గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం ఉద్ధవ్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న సీటును నుంచి సీఎం ఉద్ధవ్‌ను నియమించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని కోరినట్టు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ పరబ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఎవరైనా మంత్రి ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాలేపోతే ఆ పదవికి అనర్హుడవుతారు.
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన సచివాలయంలో గురువారం కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశానికి రావొద్దని సూచించడంతో ఉద్ధవ్ ఠాక్రే దూరంగా ఉన్నారని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు. ఎమ్మెల్సీగా ఆయన పేరును గవర్నర్‌కు ప్రతిపాదించినట్టు చెప్పారు. గతేడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. మే 28 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. గవర్నర్ కోటాలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్సీపీకి చెందిన రాహుల్ నర్వీకర్, రామ్ వద్‌కుటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి