గ్రేటర్‌ ఉక్కిరిబిక్కిరి

Hyderabad Pollute With RTC Buses And Vehicles - Sakshi

పరిమితికి మించి పెరుగుతోన్న నైట్రోజన్‌ఆక్సైడ్‌లు..

వాహన కాలుష్యమే ప్రధాన కారణం..

పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు..

సాక్షి,సిటీబ్యూరో: సీజన్‌ మారడంతో నగరంలో ఇటీవల తరచూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా యి. ఇదే సమయంలో వాతావరణంలో పరిమితికి మించి నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు సిటీని కమ్మేస్తున్నాయి. దీంతో భాగ్యనగరంలో సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించలేని దుస్థితి నెలకొంది.  నైట్రోజన్‌ ఆక్సైడ్ల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం గ్రేటర్‌ పరిధిలో వాహన విస్ఫోటనమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే  గ్రేటర్‌ పరిధిలో నిత్యం 50 లక్షల పైగా వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఇవి కాక నిత్యం 800–1000 కొత్తవి రోడ్డెక్కుతున్నా యి. ఆయా వాహనాల్లో వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌ నూటికి నూరు శాతం మండకపోవడంతో మిగిలిపోయిన ఇంధనంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్లు, కార్బన్‌ మోనాక్సైడ్, ధూళి కణాలు తదితర రూపా ల్లో గాల్లో కలుస్తున్నాయి. ఇక 15 ఏళ్లకు పైబడిన వాహనాలు వదులుతోన్న కాలుష్య ఉద్గారాలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చేస్తున్నా యని నిపుణులు పేర్కొంటున్నారు. డొక్కువాహనాల్లో ఇంజిన్‌ సామర్థ్యం తగ్గిపోవడంతో ఇంధ నం 70 శాతం మాత్రమే మండుతుందన్నారు.   

ఢిల్లీకి మించి కాలుష్యం..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు సగటున 63.74 టన్నుల  నైట్రోజన్‌ ఆక్సైడ్లు వెలువడుతుండగా...గ్రేటర్‌లో 69.51 టన్నులు ఉత్పన్నమౌతున్నట్లు పీసీబీ తాజా కాలుష్య గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

అమ్మో నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు..
నైట్రోజన్‌ ఆక్సైడ్లు గాలిలోని వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్ల (వీఓసీ)తో చర్యనొంది భూమిపై ఓజోన్‌ స్థాయిని పెంచుతాయి. ఆమ్ల వర్షాలు, పొగ మంచుకు కారణమవుతాయి. మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటాయి. వీటి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతంలో దీర్ఘకాలికంగా గడిపితే మనుషుల ఊపిరితిత్తుల పొరలు దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులైన బ్రాంకైటిస్, ఆస్తమా, దగ్గు తదితర సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.

కోరలు చాస్తున్న కాలుష్య భూతం..
నిత్యం గాల్లోకి అతి సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5), సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 10), సల్ఫర్‌ డయాక్సైడ్, కార్బన్‌ మొనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్లు తదితర 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. గతంతో పోలిస్తే నైట్రోజన్‌ ఆక్సైడ్ల తీవ్రత నానాటికి పెరుగుతోంది.  గ్రేటర్‌లో ప్రతిరోజూ 69.51 టన్నులు గాల్లో కలుస్తోంది. అదే ఢిల్లీలో కేవలం 63.74 టన్నులు కావడం గమనార్హం.  

ఇతర మెట్రోల్లో ఇలా..
అహ్మదాబాద్, భోపాల్, కోయంబత్తూరు, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, నాగ్‌పూర్‌ తదితర నగరాల్లో మనకంటే తక్కువగా నమోదవుతోంది. బెంగళూరు, చెన్నైలో మాత్రం నైట్రోజన్‌ ఆక్సైడ్ల తీవ్రత మనతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.  

పరిష్కారం ఇలా..
ఇప్పటికీ నిర్లక్ష్యంగా చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించేందుకు ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచిస్తున్నారు. పర్యావరణహిత ఇంధనం సీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గ్రేటర్‌లో వాయు కాలుష్యానికికారణాలివే..
పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్‌ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.  
పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి.
శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి.  
ఘణపు  మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.   
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వా యుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది.  
శివారు ప్రాంతాల్లో బొంగుళూరు, పెద్దఅంబర్‌పేట్, పటాన్‌చెరు, ఆదిభట్ల, ఘట్‌కేసర్, మేడ్చ ల్, శంషాబాద్, కీసర తదితర ప్రాంతాల్లో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కాలుష్యమేఘాలు కమ్ముకుంటున్నాయి.
ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  
బాలానగర్, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉధృతి అధికంగా ఉన్నట్లు తేలింది.  
గ్రేటర్‌ పరిధిలో  రాకపోకలు సాగించే 50 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోల్, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది.
గ్రేటర్‌ పరిధిలో 15 ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వాహనాల సంఖ్య లక్షలు దాటినా..గ్రేటర్‌లో  7 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటు లో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top