ఇది ధర్మమేనా?

CM YS Jaganmohan Reddy Press Meet Over Local Body Elections Postpone - Sakshi

ఎన్నికల కమిషనర్‌ విచక్షణ కోల్పోయారు: సీఎం వైఎస్‌ జగన్‌

ఒకవైపు ఎన్నికలు వాయిదా వేస్తూ మరోవైపు అధికారులను ఎలా బదిలీ చేస్తారు?

పేదల ఇళ్ల పట్టాలు అడ్డుకోవడం సబబేనా?.. రూ.5,000 కోట్ల నిధులు పోగొట్టుకోవాలా?

బాబు తన సామాజిక వర్గం అధికారిని నియమించుకుని వ్యవస్థలను దిగజారుస్తున్నారు

స్థానిక ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తే కరోనాను నియంత్రించడం సులభం

కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి జాగ్రత్తలు సూచిస్తున్నాం. 70 నమూనాలు సేకరిస్తే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చింది. ఆ వ్యక్తి కూడా కోలుకుంటున్నాడు.

9 నెలల్లో 90 శాతం హామీలు అమలు చేశాం. ప్రజలు మెచ్చుకునే పాలన తెచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తోంది. దీనిని బాబు తట్టుకోలేకపోతున్నారు.. వ్యవస్థల్ని దిగజారుస్తున్నారు.

నిన్నటికీ, ఈరోజుకి పరిస్థితిలో ఏం తేడా కనిపించింది? వైఎస్సార్‌సీపీ 2 వేలకు పైగా ఎంపీటీసీలను దక్కించుకోవటం వారికి దుర్వార్తలాగా వినిపించింది. బాబు దారుణంగా దెబ్బతింటున్నారని ఉదయాన్నే ఎన్నికలు నిలుపుదల చేసేశారు.

రాష్ట్రంలో కరోనా ప్రభావం గురించి కనీసం ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శిని అడగలేదు. సీఎస్‌తో మాట్లాడలేదు.సమీక్ష చేయలేదు. ఆర్డర్‌ కాపీలో మాత్రం సీనియర్‌ హెల్త్‌ ఫంక్షనరీస్‌ నుంచి ఇన్‌పుట్స్‌ తీసుకున్నామని ఎన్నికల కమిషనర్‌ చెబుతారు. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా.?
–ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిష్పాక్షికతతోపాటు విచక్షణ కూడా కోల్పోయారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కరోనా వైరస్‌ను సాకుగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్‌పై కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని నిలదీశారు. ఎన్నికల కమిషనర్‌ ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే మరోవైపు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కొందరు అధికారులను ఎలా బదిలీ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా అడ్డుకోవడం సబబేనా? అని ఆక్షేపించారు. ప్రజలు 151 సీట్లతో గెలిపించిన ముఖ్యమంత్రిది అధికారమా? లేక ఎన్నికల కమిషనర్‌దా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుని ప్రస్తుతం వ్యవస్థలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, దీనిపై బెంబేలెత్తాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఫలితాలు ఏకపక్షమనే అక్కసుతోనే..
ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తూ ప్రజారంజకంగా పాలిస్తున్న వైఎస్సార్‌ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తోందనే దుగ్దతోనే చంద్రబాబు ఎన్నికలను అడ్డుకుంటున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాక్షస క్రీడకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని ఎన్నికలు జరిపించాలని, లేదంటే పైస్థాయికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే...

వ్యవస్థలను నీరుగారుస్తున్న బాబు
- ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఏ రోజూ అనుకోలేదు.
- చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను దారుణంగా నీరుగారుస్తున్నారు.
- కొన్ని విషయాలు, వాస్తవాలను అందరూ తెలుసుకోవాలి.

81 శాతం మంది ఇంట్లోనే కోలుకున్నారు
- కరోనా వైరస్‌ కొన్నాళ్లుగా చైనాలో విస్తరించడం, 81 వేల మంది వైరస్‌ బారిన పడటం చూశాం. 
- బాధితుల్లో 65 వేల మందికి నయం కాగా 3 వేల మంది మాత్రం చనిపోయారు. 
- కరోనా వైరస్‌ అన్ని దేశాలకూ పాకింది:
- అయితే దీనివల్ల మనుషులు చనిపోతారు, ఇదేదో భయానకమైన వైరస్, భయంకర పరిస్థితి అని ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదు
- ఇదొక రోగం అని చెప్పాల్సిన పని లేదు.
- డయాబెటిక్, బీపీ, కిడ్నీ, కాలేయ మార్పిడి జరిగినవారు, ఆస్తమా బాధితులతోపాటు 65 ఏళ్ల వయసు దాటినవారికి కరోనా వైరస్‌ సోకితే హానికరమైన వ్యాధిగా మారుతోంది. 
- ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 81 శాతం మంది ఇంట్లోనే ఉంటూ కోలుకున్నారు.
- కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు.
- చైనాలో కరోనా బాధితులకు స్టేడియంలో చికిత్స అందించారు.
- కేవలం 4.7 శాతం మంది మాత్రం ఐసీయూ పరిస్థితుల్లోకి వెళ్లారు. వారికీ వైద్యం అందిస్తున్నారు.

