‘రాహు’ మూవీ రివ్యూ

Raahu Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌: రాహు
జానర్‌: సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌
నటీనటులు: అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌, సుబ్బు వేదుల, సత్యం రాజేశ్‌, కాలకేయ ప్రభాకర్‌, చలాకి చంటి, గిరి తదితరులు
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
దర్శకత్వం: సుబ్బు వేదుల
నిర్మాతలు: ఏవీఎస్‌ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
నిడివి: 122.42 నిమిషాలు

అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఈ చిత్రాన్ని ఏవీఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై పాజిటీవ్‌ వైబ్‌ క్రియేట్‌ అయింది. అందుకు తగ్గట్టు మూవీ టీజర్‌, ట్రైలర్‌లు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాపై ఆడియన్స్‌ ఆసక్తి కనబర్చారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ అంచనాలను అందుకుందా? సుబ్బు వేదుల దర్శకత్వ ప్రతిభ తెరపై ఏ మేరకు ఆకట్టుకుంది? చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్‌ కొట్టిందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 
తన కూతురు ఎప్పుడూ ప్రకాశించే సూర్యుడిలా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ భార్గవ్‌ (సుబ్బు వేదుల) తన కూతురికి భాను (కృతి గార్గ్‌) అని పేరు పెడతాడు. భార్గవ్‌ తన పోలీస్‌ ఆపరేషన్‌లో భాగంగా నాగరాజు (కాలకేయ ప్రభాకర్‌)ను అరెస్ట్‌ చేస్తాడు. ఈ క్రమంలో నాగరాజు తమ్ముడిని భార్గవ్‌ హతమారు​స్తాడు. అయితే భార్గవ్‌పై పగ పెంచుకున్న నాగరాజు భార్గవ్‌ కూతురిని చంపెస్తానంటూ బెదిరిస్తాడు. అయితే ఈ క్రమంలోనే భాను ఓఅరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాధిలో భాగంగా ఆమె ఎక్కువ స్ట్రెస్‌కు గురైనప్పుడు కొన్ని నిమిషాల పాటు ఆమెకు కళ్లు కనిపించవు. 

సీన్‌ కట్‌చేస్తే టూర్‌లో భాగంగా సిక్కింలో శేష్‌ (అభిరామ్‌ వర్మ)తో భానుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఓ బలమైన కారణం చూపి వీరిద్దరి పెళ్లికి భాను తండ్రి భార్గవ్‌ అడ్డుకుంటాడు. ఇంతలో జైలు నుంచి నాగరాజు తప్పించుకుంటాడు. ఓ వైపు పెళ్లికి నిరాకరించిన తండ్రి.. దూరంగా ఉంటున్న ప్రియుడు.. ముంచుకొస్తున్న మృత్యువు ఈ సమయంలో భాను ఏం చేస్తుంది? అసలు ఈ సినిమా కథలోకి చలాకి చంటి, గిరి, సత్యం రాజేశ్‌లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? తనకున్న వ్యాధితో భాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? భాను జీవితంలో శేష్‌ పోషించిన పాత్ర ఏంటి? అనేదే ‘రాహు’ సినిమా కథ.

నటీనటులు: 
ఈ సినిమా కథ భాను చుట్టూ తిరుగుతుంది. అయితే డిఫరెంట్‌ వేరియేషన్స్‌ గల భాను పాత్రలో ఒదిగిపోవడానికి కృతి గార్గ్‌ తన వంతు కృషి​ చేసింది. లుక్స్‌ పరంగా బాగున్నా.. నటన పరంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొన్ని సీన్లలో అనుభవం ఉన్న నటిగా కనిపించగా.. మరి కొన్ని సందర్భాల్లో పూర్తిగా తేలిపోయింది. ఇక అభిరామ్‌ వర్మ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లలో కనిపిస్తాడు. రెండు విభిన్న యాంగిల్‌లోనూ అభిరామ్‌ ఆకట్టుకుంటాడు. ఇక మిగతా తారాగణం తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

విశ్లేషణ: 
ఓ కొత్త పాయింట్‌తో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు సుబ్బు వేదులకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అయితే బలమైన స్టోరీ లైన్‌కు పూర్తి స్క్రిప్ట్‌ను రాసుకోవడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఈ విషయం ఫస్టాఫ్‌లోనే అర్థమవుతుంది. క్యారెక్టర్స్‌ ఎంట్రీ, హీరోయిన్‌ చిన్నతనం ఎపిసోడ్‌, సిక్కిం టూర్‌ ఇలా తొలి అర్థభాగం సాదాసీదాగా సాగిపోతుంది. సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట మినహా మరే సీన్లు కూడా అంతగా ఆకట్టుకోవు. అంతేకాకుండా స్లోనెరేషన్‌తో ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడతాయి. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోతుంది. దీంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక్కడి నుంచి సినిమా వేగం పెరుగుతుంది. 

ఫస్టాఫ్‌లో దాచి ఉంచిన అంశాలను ఒక్కొక్కటి బయట పెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అసలు విలన్‌ ఎవరు? భాను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు వంటి ట్విస్టులను రివీల్‌ అవుతుంటాయి. అయితే ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో తనను చంపడానికి శత్రువు రూపంలో వచ్చిన రాహు నుంచి భాను కాపాడుకునే సీన్లు రిపీటెడ్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఆ సీన్లలో నాటకీయత లోపించింది అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక క్లైమాక్స్‌లో హీరోయిన్‌కు అన్ని అవాంతరాల మధ్య పోరాడితే పోయేదేముంది అని విలన్‌తో ఫైట్‌ చేసే సీన్లు సినిమాను నిలబెట్టేలా ఉంటాయి. అయితే అప్పటివరకు భయపెట్టిన విలన్‌ సాదాసీదాగా చనిపోవడం అంత ఆప్ట్‌గా అనిపించదు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఇలాంటి థ్రిల్లర్‌ సినిమాలకు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రధాన బలం. ఈ విషయంలో ప్రవీణ్‌ లక్కరాజు నూటికినూరు శాతం న్యాయం చేయలేకపోయాడనే చెప్పాలి. అక్కడక్కడా ఆకట్టుకున్నా సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. స్క్రీన్‌ ప్లే కూడా ప్రేక్షకుడికి పజిల్‌గా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ సినిమాకు మైనస్‌ అని చెప్పాలి. వీటిపై దర్శకనిర్మాతలు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉండేది. కొన్ని అనవసర సీన్లను కత్తెర వేయాల్సింది. లో బడ్జెట్‌తో నిర్మాతలు సినిమాను బాగానే నెట్టుకవచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో జీవం మిస్సైన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే కొత్త పాయింట్‌, కొన్ని ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ చేత చప్పట్లు కొట్టిస్తాయి.
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

ప్లస్‌ పాయింట్స్‌:
ట్విస్టులు
స్టోరీ లైన్‌

మైనస్‌ పాయింట్స్‌: 
కథనం
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్‌

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top