హిట్‌ వికెట్‌!

Bangladesh Captain Shakib Al Hasan Banned For Two Years - Sakshi

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై రెండేళ్ల నిషేధం

ఫిక్సింగ్‌ కోసం బుకీ సంప్రదించిన విషయాన్ని దాచినందుకు ఐసీసీ చర్య

భారత్‌తో సిరీస్‌కు, వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌కు దూరం

ఢాకా/దుబాయ్‌: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్‌ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్‌ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. బంగ్లా కెప్టె న్‌పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు చేసింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించింది. ‘అవినీతికి పాల్పడేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదైనా తప్పనిసరి కారణం ఉంటే తప్ప ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలి.

ఎంత ఆలస్యం చేస్తే విచారణ అంత సంక్లిష్టంగా మారుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ మ్యాచ్‌ కోసమైతే సంప్రదించారో ఆ మ్యాచ్‌ ముగిసేవరకు కూడా ఆగరాదు’ అని ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4 చెబుతోంది. దీని ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ నిబంధనను షకీబ్‌ అతిక్రమించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన షకీబ్‌కు నియమ నిబంధనలపై అన్ని రకాలుగా అవగాహన ఉందని, అయినా సరే అతను దీనిని వెల్లడించకపోవడం తప్పిదంగా భావిస్తున్నట్లు ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ క్రికెట్‌లో చిన్నపాటి కుదుపు. మళ్లీ ఫిక్సింగ్‌ తుఫాన్‌ ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది. అయితే ఈ సారి కొంత భిన్నమైన రూపంలో! మ్యాచ్‌లు ఫిక్స్‌ చేయకపోయినా, అందుకు ప్రేరేపించిన వారి గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో విఫలమైనందుకు తీవ్ర చర్య! బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్, ప్రపంచ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై రెండేళ్ల నిషేధం పడింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన వివాదంలో ఒక అంతర్జాతీయ కెప్టెన్‌పై ఈ తరహాలో వేటు పడటం అనూహ్య, అరుదైన పరిణామం. తాజా శిక్ష నేపథ్యంలో 32 ఏళ్ల షకీబ్‌ కెరీర్‌ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఏడాది తర్వాత ఆడవచ్చు...
రెండేళ్ల నిషేధంలో మొదటి సంవత్సరంలో షకీబ్‌ పూర్తిగా ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అతను మళ్లీ ఎలాంటి తప్పూ చేయరాదు. ఐసీసీ అవినీతి నిరోధక ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాతి 12 నెలలు అతనిపై ఐసీసీ పర్యవేక్షణ (సస్పెండెడ్‌ సెన్‌టెన్స్‌) కొనసాగుతుంది. 2020 అక్టోబర్‌ 29 నుంచి షకీబ్‌ మళ్లీ క్రికెట్‌ బరిలోకి దిగేందుకు అర్హుడవుతాడు.

వరల్డ్‌ కప్‌కు దూరం... 
తాజా పరిణామంలో షకీబ్‌ భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో 3వ (టెస్టు), 1వ (వన్డే), 2వ (టి20) స్థానాల్లో అతను కొనసాగుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌లలో షకీబ్‌ కీలక ఆటగాడు. నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడే అవకాశం లేదు. అయితే అన్నింటికి మించి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌ అవకాశాలు కోల్పోవడం బంగ్లాదేశ్‌ జట్టుకు పెద్ద దెబ్బ. ఈ టోర్నీ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరుగుతుంది. అక్టోబర్‌ 29 నుంచి అతను అందుబాటులోకి వస్తున్నా నిషేధం కొనసాగుతున్న సమయంలో అతడిని ఎంపిక చేసే సాహసం బంగ్లా బోర్డు చేస్తుందా అనేది సందేహమే.

విభేదాలే కారణమా! 
కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి వార్తలు వచ్చాయి. ఇవేవీ నిర్ధారణ కాకున్నా బంగ్లా బోర్డుకు దీనిపై సమాచారమైతే ఉంది. అయితే ఇప్పుడు సరిగ్గా భారత్‌తో సిరీస్‌కు ముందు ఏడాది క్రితంనాటి అంశం బయటపడటం సందేహాలు రేకెత్తించింది. వారం రోజుల క్రితం తమ కాంట్రాక్ట్‌ ఫీజులు పెంచడం మొదలు ఇతర సమస్యలు తీర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మె చేయగా దీనికి షకీబ్‌ నాయకత్వం వహించాడు. చర్చలు సఫలమై సమ్మె ముగిసినా... అంతర్గతంగా పరిస్థితి చక్కబడలేదు. షకీబ్‌ తదితర ఆటగాళ్లు తిరుగుబాటు చేసి భారత్‌తో సిరీస్‌కు వెళ్లకుండా కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ స్వయంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ బహిరంగ వ్యాఖ్య చేయడం దీనిని నిర్ధారించింది. బుధవారం బంగ్లా జట్టు భారత్‌కు బయల్దేరాల్సి ఉంది. బోర్డు రాజకీయాలకు, షకీబ్‌ నిషేధానికి ఏదైనా సంబంధం ఉండవచ్చని వినిపిస్తోంది.

ఐపీఎల్‌ వరకు ఆగమంటావా!...షకీబ్‌తో బుకీ వాట్సప్‌ సంభాషణ
బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే పాల్గొన్న ముక్కోణపు వన్డే టోర్నీ, ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌కు సంబంధించి బుకీలు షకీబ్‌తో ఫిక్సింగ్‌ చేయించేందుకు ప్రయత్నించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత బుకీగా అనుమానిస్తున్న అగర్వాల్‌ అనే వ్యక్తి షకీబ్‌తో వాట్సప్‌ చాటింగ్‌ చేశాడు. ముందుగా 2017 నవంబర్‌లో ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ సమయంలో ఒక మిత్రుడి ద్వారా షకీబ్‌ ఫోన్‌ నంబర్‌ను అగర్వాల్‌ తెలుసుకున్నాడు. ఆ తర్వాత తనను కలవాలనుకుంటున్నట్లు మెసేజ్‌లు పెట్టాడు.

