హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటమి

Delhi Beat Hyderabad By 7 Wickets - Sakshi

న్యూఢిల్లీ:న్యూఢిల్లీ: అనుకున్నట్లే జరిగింది. ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌ ఎలాంటి అద్భుతం చేయలేకపోయింది. ఢిల్లీతో శనివారం ముగిసిన మ్యాచ్‌లోనూ 7 వికెట్లతో పరాజయం పాలై వరుసగా హ్యాట్రిక్‌ ఓటమిని మూటగట్టుకుంది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ నిర్దేశించిన 84 పరుగుల లక్ష్యఛేదనకు... 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 27.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ధ్రువ్‌ షోరే (63 బంతుల్లో 32 నాటౌట్‌; 6 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ 2, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.  

పెద్దగా కష్టపడకుండానే..
విజయానికి మరో 60 పరుగులు... చేతిలో 10 వికెట్లు... క్రీజ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో శిఖర్‌ ధావన్‌... ఆటకు చివరిరోజైన శనివారం ఢిల్లీ విజయ సమీకరణం ఇది. అందరూ అనుకున్నట్టుగానే ఢిల్లీ సులువుగా విజయాన్ని అందుకుంది. నాలుగోరోజు నింపాదిగా మరో 20.5 ఓవర్లు ఆడిన ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కునాల్‌ చండీలా (6) క్రితం రోజు స్కోరు వద్దే అవుటవ్వగా... ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 6 పరుగుల్ని జోడించిన ధావన్‌ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) రవికిరణ్‌ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నితీశ్‌ రాణా (6) క్రీజులో కుదురుకోలేకపోయాడు. దీంతో 52 పరుగులకు ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. మిగతా లాంఛనాన్ని జాంటీ సిద్ధు (31 బంతుల్లో 7; 1 ఫోర్‌)తో కలిసి ధ్రువ్‌ షోరే పూర్తిచేశాడు. దీంతో ఢిల్లీ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. జనవరి 3 నుంచి హైదరాబాద్‌లో జరిగే తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్‌ ఆడనుంది.  

స్కోరు వివరాలు
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌: 284; హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 69; హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: 298; ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌: కునాల్‌ చండేలా (సి) సుమంత్‌ (బి) సిరాజ్‌ 6; శిఖర్‌ ధావన్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 21; ధ్రువ్‌ షోరే (నాటౌట్‌) 32; నితీశ్‌ రాణా (సి) తనయ్‌ త్యాగరాజన్‌ (బి) రవికిరణ్‌ 6; జాంటీ సిద్ధు (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (27.5 ఓవర్లలో 3 వికెట్లకు) 84.
వికెట్ల పతనం: 1–24, 2–46, 3–52.  
బౌలింగ్‌: సిరాజ్‌ 13–3–33–1, రవికిరణ్‌ 11–4–29–2, సీవీ మిలింద్‌ 3.5–1–11–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top