అట్టుడుకుతున్న ఈశాన్యం

Indefinite Curfew in northeastern states - Sakshi

గువాహటిలో కర్ఫ్యూ, దిస్పూర్‌లో నిరసనకారులపై కాల్పులు

గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌర నిరసనలకు కేంద్రంగా మారిన అస్సాం రాజధాని గువాహటిలో బుధవారం నిరవధిక కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూని ధిక్కరిస్తూ నిరసనకారులు వీధుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. గువాహటి, దిస్పూర్, డిబ్రూగఢ్, జోర్హాత్, త్రిపుర రాజధాని అగర్తల తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా  అదుపులోకి తీసుకున్నారు.

అస్సాం రాజధాని దిస్పూర్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేలు దిస్పూర్‌లో ఆదివారం భేటీ కానున్న వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనల కారణంగా తేజ్‌పూర్‌ నుంచి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ కొద్దిసేపు గువాహటి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పలు రైళ్లను రద్దు చేశారు. త్రిపుర, అస్సాంలలో ఆర్మీని మోహరించారు. అస్సాంలోని 10 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్‌ను నిలిపేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ సదుపాయాన్ని కూడా నిలిపేశారు.

ఆందోళన ఎందుకు?
ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అస్సాం పౌర రిజిస్టర్‌ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top