క్షణంపాటైనా దూరం చేసే ఆ హక్కు వద్దమ్మా!​

Sushmita Sen Reveals How She Told Renee About Her Adoption - Sakshi

కేవలం అందంతో కాకుండా తనకున్న సేవాగుణంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌. అందాల రాణిగా కిరీటం దక్కించుకున్న తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. హిందీతో పాటు పలు బెంగాలీ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. వెండితెరపై వెలుగులీనిన ఈ అమ్మడు మనసు వెన్న వంటిదని ఆమె స్నేహితులు చెబుతూ ఉంటారు. చారిటీ కోసం నిర్వహించే ఫ్యాషన్‌ షోల్లో పాల్గొనడమే కాకుండా ఆపదలో ఆదుకునే గుణం ఆమె సొంతం. అయితే అన్నింటి కంటే కూడా 2000లో సుస్మిత చేసిన పని స్నేహితులతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచారు. పెళ్లి చేసుకుని సెటిల్‌ అవుతుందనుకున్న తరుణంలో రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. ఆ తర్వాత పదేళ్లకు రీనికి తోడుగా అలీషా అనే చెల్లెల్ని బహుమానంగా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తన కూతుళ్లతో ఉన్న అనుబంధం గురించి సుస్మితా సేన్‌ ఇటీవల ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. వాళ్లు తన కన్న కూతుళ్లు కాదనే విషయం రీనీ, అలీషాలకు తెలుసునని.. బంధం బీటలు వారకూడదనే ఉద్దేశంతోనే దత్తత గురించి చెప్పానని పేర్కొన్నారు. ‘ నా కూతుళ్లకు 18 ఏళ్లు వచ్చే నాటికి వారి కన్న తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాలని అనుకున్నాను. అయితే రీనీ చిన్నతనంలోనే తనను దత్తత తీసుకున్నానే విషయం చెప్పాను. ఆరోజు తను నా ఎదురుగా కూర్చుంది. కొంతమందికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఒకరు కన్నవారైతే మరొకరు పెంచిన వారు అని చెప్పాను. అయితే తానెవరినని రీనీ అడిగింది. నిన్ను దత్తత తీసుకున్నాను అని చెప్పాను. అప్పుడు తన ముఖంలో అభావాన్ని గమనించాను. అప్పుడు.. ‘నువ్వు నా పేగు తెంచుకుని కాదు. నా హృదయం నుంచి పుట్టావు. బయోలాజికల్‌ పేరెంట్స్‌ అంటే బోరింగ్‌. నువ్వు చాలా స్పెషల్‌ అని చెప్పాను. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో తను అలాగే చెప్పేది. అయితే ఓరోజు కోర్టుకు వెళ్లి తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకోమని, ఇది తన హక్కు అని రీనికి చెప్పాను. కానీ తను వెళ్లనంది. తన తల్లికి క్షణంపాటు దూరం చేసే ఏ హక్కు అయినా తనకు అక్కర్లేదని చెప్పింది’ అని ఈ మాజీ మిస్‌ యూనివర్స్‌ కూతురితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top