శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు

Minister Jagadish Reddy Attended Nalgonda Lord Shiva Temple Ustavalu In Nalgonda - Sakshi

సాక్షి, నార్కట్‌పల్లి(నల్గొండ) : హర హర మహాదేవ.. శంభో శంకర.., ఓం నమః శివాయ.. అంటూ శివనామస్మరణ మిన్నంటింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం వైభవంగా సాగింది. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చకులు  సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సురేష్, పవన్, సిద్దులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ వాహనంపై స్వామి వారిని, వీరమూర్తి ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధతో ఓం నమః శివాయ.. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ.. అగ్నిగుండం నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు. 

శివసత్తుల ప్రత్యేక పూజలు..
స్వామి వారి అగ్ని గుండాలకు శివసత్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి అగ్నిగుండంలో నడిచారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, దేవాలయ అబివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్‌ రాధ, ఎంపీడీఓ సాంబశివరావు, ఈఓ అన్నెపర్తి సులోచన, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

పోలీసు భారీ బందోబస్తు..
అగ్ని గుండాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో పాటు పోలీసు బృందంతో ప్రత్యేక చర్యలు తీసుకుని అగ్ని గుండంలో నడిచే వారికి ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి


నార్కట్‌పల్లి : రాష్ట్రంలోని దేవాలయాలు టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన గట్టుకు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అర్చకులు మంత్రితో పాటు నూతన కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డికి పూర్వకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని.. ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.2.50 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ చైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి, ఈఓ సులోచన మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన త్వరలో నిధులు మంజూరీకి కృషి చేస్తానన్నారు. కార్యక్రమలలో జేసీ చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌లు చిన్న వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top