టీఆర్‌ఎస్‌ కుట్రలకు రైతులు బలి

MLA Sridhar Babu Alleged that TRS government Cheating People - Sakshi

మంచిర్యాల(ఆదిలాబాద్‌) : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుట్రలకు అమాయకపు ప్రజలను బలిచేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, పలు నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలతో కమిటీ వేశారు. గత నెల 30న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాలలో జరిగిన సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గురువారం ఈ కమిటీ సభ్యులు సార్సాలకు వెళ్తుండగా మం చిర్యాల సమీపంలో పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసానికి చేరుకున్నారు.

అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంటకు పైగా పోలీస్‌ స్టేషన్లోనే ఉంచి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగులో ఉన్న పోడు భూములపై ఆ రైతులకే హ క్కు కల్పించాలని నాడు సోనియాగాంధీ నేతృ త్వంలో హక్కుపత్రాలు ఇప్పించామన్నారు. ఇటీ వల జరిగిన ఎన్నికల సమయంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామన్న హామిని కేసీఆర్‌ విస్మరించి, నేడు అవే పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేక, తన తమ్ముడిచే ఇలాంటి దాడులను చేయించడం చాలా హీనమైన చర్యగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు గురైన అటవీప్రాంతానికి ప్రత్యామ్నయంగా సార్సాలలోని భూములను తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మూడెకరాల భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామిని విస్మరించి ఉన్నభూమిని లాక్కుంటుందని ఆరోపించారు. పోడు భూమిని లాక్కుని అక్కడి రైతులను నిర్వాసితులుగా మార్చేశారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం సార్సాల నుంచే ఆరంభం అవుతుందన్నారు.

బాధ్యులను శిక్షించాలి 
సార్సాలలో దాడులకు పాల్పడిన వారిని కఠినం గా శిక్షించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సిర్పూర్‌ ఇంచార్జి పాల్వాయ్‌ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పే కేసీఆర్‌ ఎన్నికలు అయిపోగానే ఆ హామీలను బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్, రామగుండం ఇన్‌చార్జి మక్కాన్‌ సింగ్, చొప్పదండి ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, భూపాల్‌పెల్లి ఇన్‌చార్జి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.  

ప్రాథమిక విచారణ చేయనివ్వరా? 
మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సార్సాలకు వెళ్లి పూర్తిస్థాయిలో విషయ సేకరణ చేయాలని వెళ్తుండగా ముందుగానే మంచిర్యాలలో తమను ముందస్తు అరెస్టు చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ ప్రభుత్వంలో మనం ఉన్నమా? అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయమన్నారు.1950కి సంబంధించిన శాటిలైట్‌ మ్యాప్స్‌ ప్రకారం వాటిని అటవీశాఖకు సంబంధించిన భూములుగా పేర్కొంటూ ట్రెంచ్‌లను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్, సీతక్క ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోకుండా ఒక మహిళా అధికారిపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అదే పార్టీకి చెందిన వారు దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓవైపు ప్రభుత్వం అటవీశాఖ, పోలీస్‌ శాఖ అధికారులను పంపించి పోడు భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను పంపించి గొడవలు సృష్టించి ఒక డ్రామా ఆడుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. అధికారులు, సీఎం, అక్కడి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించాలన్నారు. ఉన్న చట్టాలను సరిౖయెన విధానంలో అమలు చేసి, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేసి, 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలతో పాటు, పట్టాపాసు పుస్తకాలను ఇచ్చి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.  
– ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు 

వాస్తవాలను ఎందుకు తెలుసుకోనివ్వడం లేదు.. 
గత నెల 30న సార్సాలలో జరిగిన ఘటనలోని వాస్తవాలను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే తమను ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పోడు భూముల మీద ఈ సీఎంకు ఎలాంటి స్పష్టత, ఒక విధానం లేదని, ఓట్ల కోసం హామీలను ఇస్తూ పోడు భూములకు పట్టాలను ఇస్తామని గత ఎన్నికల్లో హామీలను గుప్పించారన్నారు. ఎప్పుడో ఉన్న చట్టాలను ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుందన్నారు. జై జంగిల్‌ జమీన్‌ అంటూ ఉద్యమ సమ యంలో చెప్పిన కేసీఆర్‌ నేడు నిజాం పాలనను గుర్తు చేసేలా ఆయన విధానాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురైన అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నయంగా రాష్ట్రంలో ఎక్కడా అటవీ భూములు లేవాఅని ప్రశ్నించారు.     
– ఎమ్మెల్యే సీతక్క 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top