౌన్స్‌మెంట్‌ చేసిన వెంటనే టాలీవుడ్‌ ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై పడింది. అంతేకాకుండా టీజర్‌, ట్రైలర్‌లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. క్రిష్‌, నందినిరెడ్డి, తరుణ్‌ భాస్కర్‌లు వంటి ప్రముఖులు ఈ చిన్న సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ఈ సినిమాకు మరింత ప్లస్‌ పాయింట్‌ అయింది. ఇన్ని అంచనాల మధ్య ‘ప్రెజర్‌ కుక్కర్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథాంశం, డిపరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? చిన్న సినిమా పెద్ద హిట్‌ కొట్టిందా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. 

కథ: 
సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్‌ (సాయి రోనక్‌)ను కూడా అమెరికాను పంపించాలని ఆరాటపడతాడు. అందుకు అనుగుణంగా కిశోర్‌కు చిన్నప్పట్నుంచే అమెరికా గొప్పతనాలను వివరిస్తూ పెంచుతాడు. అలా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిశోర్‌ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు బయల్దేరతాడు. ఈ క్రమంలోనే స్వతంత్ర భావాలు కలిగిన అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. 

ఇక వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్‌కు చందు(రాహుల్‌ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. అయితే వరుసగా మూడు నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్‌ కావడంతో వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు కిశోర్‌. ఈ  సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. అయితే ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్‌ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? కిశోర్‌, అనితల ప్రేమ చివరికి ఏమైంది? ఈ సినిమాతో దర్శకులు ఏం చెప్ప దల్చుకున్నారో తెలుసుకోవాలంటే ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమా చూడాల్సిందే.
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

నటీనటులు:
ఈ చిత్రంలో హీరోగా నటించిన సాయిరోనక్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మొత్తం అతడి చుట్టే తిరుగుతుండటంతో నటనకు మంచి స్కోప్‌ దొరికింది. అయితే వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. హావభావాలు అంత గొప్పగా పలికించలేకపోయాడు. అయితే కొన్ని చోట్ల ఫర్వాలేదనిపించాడు. నటుడిగా ఇంకా పరిపక్వత చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది హీరోయిన్‌ ప్రీతి అస్రాని. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. పలు సీన్లలో ఎంతో అనుభవమున్న నటిగా ప్రీతి కనిపిస్తుంది. దీంతో ఈ యువ హీరోయిన్‌కు సినీ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్‌ ఉండే అవకాశం ఉంది. ఇక తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సీనియార్టీతో రావు గారి పాత్రను అవలీగా చేశాడు. ఇక రాహుల్‌ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:
విదేశాలకు వెళ్లి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి.. అదొక ప్రెస్టేజ్ సింబల్ అనుకునే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నారు, అమెరికా వెళ్లిన వాళ్లు నిజంగా సంతోషంగా ఉన్నారా? పిల్లలు అమెరికా వెళ్లాక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అనే స్టోరీ లైన్‌తో ‘ప్రెజర్‌ కుక్కర్‌’ను తెరకెక్కించారు దర్శకులు సుజోయ్, సుశీల్‌.  కాన్సెప్ట్‌ కొత్తగా ఉందని టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమైంది. అయితే ట్రైలర్‌ వరకయితే కాన్సెప్ట్‌తో మెప్పించారు. కానీ రెండు గంటలకు పైగా సాగే సినిమాను కేవలం కాన్సెప్ట్‌తో నడిపించలేరు. కాన్సెప్ట్‌కు తగ్గట్టు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా బలమైన పూర్తి స్క్రిప్ట్‌ ఉండాలి. ఈ విషయంలో దర్శకులు విఫలమయ్యారనే చెప్పాలి. 

సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అసలు కథలోకి నేరుగా ప్రవేశిస్తుంది. తన కొడుకు అమెరికా ఎందుకు వెళ్లాలని తండ్రి అనుకుంటున్నాడు, దాని కోసం హీరో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అడ్డంకులు, కొన్ని కామెడీ సీన్స్‌, హీరోయిన్‌ ఎంట్రీ, హీరోకు అమెరికా దారులు మూసుకపోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. అయితే తొలి అర్థభాగం ముగిసే సరికి ఓకే ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ వచ్చే సరికి సినిమా ఏటో వెళ్లిపోతోంది అనే భావన కలుగుతుంది. సాగదీత సీన్లు, సెంటిమెంట్‌ సీన్లు అంతగా వర్కౌట్‌ కాలేదు. అయితే హీరోహీరోయిన్‌ల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ బాగుంటాయి. అయితే దర్శకులు తాము చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా చెప్పలేకపోయారని సగటు ప్రేక్షకుడి కూడా అరథమవుతుంది. 

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. నలుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేసినప్పటికీ వావ్‌ అనిపించే సాంగ్స్‌ లేవు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ మోస్తారుగా ఉంటుంది. క్లైమాక్స్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ వచ్చి పాడే పాట బాగున్నా.. సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. మాటల రచయిత తన కలానికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది.  స్క్రీన్‌ప్లే పర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. హీరోయిన్‌ అందాలను, కొన్ని పాటలను తమ కెమెరాతో మ్యాజిక్‌ చేశారు సినిమాటోగ్రాఫర్స్‌. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

ప్లస్‌ పాయింట్స్‌:
కాన్సెప్ట్‌
హీరోహీరోయిన్ల లవ్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌:
హీరో నటన
సాగదీత, బోరింగ్‌ సీన్లు
సినిమా నిడివి

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top