ఓహ్‌.. నమ్మశక్యం కానిరీతిలో.. !

Ball deflects off Ben Stokes bat during 2019 World Cup final - Sakshi

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్‌ ప్రేమికుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. విశ్వకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడం.. సూపర్‌ ఓవర్‌కు వెళ్లడం.. సూపర్‌ కూడా టై కావడం ఇదే తొలిసారి. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతూ.. చూసే ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టి.. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్‌కు గురిచేసిన ఫైనల్‌ మ్యాచ్‌.. ఆద్యంతం రోమాంఛితంగా సాగింది. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలా వీక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. నిజానికి ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌.. ఇరుజట్లు వీరోచితంగా పోరాడాయి. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టేందుకు తమ శాయశక్తులు ఒడ్డాయి. సమ ఉజ్జీలుగా కనిపించిన ఇరుజట్లు చివరి బంతి వరకు సింహాల్లా పోరాడాయి. ఫలితం మ్యాచ్‌ టై కావడమే.. కాకుండా సూపర్‌ ఓవర్‌ కూడా టై అయింది.

ఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు వీరోచితంగా పోరాడినా.. ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. ముఖ్యంగా 50 ఓవర్‌లో జరిగిన ఓ అరుదైన, అద్భుత ఘటన కివీస్‌ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 15 పరుగులు అవసరం. ఈ దశలో కివీస్‌ విజయానికి అడ్డుగోడలా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ నిలబడ్డాడు. చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతులు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్‌ సిక్సర్‌గా మలిచాడు. మరో  మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి ఓ అద్భుతం చోటుచేసుకొని.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్‌లోకి తరలించిన స్టోక్స్‌.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్‌ గఫ్టిల్‌ విసిరిన బంతి.. నేరుగా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి.. బౌండరీ దిశగా దూసుకుపోయింది. నమ్మశక్యం కాని ఈ పరిణామంతో కివీస్‌ ఆటగాళ్లు షాక్‌ తిన్నారు. నిజానికి ఇందులో స్టోక్స్‌ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు. రెండో పరుగు తీస్తున్న సమయంలో అతను బంతిని చూడనేలేదు. కానీ గఫ్టిల్‌ విసిరిన బంతి నేరుగా వచ్చి స్టోక్స్‌ బ్యాటుకు తగిలింది. ఇలా ఈ బంతికి అనూహ్యంగా ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం వరించేది. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి.. ఇద్దరు రన్నౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది. మ్యాచ్‌ టై అయింది. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా కావడం.. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ జట్టును విశ్వవిజేతగా ప్రకటించడం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top