2018 జనవరిలో ముక్కోణపు టోర్నీ సందర్భంగా ‘మనం ఈ టోర్నీలో పని చేద్దామా లేక ఐపీఎల్‌ వరకు ఆగమంటావా’ అని అగర్వాల్‌ సందేశం పంపాడు. 2018 ఏప్రిల్‌లో పంజాబ్, సన్‌రైజర్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. సన్‌రైజర్స్‌ తరఫున ఆ మ్యాచ్‌లో ఎవరెవరు ఆడుతున్నారో బుకీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీనికీ షకీబ్‌ స్పందించలేదు. ఆ తర్వాత అగర్వాల్‌ను బుకీగా భావించి తాను దూరమైనట్లు షకీబ్‌ ఐసీసీ విచారణలో వెల్లడించాడు. అయితే ఈ సమాచారం మొత్తం తమకు అందించకపోవడమే షకీబ్‌ చేసిన తప్పని ఐసీసీ చెప్పింది.

నిషేధం కారణంగా నేను ఎంతో ప్రేమించే ఆటకు దూరం కావడం చాలా బాధగా ఉంది. అయితే బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పనందుకు నాపై విధించిన శిక్షను అంగీకరిస్తున్నాను. అవినీతికి వ్యతిరేకంగా పని చేయడంలో ఆటగాళ్లు ముందు వరుసలో ఉండాలని ఐసీసీ కోరుకుంటుంది. ఈ విషయంలో నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను. క్రికెట్‌ అవినీతి రహితంగా ఉండాలనే చాలా మందిలాగే నేనూ కోరుకుంటున్నా. ఇకపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగంతో కలిసి పని చేస్తా. నేను చేసిన తప్పును కుర్రాళ్లు చేయకుండా చూస్తా.
–షకీబ్‌ అల్‌ హసన్‌

కెప్టెన్లుగా మోమిన్, మహ్ముదుల్లా 
షకీబ్‌ దూరమైన నేపథ్యంలో భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు బంగ్లాదేశ్‌ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు మోమినుల్‌ హక్, టి20 జట్టుకు మహ్ముదుల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ పర్యటనలో భారత్‌–బంగ్లా మధ్య 3 టి20 మ్యాచ్‌లు, 2 టెస్టులు జరుగుతాయి.

మరోవైపు షకీబ్‌కు తాము అండగా నిలుస్తామని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రకటించారు. ‘షకీబ్‌ తప్పు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం తనకూ తెలుసు. ఐసీసీ నిర్ణయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదు కానీ అతను తన తప్పు తెలుసుకొని మరింత తెలివైన ఆటగాడిగా తిరిగొస్తాడు’ అని హసీనా వ్యాఖ్యానించారు.

వివాదాల ‘హీరో’ 
అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 12 వేల పరుగులు, 500కు పైగా వికెట్లు... మూడు ఫార్మాట్‌ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఏకైక ఆల్‌రౌండర్‌... ఒకే టెస్టులో సెంచరీ చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టిన అరుదైన రికార్డు... 13 ఏళ్ల కెరీర్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ సాధించిన ఘనతలెన్నో... మరో మాటకు తావు లేకుండా, నిస్సందేహంగా అతను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు. జట్టు సారథిగా కూడా అతను ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. అయితే అంతే స్థాయిలో అతను వివాదాలతో కూడా సహవాసం చేశాడు. తాజా నిషేధం నేపథ్యంలో గతంలో షకీబ్‌ చేసిన తప్పుల జాబితాను చూస్తే...
►2010 సైట్‌స్క్రీన్‌కు అడ్డుగా వచ్చిన అభిమానిని దూషించి బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపణ. మ్యాచ్‌ రిఫరీ హెచ్చరిక. కొన్నాళ్లకు ఢాకాలోని సొంత మైదానంలోనే ప్రేక్షకులు గేలి చేయడంతో వారిని తిడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. మూడేళ్ల తర్వాత ఇదే మైదానంలో మ్యాచ్‌ చూస్తున్న తన భార్యపై కామెంట్‌ చేశారంటూ ఒక అభిమానితో గొడవ. మ్యాచ్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ వదిలి వెళ్లడంపై హెచ్చరిక.
►2014 షకీబ్‌ కెరీర్‌లో ఇది తీవ్ర ఘటన. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను అవుటైన తీరును భారీ స్క్రీన్‌పై కెమెరామెన్‌ చూపించడంతో...అక్కడ కాదు ‘ఇక్కడ’ చూడమన్నట్లుగా అసభ్య సైగలు చేశాడు. మూడు వన్డేల నిషేధం, జరిమానా పడగా, ఆ తర్వాత క్షమాపణ కోరాడు.
►2014 ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదంటూ బంగ్లా బోర్డు ఆరు నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత జట్టు కోచ్‌ హతురసింఘేతో గొడవ పడ్డాడు.
►2018 శ్రీలంకతో నిదాహస్‌ ట్రోఫీ మ్యాచ్‌లో అంపైర్లు ‘నో బాల్‌’ ఇవ్వనందుకు నిరసనగా సహచరులతో సహా మైదానం వీడి మ్యాచ్‌ను బహిష్కరించే ప్రయత్నం చేశాడు. ఐసీసీ 25 శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానాగా విధించింది.

షకీబ్‌ అంతర్జాతీయ కెరీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top