హార్దిక్‌.. టాలెంట్‌ ఉంటే సరిపోదు!

Hardik Pandya Needs To Work Harder, Abdul Razzaq - Sakshi

మనీ ఎక్కువైతే రిలాక్స్‌ అయిపోతారు

హార్దిక్‌ ఇంకా మంచి ఆల్‌ రౌండర్‌ కాలేదు

కరాచీ: టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌గా తీర్చిదిద్దుతానంటూ గతంలో ప్రకటించిన పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌.. మరొకసారి హార్దిక్‌ను టార్గెట్‌ చేశాడు. ఇప్పటికీ హార్దిక్‌ పాండ్యా పూర్తి స్థాయి ఆల్‌ రౌండర్‌ కాలేదని పేర్కొన్నరజాక్‌.. టాలెంట్‌ ఉంటే సరిపోదని, ఇంకా శ్రమించాలని కొత్త పల్లవి అందుకున్నాడు. అదే సమయంలో ఏ క్రికెటర్‌కైనా మనీ ఎక్కువైతే రిలాక్స్‌ అయిపోతారంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్యూలో రజాక్‌ మాట్లాడుతూ.. హార్దిక్‌ గురించి పలు విషయాలను ప్రస్తావించాడు. ‘ హార్దిక్‌ ఒక మంచి క్రికెటర్‌.  కానీ ఇంకా పూర్తి స్థాయి ఆల్‌ రౌండర్‌ కాలేదు. హార్దిక్‌ మెరుగైన ఆల్‌ రౌండర్‌ కావాలాంటే మరింత కష్టపడాలి. గేమ్‌కు సాధ్యమైనంత సమయం కేటాయించకపోతే అది నిన్ను వదిలేస్తుంది. హార్దిక్‌ శారీరకంగా, మానసికంగా గేమ్‌పై దృష్టి పెట్టాలి. రిలాక్స్‌ అయితే అది చాలా ప్రమాదం. కొంతమంది డబ్బు ఎక్కువైతే చేసే పని మీద ఫోకస్‌ చేయరు. దాంతో మళ్లీ మొదటకొస్తారు’ అని క్లాస్‌ తీసుకున్నాడు. ఇక్కడ తమ దేశ క్రికెటర్‌ మహ్మద్‌ అమిర్‌ను ఉదహరించాడు. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అమిర్‌ రిలాక్స్‌ అయిపోవడం వల్లే అతని కెరీర్‌ గాడి తప్పిందన్నాడు. ఇదే విషయం ఎవరికైనా వర్తిస్తుందని హార్దిక్‌ను పరోక్షంగా హెచ్చరించాడు. (టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్‌)

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా అది కరోనా వైరస్‌ కారణంగా జరగలేదు. కాగా, హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్‌..  ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దాంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత రికార్డు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా హార్దిక్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు  కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.  ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో  25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించాడు. (నా వద్ద రోహిత్‌, కోహ్లిలకు చోటు లేదు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top