నో మాస్క్‌.. నో శానిటైజర్‌

Singareni Workers Neglect on Coronavirus Karimnagar - Sakshi

సింగరేణి కార్మికులకు  భద్రతా చర్యలు కరువు

కరోనా విస్తరిస్తున్న వేళ.. కానరాని మాస్క్‌లు

కార్మికులను పట్టించుకోని యాజమాన్యం

విధులకు భారీగా  హాజరవుతున్న కార్మికులు

గోదావరిఖని(రామగుండం): కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్షణక్షణం భయపెడుతోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇంట్లోంచి భయటకు రావొద్దని లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసర సేవలను మినహాయించింది. ఇందులో భాగంగా విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుల రక్షణను యాజమాన్యం గాలికి వదిలేసింది. మాస్క్‌..శానిటైజర్‌.. అందివ్వకుండా కరోనా ముప్పు కొనితెచ్చిపెడుతోంది.

పెద్ద సంఖ్యలో కార్మికుల హాజరు..
భూగర్భ గనులకు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు అవుతున్నారు. వీరి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర సర్వీసుల కింద భూగర్భ గనుల్లో పనులు నిర్వహిస్తున్న సింగరేణి యాజమాన్యం అదే స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. భూగర్భ గనుల్లో ఏర్పాట్లు మరీ అధ్వానంగా ఉన్నాయని పలువురు కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈసమయంలో భూగర్భ గనుల్లోకి పెద్ద సంఖ్యలో కార్మికులను అనుమతించడం ఎటు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రీజియన్‌లో 15వేల మంది..
రామగుండం రీజియన్‌లోని 8భూగర్భ గనులు, నాలుగు ఓసీపీల్లో  రోజు 15వేల మంది కార్మికులు విధులకు హాజరవుతున్నారు. భూగర్భ గనుల్లోని పనిస్థలాల్లో సామూహికంగా పనిచేసే అవకాశం ఉన్న క్రమంలో వారికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మస్టర్లు వేసే సమయంలో కార్మికుల మధ్య దూరాన్ని పాటించాలని కోరుతున్నారు. ఓసీపీల్లోని భారీ యంత్రాల్లో షిఫ్టు తర్వాత సానిటేషన్‌ చేసి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు. యాజమాన్యం భూగర్భ గనుల లోపలకి వెళ్లే కార్మికులకు మాస్కులు అందజేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. మాస్కులు లేకుండానే గనిలోనికి మ్యాన్‌రైడింగ్‌ ద్వారా పంపిస్తున్నారని, ఎవరికనా ఎదైనా వైరస్‌ అంటితే సింగరేణి కార్మికవర్గం ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. గనిలోకి వెళ్లే కార్మికుల్లో ఎవరికైనా వైరస్‌ సోకితే ఆదేవుడే రక్షించాలని వేడుకుంటున్నారు. బుధవారం కొంత మంది కార్మికులు యాజమాన్యం తీరుపై ఆందోళన చెంది విధులకు వచ్చి తిరిగి వెళ్లినట్లు తోటి కార్మికులు తెలిపారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం
విధులకు వచ్చే అన్ని విభాగాల కార్మికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నాం. జలుబు, జ్వ రం, దగ్గు ఉన్న కార్మి కులకు డ్యూటీకి అనుమతించడంలేదు. అన్ని ప్రాంతాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశాం. అలాగే మాస్కులు మార్కెట్‌లో దొరకడం కష్టంగా మారడంతో కాటన్‌గుడ్డ కొనుగోలు చేసి ప్రత్యేక మాస్కులు కుట్టించి అందిస్తున్నారు. గనులకు హాజరైయ్యే ఉద్యోగులకు   సానిటైజేషన్‌ చేస్తున్నాం.– కె.నారాయణ, ఆర్జీ–1 జీఎం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top