మధుర ఫలం.. చైనా విషం!

China Chemical Mixing in Mango Fruits Hyderabad Market - Sakshi

మామిడికాయలను చైనా పౌడర్‌తో మగ్గిస్తున్న వైనం

ఎల్‌బీనగర్, కోహెడ సమీప ఫంక్షన్‌ హాళ్లలో ప్యాకింగ్‌

లాభాపేక్షే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారుల చెలగాటం

కోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌ చేస్తున్న కమిషన్‌ ఏజెంట్లు  

సాక్షి, సిటీబ్యూరో: మామిడి పండ్ల రుచి మధురాతి మధురం. అన్ని వర్గాల ప్రజలూ దీని రుచి ఆస్వాదించేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ.. వ్యాపారుల అత్యాశ కారణంగా ఈ మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్న పండ్లు ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. కరోనా ప్రభావంతో పండ్ల మార్కెట్‌లో మామిడి కాయలను కేవలం లారీల్లోనే ఉంచి విక్రయించడానికి అధికారులు అనుమతిస్తే వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల ఫంక్షన్‌ హాళ్లు, కోహెడ వెళ్లే దారిలో ఉన్న గోడౌన్‌లను అద్దెకు తీసుకొని కాయలను మగ్గించడానికి విషపూరితమైన చైనా పౌడర్‌ను వాడుతున్నారు. మార్కెట్ల అనుమతులు లేకపోవడంతో స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడే మామిడి కాయలను ప్యాకింగ్‌ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్‌ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది.

కాలుష్య కార్బైడ్‌ నిషేధం..
చైనా పౌడర్‌లో కార్బైడ్‌ ఉందని విషయం గతంలో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో వెల్లడైంది. కార్బైడ్‌ ద్వారా మిగ్గించిన పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.  కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. వ్యాపారులు రూట్‌ మార్చి కార్బైడ్‌కు బదులుగా చైనా పౌడర్‌తో మగ్గిస్తున్నారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథలిన్‌ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చి విక్రయిస్తున్నారు. మామిడి కాయల్ని మగ్గించడానికి కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మార్కెట్‌లో ప్యాకింగ్‌ చేయడంలేదు.. 
మార్కెట్‌లో కేవలం మామిడి కాయల లారీల్లో ఉంచి విక్రయించడానికి అనుమతి ఉంది.  అయితే.. మామిడికాయలను మార్కెట్‌ యార్డ్‌లో ప్యాకింగ్‌ చేయడం లేదు. వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేసిన కాయలను ఎల్‌బీనగర్‌తో పాటు  తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లలో ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఆహారభద్రత శాఖ నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top