24 గంటలు..77 మరణాలు

Corona Cases Registered in India Total 1755 - Sakshi

కొత్తగా 1,755 కరోనా కేసులు

మొత్తం 1,152 మంది బలి  

35,365కు చేరిన మొత్తం పాజిటివ్‌ కేసులు 

రికవరీ రేటు 25.63 శాతం

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి స్త్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో ఏకంగా 77 మంది కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. అలాగే కొత్తగా 1,755 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 1,152కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 35,365కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 25,148 కాగా.. 9,064 మంది(25.63 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు.  

స్వదేశంలో పీపీఈ కిట్ల తయారీ  
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. 2.22 కోట్ల పీపీఈ కిట్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని, ఇందులో 1.43 కోట్ల కిట్లను భారత్‌లోని స్వదేశీ సంస్థలే తయారు చేస్తున్నాయని పేర్కొంది. గతంలో పీపీఈ కిట్ల కోసం విదేశాలలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వీటిని తయారు చేసే సంస్థలు భారత్‌లో 111 ఉన్నాయని కేంద్ర సాధికార సంఘం–3 చైర్మన్‌ పి.డి.వాఘేలా తెలిపారు. దేశంలో ప్రస్తుతం 19,398 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చామని, వీటిలో 59,884 వెంటిలేటర్లు మనదేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు. అలాగే 2.49 కోట్ల ఎన్‌–95/ఎన్‌–99 మాస్కులకు ఆర్డర్‌ ఇచ్చామని, ఇందులో 1.49 కోట్ల మాస్కులను స్వదేశీ సంస్థల నుంచే కొంటున్నామని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఉత్పత్తిని నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచామన్నారు. ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు(ఐటీబీపీ) దళంలో ఐదుగురు జవాన్లకు కరోనా వైరస్‌ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

ఆ 12 మంది తాత్కాలిక జైలుకు
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న 12 మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులను అధికారులు తాత్కాలిక జైలుకు తరలించారు. వీరిలో 9 మంది థాయ్‌లాండ్‌ దేశస్తులు. వీరంతా ఓ మసీదులో ఉండగా, ఏప్రిల్‌ 2న అదుపులోకి తీసుకున్నారు.   

నాందేడ్‌ గురుద్వారా మూసివేత
మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్‌ హుజూర్‌ సాహిబ్‌ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేశారు. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో తాజాగా 91 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

మహారాష్ట్రలో జోన్ల వారీగా ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేత  
ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే  
మే 3వ తేదీ తర్వాత తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను జోన్లవారీగా ఎత్తివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శుక్రవారం చెప్పారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తామని, తొందరపాటుకు తావులేదని అన్నారు. ముంబై, పుణే, నాగపూర్, ఔరంగాబాద్‌ వంటి రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపుపై ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరించడం తగదని, అలాచేస్తే అక్కడ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ఏ దేశానికిపైనా నిజమైన సంపద ఆ దేశ ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు.

User Rating:
Average rating:
(0/5)
Rate the movie:
(0/5)
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top