ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : ఉత్తమ్‌

Uttam Kumar Reddy Sensational Comments On KCR - Sakshi

ప్రజల పక్షాన పోరాడితే అరెస్టులు చేస్తారా?

రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నారు

పోలీసు వ్యవస్థ కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంలా పనిచేస్తోంది

కరోనా కట్టడిలో సర్కారు విఫలం 

ముఖ్యమంత్రిపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నిప్పులు

సాక్షి, సంగారెడ్డి: ప్రజల పక్షాన, రైతుల సమస్యలపై పోరాటం చేస్తుంటే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టు సంద ర్శనకు వస్తున్న ఆయనను పటాన్‌చెరు సమీపం లోని టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేసిన అనంతరం స్టేషన్‌ ఎదుట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్‌ తీరుపై నిప్పులు చెరిగారు. విపక్షాలు ప్రజల పక్షాన పోరాటం చేసే క్రమంలో బయటకు వెళ్తే చాలు.. అక్రమంగా, అవమాన కరంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘ప్రతిపక్ష పార్టీ నేతగా, టీపీసీసీ అధ్యక్షుడిగా, ఓ ఎంపీగా ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్తే అరె స్టులు చేస్తారా?’అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పది మందిమి.. ఎండిపోయిన మంజీరా డ్యామ్‌ సందర్శనకు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా సింగూరు, మంజీరలను నింపు తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని అన్నారు. కొండ పోచమ్మ నుంచి కేసీఆర్‌ ఫాంహౌస్‌కు నీళ్లు వెళుతు న్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప మిగతా ప్రాంతాల్లో సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నా రు. కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టులను సందర్శిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి సరికాదన్నారు. 

కల్వకుంట్ల సైన్యంలా పోలీసులు.. 
పోలీసుల తీరుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్టులు చేస్తారా అని ధ్వజమెత్తారు. ‘డీజీపీని ప్రశ్నిస్తున్నా.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? కేసీఆర్‌ పదివేల మందితో కలసి కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలాంటి ఆంక్షలు ఉండవు.. అదే మేము పది మందితో కలసి ప్రాజెక్టులు సందర్శిస్తే అడ్డుకుంటారా’అని మండిపడ్డారు. హోం మినిస్ట్రీ నోటిఫికేషన్‌ ప్రకారం అరెస్టులు చేస్తున్నామని డీజీపీ చెబుతున్నారని, వేలాది మందితో ప్రారంభోత్సవాలు, వ్యవసాయ సభలు పెడుతున్న కేసీఆర్‌కు, ఆయన అనుచరులకు ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో కేసీఆర్‌ వైఫల్యం చెందారన్నారు. దేశంలోనే తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఈ కార్యక్రమంలో సంగా రెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి), కాంగ్రెస్‌ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఉత్తమ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు పెట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top