సింగరేణి అండ.. ఎవరికో పూదండ

Peddapalli Constituency Review on Lok Sabha Election - Sakshi

బొగ్గుగని కార్మికులే గెలుపోటముల నిర్ణేతలు

గెలుపు ధీమాలో మూడు ప్రధాన పార్టీలు

సింగరేణి బొగ్గు గనులు, పచ్చని పొలాలు, తెలంగాణ సాగు దశను మార్చే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, ఎన్టీపీసీ, సిమెంట్‌ పరిశ్రమలు, ధర్మపురి, కాళేళ్వరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం. నైసర్గికంగానే కాకుండా రాజకీయంగానూ విభిన్నత, వైవిధ్యం దీని సొంతం. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఈ నియోజకవర్గం ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత ఇచ్చినట్లే ఇచ్చి.. రెండుచోట్ల మాత్రం మిశ్రమ తీర్పునిచ్చింది. మరో సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఇలాంటి భిన్నమైన పరిస్థితులున్న పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న వారంతా లోక్‌సభ ఎన్నికలకు కొత్త వారే. కాంగ్రెస్‌ రాజకీయ దిగ్గజం జి.వెంకటస్వామి కుటుంబం తరపున బరిలో ఎవరూ లేకుండా ఎన్నికలు జరుగుతుండడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని (టీఆర్‌ఎస్‌), ఆగం చంద్రశేఖర్‌ (కాంగ్రెస్‌),  ఎస్‌.కుమార్‌ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఇక్కడ గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకున్నారు. మోదీ అనుకూల పవనాలు మేలు చేస్తాయని బీజేపీ అభ్యర్థి అంచనాతో ఉన్నారు.

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. రామగుండం, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లో అత్యధికంగా సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను వీరి ఓట్లే నిర్దేశిస్తాయి. సింగరేణి కార్మిక కుటుంబాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న అంశం– వారసత్వ ఉద్యోగాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీనిపై ప్రచారం చేసి టీఆర్‌ఎస్‌ ఓటర్లను ఆకర్షించింది. కానీ ఇప్పటివరకు వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్య పెండింగ్‌లో ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా ఎంచుకుంది.

‘సంక్షేమమే’ గెలిపిస్తుంది
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు తప్ప ఎవరికీ బలం లేదు. విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గ్రూప్‌–1 అధికారిగా ఎంపికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గ్రూప్‌–1 అధికారుల కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేసి స్వామిగౌడ్, దేవిప్రసాద్‌తో కలిసి ఉద్యమంలో పనిచేశా. స్థానికుడిని కావడం వల్ల గెలుపునకు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో సింగరేణి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి ఇప్పటికే తీర్చారు. ఇక మిగిలినవి ముఖ్యమంత్రి సహాయంతో తీర్చగలననే నమ్మకం ఉంది. సింగరేణి ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వాడిని. ఇక్కడే చదువుకున్నా. సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని స్థానాల్లో మేమే గెలుస్తాం. అందులో పెద్దపల్లిలో ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తాం.– బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని,టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

నాతోనే ఉద్యమానికి ఊపు
తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చింది మంత్రుల రాజీనామా అస్త్రం. అది ప్రయోగించిన మొదటి వ్యక్తిని నేనే. నా రాజీనామాతోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. మంత్రిగా రాజీనామా చేయడం ద్వారా తెలంగాణ అంశాన్ని దేశ వ్యాప్తం చేయగలిగాం. ఇక ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. పార్లమెంట్‌లో ప్రశ్నించడం ద్వారా పెద్దపల్లి ప్రాంతంలోని గని కార్మికుల సమస్యలు తీర్చగలుగుతాం. అలాగే ఎన్నో వనరులున్న పెద్దపల్లి ప్రాంతంలో 10 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా కొత్త పరిశ్రమలు తీసుకువస్తా. పెద్దపల్లి గడ్డ ఉద్యమకారులను ఆదరించిన ప్రాంతం కావడం వల్ల దీనిని ఎంచుకొని ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడ్డాను. గెలుపుపై విశ్వాసం ఉంది. ప్రజలు మార్పు కోరుతున్నారు. అది నా గెలుపునకు ఉపయోగపడుతుంది. మా పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.

జనం కోసం జాబ్‌ వదులుకున్నా
భారతీయ జనతాపార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ. ప్రధానమంత్రి మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఇలా బీసీ, ఎస్సీలకు బీజేపీ ఉన్నత పదవులు ఇచ్చింది. అందుకే ఆ పార్టీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించి ఎన్టీపీసీ భూ నిర్వాసితుల కోసం ఉద్యోగాన్ని వదులుకొని వారి కోసం ఉద్యమించా. ఎన్టీపీసీ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు, తెలంగాణ ఉద్యమం కోసం రెండుసార్లు ఆమరణ దీక్ష చేపట్టాను. సింగరేణి కార్మికుడి కొడుకుగా నన్ను సింగరేణి ఓటర్లు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. కేంద్రంలో మోదీ పాలనలోనే అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా జరుగుతోంది. అది బీజేపీతోనే సాధ్యం. ప్రజలకు ఆ విషయం తెలుసు.– ఎస్‌.కుమార్,బీజేపీ అభ్యర్థి

అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదీ పరిస్థితి
పెద్దపల్లి:    ‘గులాబీ’ కోట

ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో 2009 మినహా మిగతా అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి కేడర్‌ ఉండడం పార్లమెంటు ఎన్నికల్లో కలిసివచ్చే అంశం. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పోటీ చేసి 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉంది. ఇక బీజేపీ ఇక్కడ యువతనే ఎక్కువగా నమ్ముకుంది.

