మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థల బంద్‌: సీఎం కేసీఆర్‌

CM KCR Press Meet On Coronavirus After Cabinet Meeting - Sakshi

మ్యారేజ్‌ హాల్స్‌ మూసివేత.. ఇప్పటికే ఖరారైన పెళ్లిళ్లకు మినహాయింపు..

బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, వర్క్‌షాప్‌లు పెట్టొద్దు

స్టేడియాలు, జిమ్‌లు, పబ్బులు, బార్లు, క్లబ్బులు మూసివేత

అతిక్రమిస్తే కఠిన చర్యలు

షాపులు, మాల్స్‌ తెరిచే ఉంటయ్‌

ఆర్టీసీ, మెట్రో రైలు యథాతథం

1,030 అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ బెడ్‌లు

321 సిద్ధంగా ఉన్న ఐసీయూ యూనిట్లు..

కేబినెట్‌ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గురించి రాష్ట్ర ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, రాష్ట్రంలో అసలు కరోనా లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నమోదైందని, అందులో ఒక వ్యక్తి చికిత్స పొంది కోలుకోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడని సీఎం చెప్పారు. మరో ఇద్దరికి అనుమానం ఉన్న నేపథ్యంలో నిర్ధారణ కోసం పుణేకు పంపామని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే వారి గురించి ఆలోచిస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మూడు గంటల పాటు నిర్వహించిన కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో కలసి సీఎం విలేకరులతో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

ముందుజాగ్రత్తగానే చర్యలు..
‘రాష్ట్రంలో ఏదో ఉత్పాతం ఏర్పడింది. పిడుగు పడింది అని ప్రజలు భయపడాల్సిన పనిలేదు. భయోత్పాతం చెంది గందరగోళానికి గురికావా ల్సినవసరం లేదు. అసలు ఇది మనదేశంలో పుట్టిన వైరస్‌ కాదు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ ఈ వైరస్‌ ఒక వ్యక్తి నుంచి చాలా మందికి.. వారి నుంచి చాలా చాలా మందికి సోకుతుందనే ఆలోచనతోనే దాన్ని నియంత్రించేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.

అంతే తప్ప ఎవరూ భయపడొద్దు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు దశల కార్యాచరణ రూపొందించాం. అందులో 15 రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారం రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. కేబినెట్‌ నిర్ణయాలను అందరూ పాటించాల్సిందే. ఎవరికీ మినహాయింపు ఉండదు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టాలను ఎలా అమలు చేయాలో తెలుసు’అని హెచ్చరించారు.

ఇక్కడ పుట్టింది కాదు..
‘ఈ వ్యాధి చైనా నుంచి వచ్చి ఇతర దేశాల్లో పాకుతుందే తప్ప మన దేశంలో పుట్టింది కాదు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 130 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో కేవలం 83 మందికి మాత్రమే వచ్చింది. అందులో 66 మంది విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, 17 మంది విదేశీయులు. వీరిలో 10 మంది కోలుకున్నారు. ఇద్దరు మాత్రమే చనిపోయారు. మిగిలిన వారికి చికిత్స అందుతోంది. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు. బెంబేలెత్తి గందరగోళానికి గురికావొద్దు. ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది’అని సూచించారు.

కేంద్ర సూచనల దృష్ట్యా
‘అసెంబ్లీలో జరిగిన చర్చ, కేబినెట్‌ సమావేశం అనంతరం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. కేంద్రం కూడా చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడబోం. ఈ వైరస్‌ నియంత్రణ కోసం ప్రాథమికంగా రూ.500 కోట్లను కేబినెట్‌ మంజూరు చేసింది. ఈ నిధి సీఎస్‌ అధీనంలో ఉంటుంది. ఏ క్షణంలోనైనా, ఎలాంటి సందర్భంలో అయినా ఈ నిధిని ఖర్చు చేసే సంపూర్ణ స్వేచ్ఛ ఆయనకు ఇస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ కూడా సర్వ సన్నద్ధంగా ఉంది’అని సీఎం వివరించారు. 

