ఇన్‌స్టా హీట్‌.. ఫిట్‌నెస్‌ ఫీట్‌

Tollywood Heroines Fitness Freaks in instagram - Sakshi

టాలీవుడ్‌ తారల వీడియోలకు యూత్‌ ఫిదా

సమంత, రకుల్‌.. ఒకరిని మించి మరొకరు  

కఠినమైన వ్యాయామాలతో పోటాపోటీ

టాలీవుడ్‌ తారలు జిమ్‌ లవర్స్‌.. రెగ్యులర్‌గా వర్కవుట్‌ చేస్తారు. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తారని అందరికీ తెలిసిందే. మనకు తెలియనివీ చెప్పాలనుకుని చిత్ర విచిత్ర వ్యాయామ చిత్రాలకు ‘తెర’తీశారు. పోటాపోటీగా షాకింగ్‌ వర్కవుట్స్‌ చేస్తూ ‘ఫీట్‌’నెస్‌ క్వీన్స్‌గా మెరిసిపోతున్నారు. వీరి విన్యాసాలతో సోషల్‌ మీడియా చిత్తరువైపోతోంది. వారి అభిమానులు కూడా ఆ ట్రెడ్‌నే ఫాలో అవుతున్నారు.

ర‘కూల్‌’ రిమ్‌జిమ్‌
జిమ్‌లు వర్కవుట్స్‌ ద్వారా సమంత సృష్టించిన సంచలనం కొనసాగుతుండగానే సిటీలో జిమ్‌ ప్రమోటర్‌గా అవతారమెత్తిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ‘ఫీట్‌’నెస్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె తన రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ వర్కవుట్స్‌ చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. వెయిట్స్‌తో కన్నా ఎక్కువగా బాడీ వెయిట్‌ వర్కవుట్స్‌కే ప్రాధాన్యమిచ్చే రకుల్‌ ప్రీత్‌.. కిక్‌ బాక్సింగ్, స్కిప్పింగ్, రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ ట్రైనింగ్‌తో వర్కవుట్‌కి కొత్త డెసిషన్‌ ఇస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్‌ ఫీట్స్‌కి ఫిదా అవుతోంది సోషల్‌ మీడియా. తాజాగా టైర్లను దొర్లిస్తూ ఆమె చేసిన వ్యాయామం, సర్క్యూట్‌ వర్కవుట్‌.. ఇన్‌స్టాలో మాత్రమే కాదు.. సిటీ ఫిట్‌నెస్‌ సర్కిల్‌లోనే సెన్సేషన్‌ అయింది. అయితే, తాను ఎవరికీ పోటీ కాదంటోంది రకుల్‌. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడమనేది ఒక జీవనశైలి అని, మన శరీరం దేవాలయం లాంటిదంటోందీ పంజాబీ భామ. 

హైరేంజ్‌లో అక్కినేని కోడలు
అక్కినేని వారింటికి కోడలుగా అడుగుపెట్టిన సమంత ఆ ఇంటి మన్మధుడి వారసత్వాన్ని అందుకున్నట్టుంది.. టాలీవుడ్‌ ఫిట్‌నెస్‌లో సమంత అక్కినేని టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఆమె తన ‘ఇన్‌స్టా’లో పోస్ట్‌ చేస్తున్న ఫొటో, వీడియోలు అభిమానులను అబ్బురపరుస్తున్నాయి. పురుషులతో సమానంగా విభిన్న రకాల వెయిట్స్‌ని లిఫ్ట్‌ చేస్తూ సమంత చేసిన స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ ఫొటోలు గతంలో మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన సామ్‌.. అత్యంత క్లిష్టమైన పార్కర్‌ ఫీట్స్, జంపింగ్స్‌ వంటి వ్యాయామ విన్యాసాలలో మతి పోగొడుతోంది. ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోలో ఫీట్స్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో తన ఫాలోయర్స్‌ నుంచి కుప్పలు తెప్పలుగా లైక్స్‌ను కొల్లగొడుతున్నాయి. చూపరులకు అందంగా కనిపించడానికి కాదు.. మనలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాల గురించే ఫిట్‌నెస్‌ అని సమంత చెప్పే మాటలు యూత్‌కి స్ఫూర్తినిస్తున్నాయి.  

‘మీటూ’ అంటున్న పూజ..
అకస్మాత్తుగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్న నాజూకు సుందరి పూజా హెగ్డే కూడా ‘మీటూ’ అంటూ ఇతర తారలతో పోటీలోకి వచ్చేసింది. తనకన్నా సీనియర్లయిన సమంత, రకుల్, రాశీఖన్నా వంటివారితో సమానంగా టాప్‌గేర్‌లో ఆమె ఫీట్స్‌ చేస్తూ హాటెస్ట్‌ ‘ఫిట్‌క్వీన్‌’గా మారిపోయింది. ఏరియల్‌ సిల్క్‌ మూవ్స్‌ చేస్తూ ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలు ఆమె క్రేజ్‌ని అమాంతం గాల్లోకి లేపాయి. కాలిస్తెనిక్స్, పిలాటిస్, కిక్‌ బాక్సింగ్‌ వంటిì వర్కవుట్స్‌ వీడియోలతో తన ఇన్‌స్టా ఖాతాను ఓవర్‌లోడ్‌ చేసేస్తోందీ బోల్డ్‌ బ్యూటీ.

మేమూ రెడీ అంటున్న ఫ్యాన్స్‌  
ఇన్‌స్ట్రాగామ్‌లో ఫిట్‌నెస్‌ వీడియోలకు వస్తున్న ఫాలోయింగ్‌ మరింత మంది తారల్ని క్లిష్టమైన విన్యాసాలవైపు మళ్లిస్తోంది. ఏదేమైనా బాలీవుడ్‌ బ్యూటీస్‌ని తలదన్నేలా తమదైన రీతిలో శరీరాన్ని తీగలా ఉంచుకుంటూనే శక్తి సామర్థ్యాలనూ సంతరించుకుంటున్నారు టాలీవుడ్‌ క్వీన్స్‌. అమ్మాయిలు జిమ్‌కి వెళ్లడమంటే కేవలం వంపు సొంపుల కోసమే అనే ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ, క్లిష్టమైన వ్యాయామాలను, ఫీట్స్‌ను చేసే శారీరక సామర్థ్యం మనం కూడా సొంతం చేసుకోవచ్చుననే కొత్త ఆలోచనలను వీరు యువతుల్లో రేకెత్తిస్తుండడం వెల్‌కమ్‌ ట్రెండనే చెప్పాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top