భూగోళాన్ని చుట్టేస్తానంటున్న సెక్యూరిటీ గార్డ్‌

JNU Guard Cracks University Entrance To Study Russian In New Delhi - Sakshi

మనసుంటే మార్గముంటుంది అనడానకి ఈ సంఘటనే నిదర్శనం. అతను ఓ సెక్యూరిటీ గార్డు. నెలకు రూ.15వేల జీతం. బతుకుదెరువు కోసం పని చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితేనేం చదువుకోవాలన్న అతడి ఆకాంక్ష ముందు ఇవన్నీ చిన్నవైపోయాయి. అందుకే పనిచేసే చోటే విద్యార్థిగా నూతన జీవితాన్ని ఆరంభించాడు రాంజల్‌ మీనా.

న్యూఢిల్లీ : రాజస్తాన్‌కు చెందిన రాంజల్‌ మీనా ఓ దినసరి కూలీ కొడుకు. అతని కుటుంబం నివసిస్తున్న బజేరా గ్రామంలో సరైన విద్యావసతులు లేవు. చదువుకోడానికి 28 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దీంతో మీనా చదువుకు ఆటంకం ఏర్పడింది. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉందామని పనికి కుదిరాడు. ప్రస్తుతం అతడు ముగ్గురు పిల్లలలకు తండ్రి అయ్యాడు.  నేటికీ అతనికి చదువంటే మమకారం పోలేదు. ఆ ఇష్టంతోనే గత సంవత్సరం దూరవిద్య ద్వారా రాజస్తాన్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, హిందీ నుంచి డిగ్రీ పట్టాను పొందాడు. అయినా అతను సంతృప్తి చెందక చదువుపై మరింత ధ్యాస పెంచుకున్నాడు.

పని, చదువు రెండూ ఒకటే
రాంజల్‌ మీనా 2014లో సెక్యూరిటీ గార్డుగా జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టాడు. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో నెగ్గి తన కల నిజం చేసుకున్నాడు. బిఏ రష్యన్‌లో సీటు దక్కించుకున్నాడు. ఈ విషయం గురించి మీనా మాట్లాడుతూ.. తాను చదువుకోడానికి జేఎన్‌యూ యాజమాన్యం, విద్యార్థులు అండగా నిలిచారన్నాడు. ఫోన్లు, పత్రికల ద్వారానే పరీక్షకు ప్రిపేర్‌ అయ్యానన్నాడు. ఎలాగైనా సీటు సంపాదించాలన్న ధ్యేయంతో ఉద్యోగ నిర్వహణకు ఏ ఆటంకం కలగకుండా పరీక్షకు సన్నద్ధమయ్యానన్నాడు. తాను కోరుకున్నది దక్కినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఓవర్‌నైట్‌లో ఫేమస్‌ అయిపోయినట్టుగా ఉందని ఆనందంతో తబ్బిబ్బయిపోయాడు. ‘నేను మళ్లీ చదువుతాననుకోలేదు. కానీ నా కల నిజమయింది, ఇపుడు నాలో మళ్లీ ఆశలు చిగురించాయి.  భూగోళాన్ని చుట్టి రావచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఫారిన్‌ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకున్నాను. దీని ద్వారా సివిల్‌ పరీక్షలోనూ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఈ యూనివర్సిటీ ఎందరో విజ్ఙానవంతులను అందించింది. వారిలాగే నేను కూడా ఏదైనా సాధిస్తా’ అంటూ  లక్ష్యం దిశగా పయనిస్తున్నాడు.

రాత్రి పనిచేస్తూ పగలు చదువు
మీనాకు భార్య, ముగ్గురు పిల్లలు. వారింట్లో ఎప్పుడూ సమస్యలు తిష్ట వేసి ఉంటాయి. ఢిల్లీలోని మునిర్కలో ఒక గదిలో వీరి కుటుంబం నివసిస్తోంది. పూట గడవాలంటే పని చేయక తప్పని పరిస్థితి. ఇదే విషయాన్ని అతని భార్య మీనాకు గుర్తు చేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకూడదని నిశ్చయించుకున్న మీనా రాత్రిళ్లు పని చేస్తానని  చెప్పాడు. రాత్రిళ్లు ఉద్యోగం చేసేలా అవకాశం కల్పించమని యూనివర్సిటీ యాజమాన్యాన్ని  అభ్యర్థించాడు. ఎందుకంటే ఆ కుటుంబం గడిచేది అతని ఒక్క జీతంతోనే!

అండదండలు
మీనా సాధించిన విజయం గురించి జేఎన్‌యూ వైస్‌ చాన్సలర్‌ జగదీశ్‌ మాట్లాడుతూ.. ‘మేం ఎప్పుడూ విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను పట్టించుకోము. వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. వారికి బోధిస్తూనే మేము కూడా శిక్షణ పొందుతాం’ అని పేర్కొన్నారు. ఇక నవీన్‌ యాదవ్‌ అనే ప్రధాన సెక్యూరిటీ అధికారి మాట్లాడుతూ మీనాను చూసి తామంతా గర్వపడుతున్నామన్నారు. కానీ రెగ్యులర్‌ కళాశాలలో రాత్రిళ్లు డ్యూటీలు వేయటం కష్టమన్నారు. అయితే అతని కల సాకారం కావటం కోసం మావంతుగా ప్రయత్నిస్తామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top