ఎవరిది ఈ అధికారం?
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ రోజు ఉదయం స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన్ను మా ప్రభుత్వం నియమించ లేదు. చంద్రబాబు తన హయాంలో, తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి.
- ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్పాక్షికత.
రమేష్‌కుమార్‌ నిష్పాక్షికతతోపాటు విచక్షణ కూడా కోల్పోయినట్లు ప్రవర్తించారు.
- ఏ అధికారైనా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకూ అతీతంగా పనిచేయాలి. అప్పుడే గౌరవం లభిస్తుంది.
రమేష్‌ కుమార్‌ ఒకవైపు కరోనా వైరస్‌ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెబుతారు. మరోవైపు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలు, మాచర్ల సీఐ, మరికొందరు అధికారులను తప్పిస్తూ ప్రకటన చేస్తారు. ఇది ఆశ్చర్యకరం. ఇలా ఎవరైనా చేయగలుగుతారా?
ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ నుంచి అయిపోయే తేదీ వరకు ఆ మధ్య కాలంలో ఏదైనా చేయవచ్చు. కానీ ఒకవైపు కరోనా వైరస్‌ పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేశామంటూ అదే ప్రెస్‌మీట్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటారు. 
175 స్థానాలకుగానూ 151 స్థానాల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చింది. నేను సీఎం స్థానంలో ఉన్నా. మరి ఈ అధికారం సీఎందా? రమేష్‌ కుమార్‌దా?

ఇది.. నిరంతర ప్రక్రియ
- కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉంటున్న మనవాళ్లు రాబోయే రోజుల్లో ఇక్కడకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి.
- అక్కడి పరిస్థితులు, చికిత్స వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలు మనవారిని స్వస్థలాలకు పంపవచ్చు.
- గోదావరి, వైఎస్సార్‌ తదితర జిల్లాల నుంచి చాలామంది గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు.
- విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, 14 రోజుల పాటు క్వారంటైన్, ఐసోలేషన్‌లో పర్యవేక్షణ, జ్వరం వస్తే వెంటనే వైద్యం అందించడం సహజంగానే జరుగుతాయి. 

ఇది నిరంతర ప్రక్రియ
-  ఇవాళ ఏదో నిర్ణయం తీసుకుని ఆందోళనకు గురిచేసి రెండు వారాల తర్వాత అంతా నయం అయిపోతుందని అనుకోవాల్సిన పనిలేదు.
- నిజానికి రెండు నుంచి నాలుగు వారాల తరువాత విదేశాల్లో ఇతరులను వెనక్కి పంపే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. 

జీవనయానం ఆగిపోదు...
- ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పరిస్థితిని బట్టి సూచిస్తాం.
- స్కూళ్లు, పాఠశాలలకు కొద్ది రోజుల పాటు సెలవులిస్తాం.
- విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్వహిస్తాం.
- కరోనా భయంతో ప్రజల దైనందిక కార్యక్రమాలను నిలుపుదల చేయలేం. జీవనయానం ఆగిపోదు.

ఇదేనా విచక్షణ?
- స్థానిక ఎన్నికలు జరపాలి. 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయండి. అప్పటివరకు మేం మాట్లాడం.
- ఒకవైపు ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ మరోవైపు చర్యలు తీసుకుంటారు.
- ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు.
- ఇటీవల అంతా ఇదే మాట మాట్లాడుతున్నారు.
- ఏం చేసినా విచక్షణాధికారం అంటున్నారు.
- ఎన్నికలు వాయిదా వేసి మీరే ముఖ్యమంత్రి మాదిరిగా కలెక్టర్లు, ఇతర అధికారులను మారుస్తున్నారు. 
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. అధికారులకు మెమో జారీ చేస్తారు.
- అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలు ఓట్లేయడం ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు? ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లేసి గెలిపించడం ఎందుకు?

ఎన్నికలపై ఎల్లో మీడియా యాగీ...
- ఎన్నికలపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నానా యాగీ చేస్తోంది. 
- రాష్ట్రంలో 10,243 ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
- ఇందులో 54,594 నామినేషన్లు దాఖలైతే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి.
-  2,794 వార్డులు, డివిజన్లలో పోటీ జరుగుతుంటే 15,185 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇందులో చెదురుమదురు ఘటనలు కేవలం 14 చోట్ల జరిగితే నాలుగు పత్రికలు, టీవీ ఛానళ్లు ఎక్కువగా ఉన్నాయని ఇలా దుష్ప్రచారం చేయడం సరైనదేనా? గుండెపై చెయ్యి వేసుకొని చెప్పండి.

