ఉప్పల్‌ జంక్షన్‌లో ‘ఐకానిక్‌ బోర్డు వాక్‌’

HMDA Focus on Iconic Board Walk in Uppal Junction - Sakshi

పాదచారుల భద్రతకు పెద్దపీట

గత రెండేళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో అప్రమత్తం

పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: వరంగల్‌ జాతీయరహదారివైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉప్పల్‌ జంక్షన్‌ వద్దరోడ్డు దాటేందుకు నానా కష్టాలు పడుతున్న పాదచారుల కోసం ‘ఐకానిక్‌ బోర్డు వాక్‌’ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏభావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికను వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఇంజనీరింగ్‌ విభాగాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డిజైన్‌  ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ ఐకానిక్‌ బోర్డు వాక్‌ (స్కైవాక్‌) డిజైన్‌లు పూర్తవగానే టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకితీసుకురావాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.

పాదచారుల భద్రత కోసమే...
వాహనదారులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పాటు సిగ్నల్‌ జంప్‌ చేసి వెళ్లడం వల్ల పాదచారులు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం, మెట్రో కూడా అందుబాటులోకి రావడంతో వాహనాలతో పాటు జనాల రద్దీ కూడా పెరిగింది. అటు వాహనదారులు నిర్లక్ష్యంగా ఉన్నా, ఇటు పాదచారుడు గమనించకుండా ఉన్నా...ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు జరిగితే పాదచారులే బలవుతున్నారు. ఇలా ఉప్పల్‌ జంక్షన్‌లో 2019లో దాదాపు 15 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏ అధికారులు స్కైవాక్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అంతా సవ్యంగా ఉంటే మరో నెల రోజుల్లోనే టెండర్లు పిలిచి నిర్మాణం దిశగా అడుగులు పడతాయని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐకానిక్‌ బోర్డు వాక్‌ డిజైన్‌ తయారుచేస్తున్నామని, త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. దీని నిర్మాణానికి రూ.ఐదు కోట్లు వ్యయం కావచ్చని తెలిపారు.  

ఐకానిక్‌ బోర్డు వాక్‌ అంటే...
ఎక్కువ సంఖ్యలో ప్రజల సంచారం ఉండే ప్రాంతాల్లో సౌలభ్యం కోసం ఐకానిక్‌ బోర్డు వాక్‌లు ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన నగరంలో రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపునకు పాదచారులు వెళ్లేలా స్కై వాక్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించారు. అయితే ఉప్పల్‌ జంక్షన్‌లో నిర్మించాలనుకుంటున్న ఐకానిక్‌ బోర్డు వాక్‌ మాత్రం దీనికి భిన్నం. ఈ వంతెన నాలుగైదు వైపులా పాదచారులు వారి గమ్యాలకు వెళ్లేలా డిజైన్‌ ఉంటుంది. ఉదాహరణకు ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలనుకునే వారి సౌలభ్యం కోసం, అక్కడే ఉన్న పాఠశాలకు విద్యార్థులు వెళ్లేలా, నేరుగా బస్టాండ్‌కు చేరుకునేలా, రోడ్డు ఓవైపు నుంచి మరో రోడ్డు వైపునకు వెళ్లేలా ఈ ‘ఐకానిక్‌ బోర్డు వాక్‌’ను నిర్మిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top