అన్నం లేకుంట చేసిండ్రు..

Singareni Environmental Referendum In Mancherial - Sakshi

85 ఏళ్ల వృద్ధురాలు పురుకూటి రాధమ్మ

సింగరేణి మాకు అన్నం లేకుంట చేసింది. సింగరేణికి మా భూములు ఇచ్చి ఎంతోమందికి అన్నంపెట్టేతట్టు చేసినం. మా భూములు తీసుకున్న సింగరేణి ఇప్పుడు మాకే ఏం చేస్తలేదు. మా పంటకు నీళ్లు అందుతలెవ్వు.. తినేందుకు అన్నం లేదు.. మూడు కుటుంబాలు బతుకాలి.. ఉపాసం ఉంటున్నం’ అంటూ ప్రజాభిప్రాయ సేకరణలో జాయింట్‌ కలెక్టర్‌ ముందు తన గోడు వెల్లబోసుకుంది సింగరేణి ప్రభావిత గ్రామం జనగామకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు పురుకూటి రాధమ్మ.

ఆవేదన ఆమె మాటల్లో.. ‘1964లో సుబ్బారావు అనే సింగరేణి ఏజెంట్‌ మా ఊరికి వచ్చిండు. నాడే పొలాలకు నీళ్ల గురించి అడిగిన.. నీళ్లు రాకపోతె ఎట్ల బతకాలంటే పట్టించుకోలే.. తర్వాత ఎంతోమందికి మా కష్టం చెప్పుకున్న ఎవరూ లెక్క చేయలేదు.  జీఎం ఆఫీస్‌ వద్దకు మూడుసార్లు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఇయాల్ల కలెక్టరమ్మతో బాధ చెప్పుకుందామని వచ్చిన. మా 40 ఎకరాలు సింగరేణి తీసుకున్నది. ఓసారి రూ.7 వేలు, మరోసారి రూ.13 వేలు ఇచ్చింది. సింగరేణి కడుపు సల్లగుండ.. మరో 300 ఏళ్లు బతకాలి. మాకు ఇంకో పదెకరాల పొలం ఉంది. అమ్మా నాకు గవర్నమెంట్‌ పెన్షన్‌ ఇస్తుంది. మాకు ఇళ్లు వద్దు, భూమి వద్దు, జాగవద్దు. నీళ్లు లేక భూమి బీడుంటంది. తిండికి కష్టమైతంది. మా ఊరి కుంటకు నీళ్లు వస్తే రెండు పంటలు పండుతయ్‌. నీళ్లు వచ్చేలా చేయండి చాలు’ అని వేడుకుంది. స్పందించిన జేసీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 గోదావరిఖని(రామగుండం): సింగరేణి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ముగిసింది. రామగుండం రీజియన్‌ పరిధిలోని జీడీకే–1, 2, 2ఏ, 3, 5వ గని ప్రభావిత గ్రామాలైన జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, సింగరెడ్డిపల్లె, చందనాపూర్‌లో పర్యావరణంపై వీటీసీ సమీపంలోని మైదానంలో అభిప్రాయసేకరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఐదు గ్రామాల నుంచి సుమారు రెండు వేల మంది ఈ సభకు హాజరయ్యారు. జేసీ వనజాదేవి, పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారి రవిదాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, కాంగ్రెస్‌ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సభ 3 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణితో పడుతున్న ఇబ్బందులు, జీవన విధానంపై బొగ్గు గ నుల ప్రభావం, యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును సభాముఖంగా ఏకరువు పెట్టారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సింగరేణి సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ప్రజలతో అవసరం ఉన్నప్పుడే రోడ్లు వేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, స్వయం ఉపాధి కోర్సులు గ్రామాల్లో చేపట్టడం చేస్తోందని, మిగతా సమయాల్లో కనీసం ఆ గ్రామాలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు.  గాలి, నీరు, శబ్ద కాలుష్యంతో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిం గరేణి సమర్పించిన నివేదికలే పర్యావరణ తీరు కు అద్దంపడుతున్నాయని తెలిపారు.  అయినా పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభావిత గ్రామాల అభివృద్ధికి యాజమాన్యం కట్టుబడి ఉండాలని సూచించారు.

అలాగే వ్యర్థాలన్నీ నీటిలో కలవడంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్రజలతో కమిటి వేసి కాలుష్య నియంత్రణపై సమీక్షించాలని సూచించారు. పాత పద్ధతిలో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కలుషిత నీరు శుద్ధి చేసేందుకు ప్లాంటు నిర్మించడంతోపాటు ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు, ప్రభావిత గ్రామాల ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను వేదికపై వెల్లడించారు. అనంతరం జేసీ వనజాదేవి మాట్లాడారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించి అభిప్రాయాలు, విజ్ఞప్తులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తామని తెలిపారు. జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, సింగరెడ్డిపల్లె, చందనాపూర్‌ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు రమేశ్, వెంకటేశ్వర్లు, పలువురు ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

విస్తరణ కోసం  ప్రజాభిప్రాయ సేకరణ.. 
పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిచేయాల్సిన అవసరం యాజమన్యంపై ఉంది. ఈ క్రమంలో రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1 ఏరియాలో ఉన్న జీడీకే–1, 3, జీడీకే 2, 2ఎ, జీడీకే–5వ గనిలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అయింది. ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సింగరేణి కట్టుబడి ఉంది.  
– విజయపాల్‌రెడ్డి, ఆర్జీ–1 జీఎం 

కాలుష్యం పెరిగింది.. 
సింగరేణి తీరుతో చుట్టు పక్కల గ్రామాలలో కాలుష్యం పెరిగింది. రోగాలబారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నాం. బొగ్గు ఉత్పత్తి కోసం గ్రామాలకు చెందిన భూములను కొనుగోలు చేస్తున్న యాజమాన్యం నిర్వాసిత గ్రామాలను పట్టించుకోవడం లేదు.  
– పుష్పలత, రామగిరి జెడ్పీటీసీ 

డేంజర్‌ జోన్‌లో కాలుష్యం.. 
గాలిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఎక్కువై ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. అత్యంత ప్రమాదకరస్థాయికి కాలుష్యం చేరడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమల నుంచి వెలువడే ఉద్ఘారాలను శుద్ధి చేయాల్సిన బాధ్యత యాజమన్యంపై ఉంది. ఖాళీ స్థలాలలో మొక్కలను పెంచేందకు చర్యలు తీసుకోవాలి. 
– గీట్ల దామోదర్‌రెడ్డి, పర్యావరణ వేత్త

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top