భాగ్యనగరానికి జపాన్‌ జంగల్‌

Japan Country Forest Model In Hyderabad - Sakshi

మియవాకి సాంకేతికతతో పెంపకం 

జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌లో శ్రీకారం 

రెండేళ్లలోనే దట్టమైన అడవులు 

హైదరాబాద్‌: అడవులను నరకడం ఈజీ.. కానీ అడవిని పెంచడమే కష్టం.. ఇప్పటివరకు అందరి దృష్టిలో ఉంది ఇదే. అయితే ఇదంతా అబద్ధమని నిరూపించేందుకు మన రాజధానిలోకి ‘జపాన్‌ జంగల్‌లు’ రాబోతున్నాయి. రెండేళ్లలోనే చిట్టడవి వేళ్లూనుకోబోతోంది. ఖాళీ ప్రదేశాలన్నింటినీ దట్టమైన అరణ్యంలా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అకిర మియవాకి అనే  సాంకేతికతతో మూడేళ్లలోనే దట్టమైన అడవి రూపొందుతుంది. ఇదే సాంకేతికతను జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌లో అడవులను పెంచనున్నారు. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా అడవుల ఏర్పాటు, నిర్వహణకు ఎన్టీపీసీ, జెన్‌క్యూ, ఎక్స్‌గాన్, సీజీఐ కంపెనీలు ముందుకొచ్చాయి. బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలో మియవాకి టెక్నాలజీతో అడవులను అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా అడవులను పెంచనున్నారు.
 
ఎవరీ మియవాకి.. 

జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీలో వృక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన అకిర మియవాకి రియో డీజెనీరోలో 1992లో జరిగిన ధరిత్రి సదస్సులో మాట్లాడుతూ.. అంతరిస్తున్న అడవులపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జాతుల మొక్కలతో సహజ అడవులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ తర్వాత సహజ వృక్ష సంపదపై అధ్యయనం ప్రారంభించారు. పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై స్థానిక చెట్ల విత్తనాలను నాటి అడవులుగా పునరుద్ధరించారు. దీన్ని మియవాకి పద్ధతి అని పిలుస్తారు. భూసారాన్ని పెంచి తేమ ఎక్కువగా ఉండేటట్లు చేసిన తర్వాత గుంపులు గుంపులుగా మొక్కలు నాటి చిట్టడవులుగా మార్చుతారు. 

రెండేళ్లలో అభివృద్ధి చేస్తాం.. 
మియవాకి సాంకేతికతతో మియవాకి అడవులను రెండేళ్లలో అభివృద్ధి చేస్తాం. హరితహారంలో భాగంగానే లక్షల మొక్కలను మియవాకితో వేర్వేరు చోట్ల పెంచి అడవులుగా తీర్చిదిద్దుతాం. బీహెచ్‌ఈఎల్‌లో 13 ఎకరాలు, గచ్చిబౌలి స్టేడియంలో 2 ఎకరాలు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 3 ఎకరాలను మియవాకి అడవుల ఏర్పాటుకు కేటాయించాం. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మట్టి పనులు సాగుతున్నాయి. 
– జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ హరిచందన 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top