ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి

Supreme Court awards Rs 7.6 crore relief to family of Mangaluru crash victim - Sakshi

ఎయిరిండియాను ఆదేశించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 2010లో మంగళూరులో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.64 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్‌ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికాగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ మహేంద్ర కొడ్కనీ(45) ఉన్నారు. కొడ్కనీ కుటుంబానికి రూ.7.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ) అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది. వివిధ కారణాలు చూపుతూ ఎయిరిండియా ఆ మొత్తాన్ని చెల్లించలేదు.

దీంతో కొడ్కనీ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. ‘ఒక సంస్థ తమ ఉద్యోగుల ఆదాయాన్ని అనేక కారణాలతో వేర్వేరు కేటగిరీల కింద విభజించవచ్చు. అయితే, ఆ ఉద్యోగికున్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనావేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయించేటప్పుడు అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి’అని పేర్కొంది. ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొన్న రూ.7.35 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటి వరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని పేర్కొంది. ఒక వేళ అంతకంటే ఎక్కువగా చెల్లించినా పిటిషన్‌దారుల నుంచి రాబట్టేందుకు వీలు లేదని ఎయిరిండియాకు కోర్టు స్పష్టం చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top