అమిత్‌షాకు ‘పాలమూరు’పై నజర్‌

Amith Shah Comming To MAhabubnagar For Party Membership Registration Programme - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కమల దళపతి అమిత్‌షా త్వరలోనే పాలమూరులో పర్యటించనున్నట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈనెల రెండో వారంలో ఆయన ఇక్కడికి విచ్చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. స్వయంగా సభ్యత్వాలు చేయించడంతో పాటు తాను కూడా మహబూబ్‌నగర్‌ నుంచో జడ్చర్లలోనే పార్టీ క్రీయాశీలక సభ్యత్వం తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోనే పార్టీ క్రీయాశీలక సభ్యత్వం తీసుకుంటానని ఇది వరకే ప్రకటించిన అమిత్‌ షా అందుకోసం పాలమూరును ఎంచుకున్నట్లు తెలిసింది.

ఏంటో వ్యూహరచన ? 
తెలంగాణలో అమిత్‌ షా పర్యటన ఖరారైతే ఆయన ఏ జిల్లాకు వెళ్తారు..? ఎక్కడ్నుంచి క్రీయాశీలక సభ్యత్వం తీసుకుంటారో అనే దానిపై అధి ష్టానం నుంచి జిల్లా నేతలకు స్పష్టమై న సమాచారం ఇంకా రాలేదు. దీంతో అధినేత పర్యటనపై జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే మరో వారంరోజుల్లో అమిత్‌ షా పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అమిత్‌షా మహబూబ్‌నగర్‌ లేదా జడ్చర్ల నుంచి పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో బీజేపీ మరింత పుంజుకుంటుందని జిల్లా నాయకత్వం భావిస్తోంది.   

పాలమూరులో పార్టీ బలోపేతం 
పార్లమెంటు ఎన్నికల్లో బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు అనుకూలంగా ఉన్న పాలమూరుపై కన్నేసింది. 1985, 89, 99లో ఉమ్మడి జిల్లా పరిధిలోని అలంపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బీజేపీకి చెందిన రావుల రవీంద్రనాధ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా, 1999 లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీగా.. 2011 ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు.

తాజాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లాలోని మహబూబ్‌నగర్, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో పుంజుకుంది. దీంతో తనకు అనుకూలంగా ఉన్న జిల్లాలో కాస్త కష్టపడితే పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే పట్టుదలతో బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఉంది. అమిత్‌ షా పర్యటన ఖరారైతే పార్టీ మరింతగా పుంజుకుంటుందని జిల్లా నాయకత్వం భావిస్తోంది. అమిత్‌షా పర్యటన త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు కలిసివచ్చే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

కేంద్రంలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మాతో పుర ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పట్నుంచే పట్టణాల్లో పార్టీని బలోపేతంపై నాయకులు దృష్టిపెట్టారు. 

ఉద్యమంలా సభ్యత్వ నమోదు.. 
గత నెల ఆరో తేదీ నుంచి ప్రారం¿మైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు 50వేలు, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాకు 40వేలు, నారాయణపేట 30వేలు, వనపర్తి జిల్లాలో 20 వేల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా నిర్ణయించుకోగా దాదాపు అన్ని చోట్లా సభ్యత్వ లక్ష్యం దాదాపుగా పూర్తయింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top