‘స్థానిక’ ఏకగ్రీవాలపై 2013లో ఈనాడు ఏం రాసిందంటే..
- ఏకగ్రీవాల్లో టీడీపీ సత్తా చాటింది. 269 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 105 స్థానాలను టీడీపీ కైవశం చేసుకుంది.
 75 స్థానాలను వైఎస్సార్‌ సీపీ దక్కించుకుంది.
- కాంగ్రెస్‌ ఆరు స్థానాలకే పరిమితమైంది. 
- వామపక్షాలు రెండేసి స్థానాలను, బీజేపీ ఒక్క స్థానం, స్వతంత్రులు 83 స్థానాలను దక్కించుకున్నారు.
- ఏకగ్రీవం కావడమన్నది కొత్తేమీ కాదు.
- నాడు ఒప్పు అనిపించింది.. నేడు తప్పు అయిపోయిందా?

ప్రజలు హర్షించేలా పని చేస్తున్నాం..
- ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం.
- ప్రజలకు మేలు చేసేలా హర్షించే రీతిలో పని చేస్తున్నాం.
- మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి 90 శాతం కార్యరూపంలోకి తెచ్చాం.  
- ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ సీపీ స్వీప్‌ చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు?
- వ్యవస్థల్లో తనకున్న మోల్స్‌ను ఉపయోగించి వాటిని దిగజార్చే పని ఎందుకు చేస్తున్నారు?

పోలీసుల తీరు ప్రశంసనీయం..
- పోలీసులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారని గర్వంగా చెప్పగలను 
- 8 చోట్ల పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 
ఎక్కడా ఉపేక్షించకుండా, ప్రేక్షక పాత్ర వహించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.

ఎవరో రాసింది ఆయన చదువుతున్నారు..
- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కలెక్టర్లకు నిన్న ఓ ఉత్తర్వు ఇచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే సంతోషించాల్సింది పోయి ఎన్నికల ప్రక్రియ జరిగేదాకా ఆపమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.
- నిన్న ఈ లేఖ ఇచ్చారు. ఇవాళ పొద్దున్న ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేశారు.
- నిన్నటికీ, ఇవ్వాళ్టికీ ఏం తేడా కనిపించింది?
- తేడా ఒక్కటే... స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తోందనే. దాదాపు 2 వేల పైచిలుకు ఎంపీటీసీలను వైఎస్సార్‌ సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడం వారికి దుర్వార్తలా వినిపించింది.
- దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, చంద్రబాబు ఇంకా దారుణంగా దెబ్బతింటున్నారని, ఏకంగా ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పొద్దున 4 పేజీల ఆర్డర్‌ వచ్చింది.
- ఇంత పెద్ద ఆర్డర్‌ తయారవుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ సెక్రటరీకే తెలియదు.
- అంటే ఎవరో రాస్తున్నారు, ఎవరో ఇస్తున్నారు, ఆ ఆర్డర్‌ను ఆయన చదువుతున్నారు.
- ఇలా చేయడం ధర్మమేనా?
- ఒకవైపు ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఆర్డర్‌ ఇస్తారు. మరోవైపు కలెక్టర్లు, ఎస్పీలను, అధికారులను బదిలీ చేస్తారు.
- ఇళ్ల పట్టాలు లాంటి సంక్షేమ పథకాలను ఆపేస్తున్నారు.
- కరోనా వైరస్‌ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెప్పేటప్పుడు ఎన్నికల కమిషనర్‌ కనీసం ఎవరినైనా అడగాలి కదా? సూచనలు, సలహాలు తీసుకోరా?
- కనీసం ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శిని అడగలేదు. సమీక్ష చేయలేదు.
- సీఎస్‌ను కనీసం అడగలేదు, మాట్లాడలేదు, రివ్యూ చేయలేదు. కనీసం సలహా తీసుకోలేదు. 
- ఆర్డర్‌ కాపీలో మాత్రం సీనియర్‌ హెల్త్‌ ఫంక్షనరీస్‌ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్‌ తీసుకున్నామని ఎన్నికల కమిషనర్‌ చెబుతారు. 
ఆరోగ్యశాఖ కార్యదర్శి కన్నా సీనియర్‌ ఫంక్షనరీ ఎవరైనా ఉంటారా? ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? మీరేదో చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. పోనీ చేస్తే చేశారు. కానీ రెండో వైపు అధికారులను బదిలీ చేస్తారు, ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇది సరైనదేనా?
- చంద్రబాబు ఆయనకు పదవి ఇచ్చి ఉండొచ్చు. ఇద్దరి సామాజిక వర్గం ఒక్కటే కావచ్చు. అయినా ఇంత వివక్ష చూపడం ధర్మమేనా, సబబేనా?