ఊళ్లకు పాకే ప్రసక్తే లేదు..
‘ఇది అంతర్జాతీయంగా వస్తున్న వ్యాధి కాబట్టి దేశీయంగా వచ్చే ప్రమాదం లేదు. ఎయిర్‌పోర్టులు, పోర్టుల వద్దే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు సముద్రం లేదు కాబట్టి పోర్టుల వద్ద ప్రమాదం లేదు. ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నందున, బహుళ ఎయిర్‌పోర్టులు లేనందున హైదరాబాద్‌ పరిసరాలకు మాత్రమే ఈ వైరస్‌ పరిమితమవుతుంది. గ్రామీణ ప్రాంతాలకు సోకే అవకాశమే లేదు. ప్రజలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో 200 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు కేంద్రం పంపిన అధికారులు ఉన్నారు. వ్యాధి ప్రబలకుండా వారు స్క్రీనింగ్‌ చేస్తున్నారు’అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

అందుబాటులో పడకలు
‘ఈ వైరస్‌ అనూహ్యంగా పెరిగినా ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 1,020 ఐసొలేషన్‌ పడకలు అందుబాటులో ఉంచాం. ఇవన్నీ కరోనా వైరస్‌ బాధితుల కోసమే.. ప్రత్యేక వార్డుల్లో ఉంటాయి. వీటితో పాటు 321 ఐసీయూ బెడ్‌ యూనిట్లు అందుబాటులో ఉంచాం. 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. వెంటిలేటర్లకు ఎలాంటి కొరత లేదు. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునే క్వారంటైన్‌ కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికే ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి ఆధ్వర్యంలో ఉండే ఈ టాస్క్‌ఫోర్స్‌లో పంచాయతీరాజ్, పురపాలక, అటవీ, పోలీసు తదితర శాఖ అధికారులు ఉంటారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ రోజూ ఒకటి లేదా రెండు సార్లు సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితిని ఆరోగ్య మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తాయి. ఆరోగ్య మంత్రి కూడా పరిస్థితిపై సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు’అని పేర్కొన్నారు.

ప్రజారవాణా యథాతథం
‘ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజా రవాణా యథాతథంగా కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయి. అయితే వాటిలో నిరంతరం శానిటైజేషన్‌ జరుగుతుంది. ప్రజలకు కొనుగోలుకు ఇబ్బంది లేకుండా, సరుకుల కొరత రాకుండా సూపర్‌ మార్కెట్లు, షాపులు, మాల్స్‌ మూసేయట్లేదు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని సీఎం వివరించారు.

మీడియా.. బహుపరాక్‌
‘కరోనా వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో, మీడియాలో (ప్రత్యేకించి ఎలక్ట్రానిక్‌ మీడియా) అతి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం, చట్టం అంటే ఏంటో రుచి చూపిస్తాం. చట్టాలు ఎలా అమలు చేయాలో తెలుసు. ఎవరికీ మినహాయింపు ఉండదు. కొందరు అతిగాళ్లు సోషల్‌ మీడియాలో ఇష్టమున్న ప్రచారం చేస్తున్నారు. వీరిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలు కలిగించడం మంచిది కాదు. వీటిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రచారం చేసే వాళ్లపై నియంత్రణ ఉంటుంది. క్షమించేది లేదు. కఠిన చర్యలుంటాయి’అని కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలు కాకుండా, వారికి సమాచారం ఇచ్చే విధంగా, అవగాహన కలిగించేలా మాత్రమే ప్రచారం చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన తర్వాతే వార్తలు రాయాలని స్పష్టం చేశారు.

ఎవరూ కాపాడలేరు..
‘ఎలక్ట్రానిక్‌ మీడియాలో అతి ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల, జగిత్యాల, కాకరకాయ అంటూ వార్తలు రాస్తున్నారు. వీళ్ల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. మంచిర్యాల, జగిత్యాల, తోక, తొండెం అని రాస్తే క్షమించే పరిస్థితి లేదు. ఆరోగ్య శాఖ నిర్ధారించింది మాత్రమే రాయాలి తప్ప, ఏ మీడియా అయినా ఈడ కేసు, ఆడ కరోనా అని రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మేం పత్రికా స్వేచ్ఛను హరించట్లేదు. భయోత్పాతం సృష్టించడం, తప్పుడు ప్రచారం చేయడం సమాజానికి మంచిది కాదు కాబట్టి మానుకుంటే మంచిది. మాకు ఎలాంటి శషభిషల్లేవు. ప్రభుత్వం అంటే ఏంటో వారే చూస్తారు. ఎవరూ కాపాడలేరు. ప్రభుత్వానికి విచక్షణాధికారాలు ఉంటాయి. ప్రభుత్వ వినతిని కాదని, ఇలాంటి సున్నిత పరిస్థితుల్లో తప్పుడు వార్తలు రాస్తే ఏమవుతుందో అనుభవం వారికే వస్తుంది. అప్పీల్‌ చేయకపోతే మాది తప్పు. విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదు’అని కేసీఆర్‌ మీడియాను కూడా హెచ్చరించారు. 

