ఉమ్మడి జిల్లాలో ఘనంగా ముక్కోటి వేడుకలు

Mukkoti Ekadasi Huge Rush Of Devotees At Vemulawada - Sakshi

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు సోమవారం భక్తులతో పులకించాయి. వివిధ అవతారాల్లో విష్ణుమూర్తి భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. వేకువజామునుంచే ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు.

సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ప్రాతఃకాల పూజ తదుపరి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అంబారిసేవలపై స్వామి వారలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ, చంద్రగిరి శరత్‌శర్మలు వివరించారు. కార్యక్రమంలో ఈవో కృష్ణవేణి, కలెక్టర్‌ కృష్ణభాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఏఈవో ఉమారాణి, మాజీ ప్రజాప్రతినిధులు 
భక్తులు పాల్గొన్నారు. 

అపర భద్రాద్రిలో..

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని  ఇల్లందకుంటలోని అపర భద్రాద్రిలో వేకువజామునే శ్రీసీతారాములను పట్టువస్త్రాలతో అలంకరించారు. పూజరులు శేషాం రామచార్యులు, వంశీధరాచార్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అధ్యయనోత్సవం ఆరంభం, తొళ్ళక్కం ద్రావిడ ప్రభందపారాయణం నిర్వహించారు. శ్రీసీతారాముల దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే ఆలయం వద్ద బారులుతీరారు. సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను గురుడ వాహనంపై పుర వీధులగుండా డప్పుచప్పుళ్లు, మేళా తాళాల మధ్య ఊరేగించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయగణపతి దంపతులు, ఎంపీపీ పావని వెంకటేష్‌ దంపతులు స్వామివార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీలతసురేందర్‌రెడ్డి, ఎంపీడీఓ స్వరూప, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, భక్తులు సీతారాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ధర్మపురిలో..

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరిపారు. వేకువజామునుంచే వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ధర్మపురి పీఠాధిపతి శ్రీమత్‌ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సచ్చితానంద సరస్వతి మహాస్వాములు, శ్రీ విశ్వయోగి విశ్వజిత్‌ విశ్వంజి గార్లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌ నేత, కలెక్టర్‌ శరత్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్‌ హాజరయ్యారు. ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకరమణ, సీఐ లక్ష్మిబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జడ్జి అనుపమ చక్రవర్తి, జగిత్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జేసి రాజేశం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top