డ్రోన్లు ఎగరేయలేదు : రేవంత్‌రెడ్డి

Revanth Reddy Writ Petition In High Court Over Police - Sakshi

పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారు

కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి 

హైకోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: చట్ట వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖుల నివాసాలపై డ్రోన్‌ కెమెరాలను ఎగరేశామని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఎలాంటి డ్రోన్లు ఎగరేయలేదని పేర్కొన్నారు. అయినా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్‌కు తరలించకూడదని అర్వేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మాదాపూర్‌ ఏసీపీ ఎన్‌.శ్యాం ప్రసాద్‌రావు, మాదాపూర్‌ ఎస్‌హెచ్‌వో ఎం.గంగాధర్‌ ఉల్లంఘించారని రిట్‌లో పేర్కొన్నారు. వీరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు.

తొలుత తనపై ఐపీసీ సెక్షన్‌–188 కింద కేసు పెట్టిన పోలీసులు.. తర్వాత పలు సెక్షన్లు చేర్చారని తెలిపారు. ఐపీసీ 287, 115, 109, 120(బీ), 201 సెక్షన్లు, ఎయిర్‌ క్రాఫ్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 11(ఏ) రెడ్‌విత్‌ 5(ఏ) కింద కేసు పెట్టారని వివరించారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఏడేళ్లలోపే శిక్ష పడుతుందని, అయినా తనను కావాలని పోలీసులు రిమాండ్‌కు తరలించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌–41 కింద తనకు ముందుగా నోటీసు ఇవ్వాలన్న నిబంధనను సైతం పోలీసులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఈ ఏడాది మార్చి 1న రాత్రి 9 గంటలకు రామచంద్రపురం పీఎస్‌లో నిర్బంధించారని, మళ్లీ రావాలని చెప్పి విడిచిపెట్టారని తెలిపారు. తానే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తనకు సంబంధం లేదని చెప్పినా వినకుండా, పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని తెలిసినా అరెస్ట్‌ చేశారన్నారు. ఈ రిట్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top