‘నారా, నందమూరి పార్టీగా టీడీపీ’

సాక్షి, విజయవాడ: ఈనెల 23 తరువాత రాష్ట్రంలో టీడీపీ రెండుగా చీలబోతుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజమైన టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయనున్నారని తెలిపారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి చంద్రబాబే దోహద పడ్డారని, జనసేన పార్టీ చీల్చిన ఓట్లు టీడీపీవేనని ప్రజలు గమనించారన్నారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ, బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి