‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

Virat Kohli Interest To Participate In West Indies Series - Sakshi

ముంబై : ప్రపంచకప్‌ అనంతరం వెస్టిండీస్‌ పర్యటనపై టీమిండియా ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ సిరీస్‌కు ఆటగాళ్ల ఎంపిక సెలక్టర్లకు, బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలోనే సారథి విరాట్‌ కోహ్లి నిర్ణయం సెలక్టర్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగా అనుకున్న ప్రకారం వెస్టిండీస్‌తో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు కోహ్లి, జస్ప్రిత్‌ బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. దీనికి కోహ్లి, బుమ్రాలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా అనూహ్య ఓటమి.. అనంతరం జరిగిన పలు నాటకీయ పరిణామాల అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. విశ్రాంతిని తీసుకోనని, పూర్తి స్థాయి వెస్టిండీస్‌ పర్యటనకు వెళతానని సెలక్టర్లకు కోహ్లి తెలిపినట్టు సమాచారం. (చదవండి: వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!)

‘విండీస్‌ పర్యటనకు విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లి ఇష్టపడటం లేదు, ప్రపంచకప్‌ ఓటమి అనంతరం అతడు చాలా కుంగిపోయాడు. క్రికెట్‌తోనే మరల పునరుత్తేజం లభిస్తుందని భావించడంతో కోహ్లి తన నిర్ణయం మార్చుకున్నాడు’అంటూ బీసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్‌ ఓటమి అనంంతరం కెప్టెన్‌, కోచ్‌ల మార్పుపై తీవ్ర చర్చజరుగుతున్న నేపథ్యంలో రిస్క్‌ చేయడం ఇష్టం లేకనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక విండీస్‌ టూర్‌లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 3న టీ20తో విండీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విండీస్‌ పర్యటన నేపథ్యంలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రపంచకప్‌ అనంతరం ఆటకు గుడ్‌బై చెబుతానన్న గేల్‌.. తన ప్రియ నేస్తం భారత్‌తో సిరీస్‌ ముగిశాక క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇక టీమిండియా కెప్టెన్‌ రోహితేనా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top