పకడ్బందీగా కట్టడి

Coronavirus: DGP Mahender Reddy Comments On Covid-19 Prevention and Lockdown - Sakshi

కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు

పాస్‌ల దుర్వినియోగం అడ్డుకట్టకు కొత్తవి జారీ... డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా, కట్టుదిట్టంగా అమలుచేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అత్యవసర ప్రయాణాలకు వీలుగా ఇప్పటివరకు జారీచేసిన పాసులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్తవి జారీ చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో మే 7 వరకు కఠినంగా వ్యవహరిస్తామని, ఉల్లంఘనలను ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ సమయాల్లో చోటుచేసుకుంటున్న ఉల్లంఘనలపై డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ జితేందర్, వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. గతంలో తాము జారీచేసిన పాసులున్న వారు, ప్రభుత్వోద్యోగులు, ఆసుపత్రికి, బయటికి వెళ్లేవారు లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

1.21 లక్షల వాహనాలు సీజ్‌..: కారణం లేకుండా బయటికొస్తున్న ఆకతాయిలకు చెందిన 1.21 లక్షల వాహనాలను సీజ్‌ చేశాం. లాక్‌డౌన్‌ ముగిశాక కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని దుకాణాలు, సూపర్‌ మార్కెట్లను మూసివేస్తాం. కరోనా కేసులు ఎక్కువున్న గ్రేటర్‌లో లాక్‌డౌన్‌ పాటించడంలో వెనకబడింది. కాలనీ సంఘాలన్నీ దారులు మూసి, ఒకేదారి నుంచి రాకపోకలు సా గించాలి. అద్దెకోసం ఇబ్బంది పెడుతున్న యజమానులకు సంబంధించి డయల్‌ 100కు 36 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. యజమానులకు  కౌన్సెలింగ్‌ ఇస్తాం.. తీరు మారకుంటే కేసులు నమోదు చేస్తాం. కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టిసారించాం. మర్కజ్‌కు వెళ్లొచ్చిన రోహింగ్యాల్లో నల్లగొండలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఐదుగురిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

సీఎంకు కృతజ్ఞతలు..: లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను గుర్తించి పది శాతం ప్రోత్సాహకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.  పోలీసుల పనితీరుకు అభినందనలు.

ఇకపై కట్టుదిట్టంగా ఇలా..
► గతంలో ఆహార, ఐటీ, నిత్యావసర సర్వీసులకు జారీచేసిన పాసులను రద్దుచేసి, కొత్తవి జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్లలో వీటి జారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
► కొత్తగా జారీచేసే పాసులపై రూట్, సమయం, గమ్యస్థానం వంటివి ఉంటాయి. వాటిని పక్కాగా అమలు చేస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం సీజ్‌ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు.
► అనవసరంగా రోడ్లపై తిరిగే ప్రభుత్వోద్యోగుల కట్టడికి వారానికి ఆరు రంగుల చొప్పున ఒక్కోరోజుకు ఒక్కో రంగు ఐడీ కార్డు జారీ చేస్తారు.
► ఆస్పత్రుల పేరు చెప్పి ఇష్టానుసారం తిరిగితే కుదరదు. అత్యవసరమైతే తప్ప, చిన్నపాటి అనారోగ్యాలకు 3 కి.మీ.లోపల ఉన్న ఆస్పత్రికే వెళ్లాలి.  3కి.మీ. నిబంధన ఉల్లంఘించకుండా.. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతీ వ్యక్తి పోలీసులకు నివాస ధ్రువీకరణ తనది లేదా ఇంటి యజమానిది చూపాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top