పెళ్లి ఆపండి

Bride Call to She Team For Stop Her Marriage in Rangareddy - Sakshi

నాకు చదువుకోవాలని ఉంది

షీటీంకు ఓ అమ్మాయి ఫోన్‌

తల్లిదండ్రులపై ఐసీడీఎస్‌ అధికారికి ఫిర్యాదు

ప్రభుత్వ హాస్టల్‌లో ఉండే అవకాశం కల్పించాలని అభ్యర్థన

షాద్‌నగర్‌ రూరల్‌: ‘నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్‌ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై ఐసీడీఎస్‌ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురువారం షాద్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే... ఫరూఖ్‌నగర్‌ గుండుకేరికి చెందిన అమ్మాయి(18) పదో తరగతి పూర్తి చేసింది. (‘ప్రేమ పెళ్లి’కి ప్రోత్సాహం)

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో ఈమెకు పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 31న వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని సదరు అమ్మాయి షీ టీం పోలీసులకు ఫోన్‌ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అమ్మాయి.. ఐసీడీఎస్‌ అధికారి నాగమణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎక్కడైనా ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి చదువకునే అవకాశం కల్పించాలని కోరింది. దీంతో నాగమణి అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం షీ టీం పోలీసులు విషయాన్ని షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌కు వివరించి యువతిని హైదరాబాద్‌ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. 

అమ్మాయిని హైదరాబాద్‌కు తీసుకువెళ్తుతున్నషీ టీం పోలీసులు
వేధింపులకు పాల్పడితే చర్యలు..
అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని షీ టీం శంషాబాద్, షాద్‌నగర్‌ జోన్‌ ఇన్‌చార్జ్, ఏఎస్‌ఐ జయరాజ్‌ తెలిపారు. ఎవరు వేధించినా అమ్మాయిలు ఆందోళన చెందకుండా షీ టీం పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వివరాలు అందించిన వారి సమాచారం, పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై దాడులు, వేధింపులు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కల్పింస్తామని చెప్పారు. ముఖ్యంగా కళాశాలలు, బస్టాండ్‌వంటి ప్రాంతాలలో విద్యార్థినులను పోకిరీలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. మహిళలు, యువతులకు ఇబ్బందులు ఎదురైతే సైబరాబాద్‌ షీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617444, శంషాబాద్, షాద్‌నగర్‌ ప్రాంత షీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617354కు వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం పోలీసులు సులోచన, శ్రీనివాస్‌రెడ్డి, లఖన్, ప్రహ్లాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే..
సైబరాబాద్‌ షీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617444
శంషాబాద్, షాద్‌నగర్‌ ప్రాంతషీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617354

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top