కరోనా: హుజూరాబాద్‌లో హై టెన్షన్‌

Corona Positive Cases Rises To 17 In Karimnagar - Sakshi

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఐసోలేషన్‌కు ఏడుగురు అనుమానితులు

సాక్షి, హుజూరాబాద్‌: కరోనా మహమ్మరి హుజూరాబాద్‌లో వణుకు పుట్టిస్తోంది. హుజూరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనకు వెళ్లిన వచ్చిన నేపథ్యంలో వారిని కరీంనగర్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలించగా అక్కడ పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. వారు ఏడుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడించగా గురువారం సాయంత్రం వారిని పోలీసుల సమక్షంలో వైద్య సిబ్బంది కరీంనగర్‌ ఐసోలేషన్‌కు తరలించారు.  

వెంటాడుతున్నకరోనా
సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. కరోనా ప్రమాదం నుంచి బయట పడుతున్నామనుకునే లోపే కొత్త కేసులు నమోదై కలవర పెడుతున్నాయి. ఇప్పటివరకు ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మందితోపాటు వారికి సహకరించిన ఒక వ్యక్తికి... అతని ద్వారా ఇద్దరు కుటుంబసభ్యులకు వైరస్‌ సోకింది. తాజాగా మరో నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. అందులో ఒకరు ఇండోనేసియా బృందంతో కారులో ప్రయాణించిన వ్యక్తి కాగా, మరో ముగ్గురు ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వారు.

ఇండోనేసియా బృందం వెంట ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బుధవారం రాత్రి ప్రకటించారు. కాగా, ఢిల్లీ సమావేశానికి జిల్లా నుంచి హాజరైన 19 మందిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం తేల్చారు. వీరిలో కరీంనగర్‌ వాసి ఒకరు కాగా, హుజూరాబాద్‌కు చెందిన వారు ఇద్దరు ఉండడం గమనార్హం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు కరీంనగర్‌కు మాత్రమే పరిమితమైన కరోనా పక్క పట్టణాలకు విస్తరించినట్లయింది. కొత్తగా నాలుగు కేసులు నమోదైన విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ధ్రువీకరించారు. 

ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు 19 మంది
ఢిల్లీ మర్కజ్‌లో గత నెల 13, 14వ తేదీల్లో జరిగిన ఒక వర్గం మత సమావేశాలకు కరీంనగర్‌ జిల్లా నుంచి 19 మంది హాజరయ్యారు. జిల్లా నుంచి 17 మంది వెళ్లొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించినా, పోలీసుల విచారణలో 19 మంది వెళ్లినట్లు తేలింది. ఈ విషయాన్ని పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ధ్రువీకరించారు. వీరిలో 16 మంది కరీంనగర్‌ నుంచి కాగా, హుజూరాబాద్‌ నుంచి ముగ్గురున్నారు. వీరందరిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. ఇందులో 11మందికి ఇప్పటికే వైరస్‌ నెగెటివ్‌ రాగా, గురువారం ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది.

పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇద్దరు హుజూరాబాద్‌కు చెందిన వ్యక్తులు కాగా. ఒకరు కరీంగనర్‌ వాసి. కాగా ఇంకా ఐదుగురికి సంబంధించిన వైద్య నివేదికలు రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో వీరిని క్వారంటైన్‌ చేశారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారిని హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. కరీంనగర్‌ జిల్లాలో బుధ, గురువారాల్లో కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని, మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తే కరోనా నుంచి కరీంనగర్‌కు విముక్తి లభిస్తుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

600 మంది క్వారంటైన్‌లలో ఐసోలేషన్‌
కరీంనగర్‌ జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా మెలిగిన వారితోపాటు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారి సంబంధీకులు సుమారు 600 మందిని వివిధ రకాలుగా క్వారంటైన్‌ చేశారు. చెల్మెడ ఆనందరావు హాస్పిటల్, శాతవాహన యూనివర్సింటీ, కరీంనగర్, హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర గుర్తించిన కేంద్రాలతోపాటు హోం క్వారంటైన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నవారు 600 మంది వరకు ఉన్నట్టు మంత్రి గంగుల తెలిపారు. వీరికి వారం రోజులపాటు వైద్యుల పర్యవేక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇండోనేసియా బృందం మార్చి 14న కరీంనగర్‌ వచ్చి 16న గాంధీ హాస్పిటల్‌కు వెళ్లగా వారందరికీ పాజిటివ్‌ వచ్చింది. అందులో తొమ్మిది మందికి చికిత్స తరువాత నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చినప్పటికీ, వారిని కలిసిన వారికి, వారి కుటుంబసభ్యులకు వైరస్‌ సోకింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన వారిలో ముగ్గురికి వైరస్‌ సోకడం గమనార్హం. ఇండోనేసియా కేసులు వెలుగు చూసి 15 రోజులు గడిచినా ఇంకా కొత్తకేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

రెడ్‌జోన్‌ ఆంక్షలు కొనసాగింపు...
కరీంనగర్‌లో ఇండోనేసియా బృందం బస చేసి సంచరించిన ముకరంపుర ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ జోన్‌లోని సుమారు 3,500 ఇళ్లకు బాహ్యప్రపంచంతో సంబంధాలు లేకుండా క్వారంటైన్‌ చేశారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ అధికార యంత్రాంగమే సకల సౌకర్యాలు కల్పించింది. కూరగాయలు, పాలు, రేషన్‌సరుకులు ఇలా అన్ని తమ ఇళ్లకే అందించి వారందరూ ఇళ్లలో నుంచి బయటకు రాకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, పోలీస్‌ కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి నిత్యం పర్యవేక్షణ చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

లాక్‌డౌన్, కర్ఫూ్యను కూడా పగడ్బందీగా అమలుచేశారు. దీంతో కొంత ఫలితం కూడా కనిపించింది. 15 రోజుల వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే బుధవారం రాత్రి మరో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందారు. ఇండోనేషియా బృందానికి సహాయకునిగా ఉన్న వ్యక్తితో ప్రయాణం చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా ఢిల్లీ సమావేశాలకు హాజరైన వారిలో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలడం కలవరానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొద్ది సేపు రెడ్‌జోన్‌లో ఆంక్షలు ఎత్తివేసి, మధ్యాహ్నం నుంచి యధావిధిగా ఆంక్షలు కొనసాగించారు.

కరోనాపై కొనసాగుతున్న యుద్ధం..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కరీంనగర్‌లో కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం తనవంతు యుద్ధం చేస్తోంది. మంత్రి గంగుల కమలాకర్, మేయర్‌ వై.సునీల్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ క్రాంతి ఇతర అధికార యంత్రాంగం రెండు వారాలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అనుమానితులను ఐసోలేషన్‌కు తరలించడంతోపాటు ప్రతీ ఇంటికి వెళ్లి స్క్రీనింగ్‌ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటి సర్వేలో ఏఎన్‌ఎంలు, ఆశాలు, వలంటీర్లు చేసే సేవ అంతాఇంతా కాదు. ఏ ఇంట్లో ఎవరుంటారు... వారికి ఎలాంటి జబ్బులున్నాయో కూడా ఆలోచించకుండా తమ వృతి ధర్మాన్ని, అధికారులు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ కరోనా అంతానికి శ్రమిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉంటున్నారా లేదా అని ప్రతీ రోజు పరిశీలిస్తున్నారు. తగిన స్వీయ రక్షణచర్యలు తీసుకొని విధుల్లో పాల్గొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top