ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది 

CM KCR Says Mission Of The Movement Is Being Fulfilled - Sakshi

విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు

ఇక ధాన్యరాశులకు నిలయంగా రాష్ట్రం

మన ఇంజనీర్ల సత్తాకు నిదర్శనం ‘కాళేశ్వరం’

భూములు త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కారం 

సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టం ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తలాపున పారుతున్న గోదావరి.. మన చేలు, మన బతుకు ఎడారి అని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణలోని ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఎత్తిపోశాం. ఇక ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇలా ఉద్యమ లక్ష్యాలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ పరాయి పాలనలో ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను చినజీయర్‌ స్వామితో కలసి విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధి.. 
ప్రాజెక్టులు కడితే సాగునీరు వస్తుంది. ఇదే సందర్భంలో గ్రామాలు, భూములు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగానికి వెలకట్టలేం. వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీలు ఇచ్చింది. అయినా వారు గూడులేని పక్షులుగా మారిపోయారు. ఇలా త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్‌కు దీటుగా వారికి ఇళ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. 

ఆరేళ్లలోనే పురోగతి... 
పరాయి పాలనలో ఆగమైన తెలంగాణ... స్వరాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. గతంలో కరెంట్‌ కోతలు, నీటి కష్టాలు ఉండేవి. ఇప్పుడు నిరంతర విద్యుత్‌ సరఫరా అందుతోంది. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,300 కోట్లు విడుదల చేశాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వికలాంగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే. సంక్షేమ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చాం.

53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు« ధాన్య రాసులకు నిలయంగా మారింది. దేశం మొత్తంమీద 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఒక్క తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ విషయం నేను చెప్పేది కాదు.. ఎఫ్‌సీఐ సీఎండీ వీవీ ప్రసాద్‌ చెప్పిన మాటలివి. సాగునీటి ఇబ్బందులు తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ, 7.5 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క–సారక్క, గౌరవెల్లి, గండిపల్లి మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బంగారు పంటలు, భాగ్యరాసులు, పసిడి పంటలు పండే తెలంగాణగా విరజిల్లనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్యారేజీల్లో 40 టీఎంసీలు, రిజర్వాయర్ల ద్వారా 125 టీఎంసీలు మొత్తం 165 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విధాలుగా మొత్తం 530 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం పొందాం. రంగనాయక సాగర్‌ ద్వారా ఇప్పటికే చెరువుల్లోకి జలకళ సంతరించుకుంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ ద్వారా సింగూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తాం. కామారెడ్డి, గుజ్జులు, కాయగల్‌ ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. 

ఇకపై పచ్చటి పొలాల తెలంగాణ... 
ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తయితే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో ఎత్తు. ఇటువంటి కీలక సమస్యను అధిగమిస్తూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వారిని మెప్పించడమే కాకుండా భూమిపూజకు అక్కడి ముఖ్యమంత్రిని ఆహ్వానించాం. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేయాలని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లతోపాటు రూ. 4 వేల కోట్లతో 1,250 చెక్‌ డ్యాంలు నిర్మించాం. వ్యవసాయం లాభసాటి చేయాలనే ఆలోచనతో నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టాం. ఇది నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు.

ఇంజనీర్లకు సెల్యూట్‌..  
తెలంగాణ వారు అంటే తెలివితక్కువ వారని చులకన చేసేవారు. అటువంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించారు. ప్రాజెక్టు ప్రారంభంలో విమర్శలు, శాపనార్థాలు పెట్టినవారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండేలా చూపించారు. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్‌కు జలాలు ఎత్తిపోసేలా ఆవిష్కరణ చేసి చూపించిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్‌. ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి, ఇతర ఇంజనీర్ల మేధాశక్తితో దశాబ్దాలుపట్టే ప్రాజెక్టులను కేవలం నాలుగు సంవత్సరాల్లోనే నిర్మించి సత్తా చాటారు. ఇందుకు సహకరించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు ధన్యవాదాలు. అదేవిధంగా 48 డిగ్రీల ఎండలోనూ పనులు చేసిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వందనాలు తెలుపుతోంది. 400 మెగావాట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం పదేళ్లు పట్టేది. కానీ నాలుగు సంవత్సరాల్లోనే 480 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం కోసం 400 కేవీ సబ్‌స్టేషన్లు ఆరు, 220 కేవీ సబ్‌స్టేషన్లు ఏడు, 135 కేవీ సబ్‌ స్టేషన్లు రెండు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం వేగంగా భూసేకరణ చేసిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి, ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top