ఫీల్డింగ్‌ తీసుకుందామనుకున్నా.. కానీ.. !

We Wanted To Field First But Toss Is Not In Our Hands, Harman - Sakshi

సిడ్నీ :  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచి ఆసీస్‌ మహిళా కెప్టెన్‌  మెగ్‌ లానింగ్‌.. ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాస్‌  గెలిస్తే తాను కూడా తొలుత ఫీల్డింగ్‌ తీసుకుందామని అనుకున్నానని, కానీ అది మన చేతుల్లో లేని అంశమని భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. తాము మంచి క్రికెట్‌ ఆడటానికి ఇక్కడకు వచ్చామని, ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగుతున్నామని హర్మన్‌ పేర్కొంది. తమ సహజసిద్ధమైన గేమ్‌ను ఆడతామని తెలిపిన హర్మన్‌.. మ్యాచ్‌లో గెలుపు ధీమా వ్యక్తం చేసింది.

విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌లో భారత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్‌ కప్‌లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్‌లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్‌లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది. ఇక టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్‌ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. 

మంధాన, హర్మన్‌లపైనే ఆశలు..
2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్‌ రేట్‌ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్‌ హర్మన్‌ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్‌ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్‌ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్‌ బలగంపై కూడా భారత్‌ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top