దిశ : చీకట్లోనే ఎదురు కాల్పులు

Shad Nagar And Shamshabad Police Submitted Full Report To NHRC Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్‌ పోలీసులు మంగళవారం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు. నవంబర్‌ 27 నుంచి ఈ నెల 6 వరకు అసలేం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు, ఆధారాలు, ఫోరెన్సిక్‌ రిపోర్టుతో పాటు సమర్పించారు. ఇక నలుగురు నిందితులది నేరస్వభావమని, తమపై దాడి చేసి కాల్చబోయారని, దీంతో ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులు నివేదికలో పలు కీలక విషయాలు పొందుపరిచారు. గత నెల 27న రాత్రి 9.40 గంటలకు శంషాబాద్‌ (తొండుపల్లి) టోల్‌గేట్‌ వద్ద దిశను అపహరించిన మహమ్మద్‌ ఆరిఫ్, నవీన్, శివ, చింతకుంట చెన్నకేశవులు హత్యాచారం చేసినట్లు వివరించారు. ఘటన జరిగిన రోజు బాధితురాలితో మాట్లాడిన టోల్‌గేట్‌ సిబ్బంది, నిందితులు మాట్లాడిన పంక్చర్‌ షాపు, వైన్‌షాపు యజమానులు, లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కొత్తూరు, నందిగామ పెట్రోల్‌ బంకు సిబ్బంది వంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పొందుపరిచారు.  

పోస్టుమార్టం నివేదికలు, సీసీ ఫుటేజ్‌లు
దిశపై అత్యాచారం జరిగిందని నిరూపించేందుకు కావాల్సిన ఫోరెన్సిక్‌ రిపోర్టు, లారీలో సేకరించిన రక్తం నమూనాలు, ఇతర స్రావాలు, వెంట్రుకలు, నిందితుల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ రిపోర్టును పోలీసులు నివేదికకు జతపరిచారని సమాచారం. నిందితులు దిశను లారీలో తరలిస్తుండగా సేకరించిన వీడియో ఫుటేజ్‌లని కూడా పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి సమర్పించారు. ఇటు నిందితుల పోస్టుమార్టం రిపోర్టును కూడా జత చేశారు. 

కాల్పులు వచ్చిన వైపు ఫైరింగ్‌ చేశాం.. 
నలుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రమే కాల్పులకు తెగబడితే నలుగురిపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయంపైనా పోలీసులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దిశ వస్తువులు చూపిస్తామంటూ చటాన్‌పల్లి వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద పిస్టళ్లు లాక్కుని శివ, నవీన్‌ తో కలసి బ్రిడ్జికి తూర్పువైపు పరుగులు తీశారన్నారు. తమపై నిందితులు కాల్పులు జరుపుతూ పరుగులు పెట్టారని తెలిపారు.

తాము ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామన్నారు. నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాక.. తెల్లవారుజామున గాలించగా సమీపంలోని పొలంలో నలుగురు మరణించినట్లు గుర్తించామని, అంతే తప్ప ఎవరినీ గురి చూసి కాల్చలేదని వివరించారని తెలిసింది. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సోమవారమే విచారించిన విషయం తెలిసిందే. 

పెట్రోల్‌ బంకు సిబ్బంది వాంగ్మూలం.. 
దిశ హత్యాచారం ఘటన జరిగిన 27వ తేదీ అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్‌ కోసం కొత్తూరు, నందిగామ బంకుల వద్ద కు నిందితులు శివ, నవీన్‌ వెళ్లారు. దీనిపై సదరు బంకు సిబ్బందిని కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు విచారించారు. పెట్రోల్‌ కోసం ఎవరెవరు వచ్చారు? వచ్చింది వీరేనా? అని ఫొటోలు చూపించి ధ్రువీకరించుకున్నట్లు తెలిసింది. 

ఘటనా స్థలానికి విదేశీ మీడియా 
షాద్‌నగర్‌టౌన్‌ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి మంగళవారం విదేశీ మీడియా ప్రతినిధులు వచ్చారు. అమెరికాకు చెందిన ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతినిధులు షాద్‌నగర్‌ చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు చెందిన సౌత్‌ ఏసియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మెన్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ఘటనా స్థలాలను పరిశీలించారు. ఘటనాస్థలి వద్ద వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top