కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ

‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి