పీక్కుతింటున్న కార్పొరేట్‌ స్కూళ్లు..

Corporate Schools Demanding School Fees in Lockdown Time Hyderabad - Sakshi

లైవ్‌ క్లాసులు లేకున్నా ఆన్‌లైన్‌ జులుం

కలెక్షన్‌ కేంద్రాలుగా పాఠశాలలు

లక్షలకు లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ విద్యా సంస్థలు

జీఓ బేఖాతర్‌  ఫీజు కట్టకపోతే ఆన్‌లైన్‌ కట్‌

బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్‌లో తన కుమారుడిని రెండో తరగతిలో చేర్పించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. క్లాసులు..టీచర్ల వివరాలు మాట్లాడిన తరువాత ఫీజు గురించి చెబితే అతని కళ్లు బైర్లు కమ్మాయి. రూ. లక్ష వరకు చెల్లించాలని చెప్పారు. అదేమని అడిగితే ఆన్‌లైన్‌ క్లాస్‌..ల్యాప్‌టాప్‌..బుక్స్‌..డ్రెస్‌.. ట్రాన్స్‌పోర్ట్‌ ఇలా కబుర్లు చెప్పారు. వామ్మో..ఇంకా మొదలే కాని స్కూలుకు ఇంత ఫీజా.. వద్దులే బాబూ అనుకొని సారథి హైస్కూల్‌కు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి.  ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో విచారించాడు. రూ.38,500 చెప్పారు. ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అడిగితే మాకేం తెలియదు సార్‌.. ఫీజు కట్టాల్సిందే అని  నిర్లక్ష్యంగాసమాధానం ఇచ్చారు. డబ్బుచెల్లిస్తేనే ఆన్‌లైన్‌ క్లాసులతోచదువులు మొదలవుతాయి.  

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు కరోనా కాలంలోనూ కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై జులం ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న పర్యవేక్షణ లేమి ఈ విద్యా సంస్థలకు కలిసి వస్తోంది. ఆన్‌లైన్‌ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46కు తూట్లు పొడుస్తున్న అనేక విద్యా సంస్థలు వివిధ రకాల పేర్లు చెప్పి అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తాము నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ ఇవ్వమంటూ ఎస్సెమ్మెస్‌లు పంపించి బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? ఎవరికి ఫిర్యాదు చేయాలో? అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తాజా విద్యా సంవత్సరంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం ఈ విద్యా సంస్థలకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. దీంతో సొంత సిలబస్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల్ని మొదలెట్టి, యథేచ్ఛగా కొనసాగించేస్తున్నాయి. ‘సాక్షి టీవీ’ నిఘాలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. (వారు కంపార్టుమెంటల్‌ పాస్‌)

రెండో తరగతికి రూ.లక్షపైనే...
బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్‌ వ్యవహారం ప్రైవేట్‌ స్కూళ్ల వ్యవహారానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఆ పాఠశాలకు రెండో తరగతిలో చేరే విద్యార్థి తండ్రిగా వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధికి అక్కడి ఉద్యోగులు చెప్పిన ఫీజుల లెక్క అవాక్కయ్యేలా ఉంది. అడ్మిషన్‌ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్‌ చేశారు. ఆ ఫీజులో కాస్త తగ్గించమని కోరగా.. ఆ పాఠశాల ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. సమీపంలోని సారథి హైస్కూల్‌లోనూ రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెప్పారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో ట్యూషన్‌ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. మిగిలిన రెండు స్కూళ్ల కంటే ఇక్కడ తక్కువే అయినా.. సామాన్యుడికి మాత్రం భారమే. కేవలం ఈ మూడే కాదు.. నరగంలోని దాదాపు ప్రతి ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూల్‌లోనూ ఫీజుల తీరుతెన్నులు ఇలానే ఉన్నాయి. 

పాత స్టూడెంట్స్‌ నుంచి మరోలా..
కొత్తగా చేరాలని భావించిన విద్యార్థుల నుంచి వసూళ్లు ఇలా ఉంటే.. ఇప్పటికే తమ విద్యార్థులుగా ఉన్న వారి నుంచి ఈ స్కూళ్లు మరోలా పిండుకుంటున్నాయి. దీనికోసం ఆన్‌లైన్‌ క్లాసుల పేరును వాడుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంస్థలు తమ సొంత సిలబస్‌తో ఆన్‌లైన్‌ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. జరుగుతున్నవి ఆన్‌లైన్‌ క్లాసులే అయినప్పటికీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూళ్లలో తగ్గట్లేదు. ట్యూషన్‌ ఫీజు, బిల్డింగ్‌ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్‌మెంట్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజు... ఇలా అందినకాడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్లు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు తమ వద్దే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్‌లైన్‌ క్లాసుల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్‌ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి.  

వారి బాధలు వర్ణనాతీతం...
నగరానికి ఎన్నో ఏళ్ల క్రితం వలసవచ్చిన బడుగుజీవులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నది వీరి కల. దీనికోసం కడుపుకట్టుకుని పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ఉపాధి, ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లు ప్రైవేట్‌ స్కూళ్ల వ్యవహారం మరో షాక్‌ ఇస్తోంది. ఇన్నాళ్లు ఏదో ఒక రకంగా ఫీజులు చెల్లిస్తూ వస్తున్నామని, ప్రస్తుత కరోనా పరిణామాలతో అది సాధ్యం కావట్లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు ఓర్చినా.. ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. టీచర్లు బోర్డు వైపు తిరిగి బోధిస్తున్న ఈ ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థులకు అర్థం కావట్లేదు. వీరికి సందేహాలు వస్తే తీర్చే నాథులే కరువయ్యారు.

ఈ ఇబ్బందులు అదనం...
ఈ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్‌ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ఉంటోంది. అనేక మంది చిన్నారులు తల, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటర్‌నెట్‌లో ప్రవేశించినప్పుడు అనేక మంది చిన్నారులకు అశ్లీల సైట్ల పాప్‌అప్స్, బూతు బొమ్మలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ క్లాసులు జరిగినంత సేపూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పని మానుకుని పిల్లల వద్దే కూర్చోవాల్సి వస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భారం పెరుగుతోంది. వారికి కచ్చితంగా ఒక్కో ఫోన్‌ లేదా ట్యాబ్‌ సమకూర్చాల్సి వస్తోంది. ఒకే సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు కావడంతో ఇది తప్పట్లేదు. కూలినాలీ చేసుకుని జీవించే కుటుంబాల్లో కనీసం స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఉండట్లేదు. దీంతో వీరి పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది.  ఈ

ట్యూషన్‌ ఫీ అంతా కట్టమంటున్నారు
కరోనా కష్టకాలంలో స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్‌ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కానీ విద్యా సంస్థలు మాత్రం లాస్ట్‌ ఇయర్‌ ఫీజు రూ.75 వేలను చెల్లించమంటున్నారు. దాన్ని ట్యూషన్‌ ఫీజు కింద చూపించి కట్టమని ఫోర్స్‌ చేస్తున్నారు. లాస్ట్‌ ఇయర్‌ ఫీజు మొత్తాన్నే ఈ ఏడాది కూడా చెల్లించాలని.. అది కూడా తొమ్మిది వాయిదాల్లో కట్టాలంటున్నారు. ఈ  విషయంలో ఎంత చెప్పినా స్కూల్‌ యాజమాన్యాలు రాజీపడటం లేదు.  
– ఓ విద్యార్థి తండ్రి

ఈ క్లాసులు ఏం రీచ్‌ అవుతాయి?
ప్రభుత్వం జస్ట్‌ జీవో ఇచ్చి వదిలేసింది.మానిటరింగ్‌ ఏంలేదు. స్కూల్‌ నుంచి మామూలుగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఉన్న ఫీజునే ఇప్పడు మంత్లీ పే చేయమంటున్నారు. ఈ విషయంలో స్కూల్‌ వాళ్లుడిమాండ్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ రూ.20 వేలు, రూ.30 వేలు కట్టాలంటున్నారు. కడితేనే బుక్స్‌ అంటున్నారు. బుక్స్‌ లేకుండా క్లాసులు చెప్పడమేంటి.. వాళ్లు చెప్పినా ఏం రీచ్‌ అవుతుంది. అసలు నెక్ట్స్‌ క్లాసు బుక్స్‌ ఏం ఉంటాయోతెలియకుండా ఎలా..? అదేమంటే బుక్స్‌ లేకుండా క్లాసులు చెబుతున్నాం.. నోట్స్‌ ఫ్రిపేర్‌ చేయండని చెబుతున్నారు. 
– ఓ విద్యార్థి తల్లి

ఛాన్స్‌ ఇవ్వడం లేదు..  
ఆన్‌లైన్‌ క్లాసుల్లో టీచర్లు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. డౌట్స్‌ అడుగుదామంటే అసలు ఛాన్స్‌ ఇవ్వడం లేదు. వాళ్ల మానాన వాళ్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. కానీ క్లాసు లాస్ట్‌లో చెబుతాంటున్నారు. ఏమీ ఉండటం లేదు. అర్థం కావడం లేదని చాలా చెప్పాం. కానీ క్లాసుకు టైమ్‌ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్తున్నారు. 
– ఓ విద్యార్థి

పేరెంట్స్‌కు కష్టమే..
ఎల్‌కేజీ వాళ్లకు కూడా ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నారు. పెద్ద క్లాసు వాళ్లు అంటే వింటారు. కానీ చిన్నపిల్లలకు ఏం అర్థం అవుతుంది. వీళ్లకేమీ అర్థమవుతుంది. ఇది పేరెంట్స్‌కు చాలా బర్డెన్‌. చేసే పనులను మానుకుని పిల్లలతో పాటు కూర్చుకోవాల్సి వస్తుంది. స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువ అవడం వల్ల హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తున్నాయి. పాఠాలు మర్చిపోతారనే భయంతోనే ఆన్‌లైన్‌ క్లాసుల్లో కూర్చోపెట్టాల్సి
వస్తుంది.
– ఓ విద్యార్థి తల్లి

బ్యాక్‌ పెయిన్‌ వస్తోంది  
ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలకు బ్యాక్‌ పెయిన్‌ వస్తుంది. అంతేగాకుండా ఐ సైట్‌ ప్రాబ్లమ్‌ వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికి డివైజ్‌ ఇవ్వాలంటే కొంచెం కష్టమే.. చిన్న పిల్లలకు క్లాసులంటే టూ మచ్‌. వాళ్లకి ఏం అర్థమవుతుంది. మేడమ్‌ ఫాస్ట్‌ ఫాస్ట్‌గా చెబుతున్నారు. నేను మళ్లీ చెప్పాల్సి వస్తుంది.   
- ఓ విద్యార్థిని తల్లి

ఫోన్‌ లేక పాఠాలు సాగడం లేదు
చేతన్‌బాగ్‌ స్కూల్‌లో మా అబ్బాయి టెన్త్‌ చదువుతున్నాడు. ఫోన్‌ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఫోన్‌ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోన్‌ లేక పాఠాలు ఆగిపోయాయి. పక్కింటికి వెళ్లాలంటే.. కరోనా వల్ల ఎవరూ రానివ్వడం లేదు. ఇలా కాకుండా ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. దాన్లో చెబితే ఇంత టెన్షన్‌ ఉండదు కదా.. మరి మా పరిస్థితి
ఏంటి..?
– విద్యార్థి తల్లి, చేతన్‌బాగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top