ధర్మపురి: టీఆర్‌ఎస్‌దే గురి
ఈ నియోజకవర్గంలో వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన కొప్పుల ఈశ్వర్‌ ప్రస్తుతం సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రి కావడంతో స్థానికంగా కేడర్‌ను మరింత బలపర్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి వరుసగా నాలుగుసార్లు ఓటమి చవిచూసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు స్థానికంగా పేరుంది. మోదీ ఛరిష్మాను నమ్ముకుని బీజేపీ ముందుకెళ్తోంది.

రామగుండం: గట్టెక్కించేది కార్మికులే!
సింగరేణి కార్మికుల మద్దతుంటే ఇక్కడ విజయం సాధించినట్లే. 2014 ఎన్నికలు మినహా టీఆర్‌ఎస్‌ ఇక్కడ విజయం సాధించలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సోమారపు సత్యనారాయణ తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో మరోసారి గెలిచారు. 2018 ఎన్నికల్లో 2 వేలలోపు ఓట్లతో ఓడిపోయారు. సింగరేణి కార్మికుల మొగ్గును బట్టే ఇక్కడ ఫలితం ఉంటుంది.

మంథని: అంతరంగమేమిటో!
కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కేడర్‌ ఉన్న నియోజకవర్గమిది. 2014 ఎన్నికల్లో మినహా ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవలేదు. తాజాగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పార్లమెంటు ఎన్నికలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌తో పాటు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఓట్లు రాలతాయనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకెళ్తోంది. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ శ్రమిస్తోంది.

మంచిర్యాల: మూడు పార్టీలూ..
తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్న నియోజకవర్గమిది. గత నాలుగు అసెం బ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు పార్టీ బలమైన కేడర్‌తో పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ఆ పార్టీ విశ్వసిస్తోంది. గత ఎన్నికల్లో టఫ్‌ ఫైట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఈసారి కూడా దక్కించుకునేలా ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో వీలైనం త ఎక్కువ ఓట్లను రాబట్టేలా కేడర్‌ ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు బీజేపీ సైతం ఓట్లను రాబట్టేందుకు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

చెన్నూరు: ‘కారు’ వెన్నంటే..
టీఆర్‌ఎస్‌కు బలమైన ఓటుబ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఇదొకటి. 2009 నుంచి వరుసగా టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కాకుండా పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు పార్టీ టికెట్‌ కేటాయించగా భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ఇక్కడ భారీ మెజార్టీ దక్కే అవకాశం ఉంది.

బెల్లంపల్లి: ఎవరికి తీపి?
టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు ఇక్కడ విజయం సాధించింది. క్షేత్రస్థాయిలో కేడర్‌ బలంగా ఉండడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలహీనమైంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీఎస్‌పీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇక్కడ గరిష్ట స్థాయిలో ఓట్లు రాబట్టేందుకు శ్రమిస్తోంది.

లోక్‌సభ ఓటర్లు
పురుషులు:     8,07,233
స్త్రీలు:             8,25,565
ఇతరులు:      26
మొత్తం:        14,69,056

2014 లోక్‌సభ ఎన్నికల ఫలితం
అభ్యర్థి            వచ్చిన ఓట్లు
బాల్క సుమన్‌  5,65,496
జి.వివేకానంద   2,74,338
జే.శరత్‌బాబు    63,334

టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే..
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తేనే పార్లమెంట్‌ సమావేశాల్లో సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు కార్మికుల ప్రధాన డిమాండ్‌. భూగర్భంలో పని చేస్తున్న కార్మికులకు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు కటింగ్‌ చేస్తున్నారు. నాకు గడిచిన నాలుగు నెలల్లో రూ.17 వేలు కటింగ్‌ చేశారు. మా సమస్యలపై లోక్‌సభలో చర్చ జరగాలి.– నాగుల శంకర్, సింగరేణి ఉద్యోగి,గోదావరిఖని

నలభై ఏళ్లుగా కూలీ పనే..
నా పెళ్లయి నలభై ఏళ్లయింది. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న. ఏ ప్రభుత్వ హయాంలోనూ మా దశ మారలేదు. నేను బస్టాండ్‌లో పూలు అమ్ముకుంటున్న. నా భర్త కూలీ పనికే పోతుండు. ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలో లేదో నిర్ణయించుకోలేదు.– కే.పోచవ్వ, బందంపల్లి

అందరూ మంచిగుందంటుండ్రు
నేను సోడా బండి నడిపి జీవిస్తున్నా. పెద్దగా చదువుకోలేదు.ఎన్నికల సమయం కావడంతో అందరినీ ఆసక్తి కొద్దీ అడుగుతున్నా.. ఏ ప్రభుత్వం బాగుందని? టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధిజరుగుతుందని అందరూ చెబుతున్నరు. నేను కూడా ఆ పార్టీకే మద్దతు ఇస్తా.– తాటిపాముల సంపత్,సోడాబండి వ్యాపారి, గోదావరిఖని

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top