బెంగాల్‌ 289 ఆలౌట్‌

Bengal All Out For 289 Runs First Innings - Sakshi

కోల్‌కతా: ఆంధ్ర బౌలర్లు చీపురుపల్లి స్టీఫెన్‌ (4/78), శశికాంత్‌ (4/64) తమ పేస్‌ బౌలింగ్‌తో హడలెత్తించడంతో బెంగాల్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో  289 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 241/4తో గురువారం ఆట కొనసాగించిన బెంగాల్‌ మరో 48 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట 21 ఓవర్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆంధ్ర ఇన్నింగ్స్‌ ప్రారంభం కాలేదు.

గాందీకి ప్రవేశం లేదు!
ఆంధ్ర, బెంగాల్‌ రంజీ మ్యాచ్‌ సందర్భంగా వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. బెంగాల్‌ మాజీ క్రికెటర్, ప్రస్తుత సీనియర్‌ జట్టు సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీని బెంగాల్‌ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌నుంచి అనూహ్యంగా బయటకు పంపించారు. సీనియర్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి ఇందుకు కారణమని తెలుస్తోంది. టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మాత్రమే ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదనేది నిబంధన. గాంధీ అనుమతి లేకుండా వచ్చారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే వారు అతడిని బయటకు పంపినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని గాంధీ స్పష్టం చేశాడు.  ఈ విషయంలో గాందీకి మద్దతుగా నిలిచిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) తివారీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు జట్టు బౌలింగ్‌ కోచ్‌ రణదేబ్‌ బోస్‌ను బహిరంగంగా తిట్టడం వల్లే ఈ మ్యాచ్‌లో సీనియర్‌ బౌలర్‌ అశోక్‌ దిండాను తప్పించినట్లు తెలిసింది. అతనిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగానే చివరి నిమిషంలో జట్టునుంచి దూరంగా ఉంచారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top