అఫ్గాన్ చరిత్రకెక్కింది

ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌పై 224 పరుగుల తేడాతో ఘనవిజయం
వర్షం వచ్చినా... ఒడ్డున పడని బంగ్లా
చిట్టగాంగ్: వానొచ్చి... రెండు సెషన్లను తుడిచేసింది. మరో సెషన్‌నూ చాలాసేపు వెంటాడింది. ఇక మిగిలింది 18 ఓవర్ల ఆటే. ఈ కాసింత సమయంలోనే కొండంత విజయాన్ని సాధించింది క్రికెట్ కూన అఫ్గానిస్తాన్. ఏకైక టెస్టులో అఫ్గాన్ 224 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై చారిత్రక విజయం సాధించింది. గతేడాది టెస్టు హోదా పొందిన అఫ్గానిస్తాన్ రెండోసారి టెస్టు విజయం రుచి చూసింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అఫ్గాన్ బౌలర్, కెప్టెన్ రషీద్ ఖాన్ (6/49) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆతిథ్య బంగ్లాను చుట్టేశాడు. కనీస ఓవర్లను ఆడుకొని... బంగ్లా డ్రాతోనైనా గట్టెక్కలేకపోవడానికి రషీద్ స్పిన్ ఉచ్చే ప్రధాన కారణం. సోమవారం ఈ టెస్టుకు ఆఖరి రోజు. ముందు రోజే 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 44.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. చివరి రోజు అఫ్గాన్ గెలిచేందుకు 4వికెట్లు కావాలి. దీంతో గెలుపు లాంఛనమే అనిపించింది.
వర్షంతో బంగ్లా శిబిరంలో హర్షం...
వర్షంతో సోమవారం ఆట ఓ పట్టాన మొదలే కాలేదు. తొలి సెషన్ పూర్తిగా తుడిచి పెట్టింది. కేవలం 2.1 ఓవర్ల ఆటే జరిగాక మళ్లీ వర్షం ముంచెత్తడంతో రెండో సెషన్ కూడా నిండా మునిగింది. ఈ దశలో ఆతిథ్య బంగ్లా శిబిరం సంబరంగా ఉంది. ఇక డ్రా తప్పదేమో అనుకున్న దశలో ఆఖరి సెషన్ మొదలైంది. కేవలం 18.3 ఓవర్ల ఆటే మిగిలింది. ఈ మాత్రం ఓవర్లను ఆడేయలేమా అన్న ధీమాతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే అఫ్గాన్ బౌలర్లు 17.2 ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు తీశారు. 61.4 ఓవర్లలో 173 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముగించి విజయాన్ని అందుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి