బాలాకోట్ ఎటాక్ : న్యూ ట్విస్ట్

బాలాకోట్ వైమానిక దాడిలో 170 మంది ఉగ్రవాదులు హతం - ఇటలీ జర్నలిస్ట్
పాక్ ఆర్మీ వైద్యుల ఆధ్వర్యంలో చికిత్సలు
ఇంకా చికిత్స పొందుతున్న 45 మంది
బీజేపీ సర్కార్ ప్రచారాస్త్రంగా మలుచుకున్న బాలాకోట్ వైమానిక దాడిపై న్యూటిస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడిని ఇటలీకి చెందిన ఓ జర్నలిస్ట్ తాజాగా ధ్రువీకరించారు. ఈ దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో ఒక వివరణాత్మక కథనాన్ని వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. అయితే భారత వైమానిక దళం జేఈఎం శిక్షణా శిబిరాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు.
బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో జైషే మహ్మద్ సంస్థ శిక్షణా శిబిరంలో జరిగిన వైమానిక దాడిలో 170 మంది చనిపోయారన్నారు. వీరిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న 3 నుంచి 4 గంటల సమయంలో భారత వైమానిక దళం దాడి ఘటన వెంటనే షిన్‌కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందన్నారు. పాకిస్తాన్ సైన్యమే క్షతగాత్రులను ఆసుపత్రిలకు తరలించి ఆర్మీలోని వైద్యుల ద్వారా చికిత్స అందించిందని తెలిపారు. ఇప్పటికీ గాయపడ్డ 45 మంది మిలిటరీ క్యాంపులో చికిత్స పొందుతున్నారని, వీరు ప్రస్తుతం సైన్యం నియంత్రణలోనే ఉన్నారని ఆమె వెల్లడించారు. అంతేకాదు దాడిలో చనిపోయిన తీవ్రవాదుల కుటుంబాలను సందర్శించిన జెఈఎం నాయకులు సంఘటన గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చారని తెలిపారు.
కాగా సార్వత్రిక ఎన్నికల వేళ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటలీకి చెందిన జర్నలిస్టు కథనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ప్రధానంగా విపక్షాలు బాల్కోట్ ఉదంతంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నతరుణంలో ఈ కథనం వెలువడటం గమనార్హం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి