కరువు నేల.. మురిసే వేళ

Godavari Waters Into Ranganayaka Sagar Today - Sakshi

నేడు రంగనాయక సాగర్‌లోకి గోదారి జలాలు

విడుదల చేయనున్న మంత్రులు హరీశ్, కేటీఆర్‌ 

వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మకు నీళ్లు

వచ్చే ఖరీఫ్‌ నాటికి అన్ని చెరువులకూ జలకళ

సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్‌లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పంపులు ఆన్‌ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్‌ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్‌ కల సాకారం కానుంది. 

నేడు రంగనాయక సాగర్‌లోకి గోదావరి
అనంతగిరి సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పంపులు ఆన్‌ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్‌కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్‌కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్‌ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్‌ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం 

రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు..
రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్‌ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్‌ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్‌ వరకు చేరుతాయి.

రంగనాయకసాగర్‌ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు 
 సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్‌పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్‌ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్‌ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షా ఫలం
కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్‌ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్‌ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. 
– హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top