వలంటీర్లతో ఇంటింటి సర్వే
- గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటినీ సర్వే చేసి విదేశాల నుంచి వచ్చేవారిని గుర్తించి జాగ్రత్తలు సూచిస్తున్నాం.
- దీనిపై పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చాం.
- 104 ద్వారా అందరికీ చికిత్స అందుబాటులోకి తెచ్చాం.
- రాష్ట్రంలో 70 నమూనాలు సేకరిస్తే ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చింది.
- ఆ వ్యక్తి కూడా కోలుకుంటున్నారు.  
- దేశంలో 51 ల్యాబ్‌లు ఉంటే మన రాష్ట్రంలో తిరుపతి, విజయవాడలో వెంటనే ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం.
- కాకినాడ ప్రాంతంలో మరో ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.
- వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, అదనపు వెంటిలేటర్లు సిద్ధం చేశాం.  

తక్షణమే స్పందించాం..
- మనకు విశాఖ మినహా ఇతర చోట్ల అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నందున మనకంటే 
ఇతర రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది.
కరోనా బాధితుల చికిత్స కోసం విశాఖలోని విమ్స్‌లో 200 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం.
- ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో కూడా 100 పడకలతో అందుబాటులో ఉంచాం. విజయవాడలో 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ వార్డులు, ఐసీయూలను కూడా సిద్ధం చేశాం. 
- విజయవాడ, విశాఖ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఐసోలేషన్‌ రూమ్స్‌ రేపటి నుంచి అందుబాటులోకి తెస్తాం.
- నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగానే వెంటనే బాధితుడి నివాసానికి కిలోమీటర్‌ పరిధిలోని 20 వేల ఇళ్లలో 40 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు జరిపాం.
- బాధితుడి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచాం.
- ఇలా ఒక పద్ధతి, విధానం ప్రకారం వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.

రాష్ట్రం డబ్బులు పోగొట్టుకోవాలా?
- ఈ ఎన్నికల ప్రక్రియ జరగడం ఎందుకు అవసరమో అంతా ఆలోచించాలి.
- మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు అయిపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది.
- ఎన్నికలు జరగకపోతే ఆ డబ్బులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి?
- ఆ నిధులొస్తే రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అభివృద్ధి కనిపిస్తుంది కదా? ఏదో ఒక పనికి వినియోగిస్తాం కదా?
- ఆ డబ్బులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్‌ నష్టపోవాలని ఎందుకు ఇన్ని కుట్రలు పన్నాలి?
- ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు ఇంత కక్ష సాధించాలి?
- కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదనే కోపంతో ఇలా చేస్తున్నారు.

వాయిదాతో పరిస్థితి మారుతుందా?
- ఎన్నికలు వాయిదా వేస్తే పరిస్థితి మెరుగవుతుందా? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏమైనా మారిపోతాయని చెప్పగలరా?
- కరోనా బాధిత దేశాల నుంచి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ఇంకా చాలా మంది వస్తారు.
- అప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కరోనాను ఎదుర్కోవడం నిరంతర ప్రక్రియ అవుతుంది. 
- పది రోజుల్లో ముగిసే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా సాధించేది ఏమిటి? 
- వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా ఎన్నికలు జరుగుతాయనే గ్యారంటీ ఏమిటి?
- ఎన్నికలు జరగడం లేదు కాబట్టి ఆ ఏడాది కూడా నిధులు ఆగిపోవాలా?
- ప్రభుత్వం అడుగులు ముందుకు పడకూడదు, అభివృద్ధి జరగకూడదు, మేం ఇలాగే అధికారం చలాయించాలన్న దృక్పథం సరికాదు.
- ప్రజలకు మంచి చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు ఆలోచించాలి. 
- దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకోం. గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నికల కమిషనర్‌ను పిలిచి మాట్లాడాలని కోరాం.
- అప్పటికీ మార్పు రాకుంటే ఈ అంశాన్ని ఉన్నత స్థాయి దృష్టికి తెస్తాం.
- స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తే కరోనా లాంటి వ్యాధులను నియంత్రించడం మరింత సులభం అవుతుంది.
- సర్పంచులు, మునిసిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్ల రాకతో పాలన బలోపేతం అవుతుంది. 
- స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ఈ అవకాశం కోల్పోవడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ప్రశ్నార్థకంగా మారతాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top