ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ

Balakrishna Faces Protest in Hindupuram - Sakshi

కాన్వాయ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు

హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. సొంత నియోజక వర్గ కేంద్రంలోనే చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు తమ కార్యకర్తలతో బాలకృష్ణకు భద్రతగా తరలివచ్చారు. బాలకృష్ణ కాన్వాయ్‌ రహమత్‌పురం సర్కిల్‌ వద్దకు రాగానే నిరసనకారులు రాయలసీమకు అన్యాయం చేయవద్దంటూ శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అయితే బాలకృష్ణ కనీసం కారు కూడా దిగకపోవడంతో ప్రజా సంఘాల నాయకులు ‘‘బాలకృష్ణ గోబ్యాక్‌.. సీమద్రోహి గోబ్యాక్‌’’ అంటూ నినదించారు. అదేతరుణంలో టీడీపీ నాయకులు బాలయ్య జిందాబాద్‌ అంటూ ప్రతి నినాదాలు చేస్తూ నిరసనకారులను తోసివేయడంతో కిందపడి పలువురు గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు లాఠీ చార్జ్‌ చేస్తూ నిరసన కారులను పక్కకు ఈడ్చేశారు. దీంతో బాలకృష్ణ కాన్వాయ్‌ ముందుకు సాగగా బైపాస్‌ క్రాస్‌ వరకూ నిరసన కారులు వాహనాలను వెంబడిస్తూ నిరసన తెలిపారు. 

అరెస్టు.. పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన
ఎమ్మెల్యే బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకుల్లో కొందరిని హిందూపురం టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గోపికృష్ణ, మలుగూరు శివన్న, పురుషోత్తంరెడ్డి, అమర్‌నాథ్‌ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాయలసీమకు మేలు జరుగుతుందని తెలిసీ ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణ కూడా అమరావతికే మద్దతు తెలపడం ఆయన స్వార్థానికి నిదర్శనమన్నారు. మూడు దశాబ్దాలుగా నందమూరి కుటుంబీకులను గౌరవిస్తూ ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపినా ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top