పరిశుభ్రత పాటిస్తే మంచిది..
‘కరోనా ప్రధానంగా చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలో విస్తరించింది. ఈ ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి, పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వారం రోజుల తర్వాత ఆరోగ్య మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించి, ప్రస్తుతం విధించిన ఆంక్షలు కొనసాగించాలా లేదా ఎత్తేయాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని కోరతాం.

ప్రభుత్వం ఏటా నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణాన్ని అవసరమైతే రద్దు చేస్తాం. శ్రీరామనవమి వంటి పండుగల నిర్వహణకు సంబంధించి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. కరోనాపై లేనిపోని భయాందోళనలు కల్పించొద్దు. మాస్క్‌ల అవసరం అంతగా లేదు. కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రాథమికంగా అనుమానితులు ఉంటే వారి నుంచి నమూనాలు సేకరించి పుణేలోని కేంద్రానికి పంపిస్తున్నాం. కరోనా ప్రభావం కొద్ది రోజులే ఉండే అవకాశం ఉంది. రాకపోకలను తగ్గించుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించొచ్చు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై ఆదివారం స్పీకర్‌ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు’అని సీఎం వెల్లడించారు. 

15 రోజుల కార్యాచరణ అంశాలు..
► ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు శనివారం రాత్రి నుంచి మార్చి 31 వరకు బంద్‌.
► ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఎవరు అతిక్రమించినా తీవ్ర చర్యలుంటాయి. ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు. కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు మూసేయాలి. ఈ రాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. ఎవరూ రిస్క్‌ తీసుకోవద్దు.
► ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఇతర బోర్డు పరీక్షలు యథావిధిగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయి. ఈ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉండే విద్యార్థుల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్‌ వసతి కొనసాగుతుంది. మిగిలిన విద్యార్థులను పంపిస్తారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక శానిటరీ ఏర్పాట్ల కోసం వైద్య శాఖ కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తారు.
► రాష్ట్రంలోని అన్ని మ్యారేజీ హాల్స్‌ మూసివేత. ఇప్పటికే కరారైన ముహూర్తాలు, నిర్ణయించిన పెళ్లిళ్లకు మినహాయింపు. పెళ్లిళ్లు 200 మంది లోపు బంధువులతో (అమ్మాయి తరఫు 100, అబ్బాయి తరఫు 100 మంది) చేసుకుంటే మంచిది. వాళ్ల శ్రేయస్సు, మంచి దృష్ట్యా శుభకార్యాలను ఈ పద్ధతిలో చేసుకోవాలి. మ్యారేజీ హాల్స్‌ విషయంలో ఇప్పటికే పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. మ్యారేజీ హాల్స్‌ యజమానులు మార్చి 31 తర్వాత జరిగే పెళ్లిళ్లకు ఎవరికీ హాల్స్‌ బుకింగ్‌ ఇవ్వొద్దు. అలా ఇస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఓనర్లు రిస్క్‌ తీసుకోవద్దు.
వారం రోజుల పాటు నియంత్రణ వీటిపై..
► బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్‌ ఫెయిర్లు, కల్చరల్‌ ఈవెంట్లకు అనుమతులు ఉండవు. ఇండోర్, అవుట్‌ డోర్‌ స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, జిమ్నాజియమ్స్, జూ పార్కులు, మ్యూజియాలు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు అన్నీ మూసేయాలి. జన సమ్మర్థం ఉండే ప్రాంతాలు కాబట్టి అనుమతి ఉండదు. వెంటనే మూసేయాలి. 
► అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్లు రద్దు. నిర్వహించడానికి వీల్లేదు. సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, మెంబర్‌షిప్‌ క్లబ్బులు కూడా బందే. 

చదవండి:
మహమ్మారి కరోనా.. ప్రపంచానికే పెనుసవాల్‌
కరోనా ఎఫెక్ట్‌: గో మూత్రంతో విందు

కరోనా ఎఫెక్ట్‌ ఎలా ఉందంటే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top