అడవిలో ఆనందం

Sports And Entertainment in Forest Tour - Sakshi

వేసవిలో టీఎస్‌టీడీసీ విహార యాత్రలు

సాహసికుల కోసం ప్రత్యేక క్రీడలు

మండుటెండల్లో జలపాతాల్లో ఈదొచ్చు. అడవిలో త్రీడీ జంతువులను చూసి మురిసిపోవచ్చు. కొండల్లో సాహస క్రీడలు ఆడుతూ సేదదీరవచ్చు. ఎక్కడో విదేశాల్లో ఉండే జిప్‌ సైకిల్‌ రైడ్‌ను త్వరలో మన దగ్గరా ఆస్వాదించవచ్చు. ఇలా ఒకటా రెండా సిటీకి సమీపంలోని జయశంకర్, ములుగు, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పరిధిలో అనేక కొత్త పర్యాటక ఆకర్షణలను ఈ సెలవుల్లో అటవీ శాఖ అందుబాటులోకి తేనుంది. వేల రూపాయలు వెచ్చించి సుదూరాలకు వెళ్లకుండానే.. తక్కువ ఖర్చుతో ఇక్కడే హాయిగా వినోదాల్లో మునిగి తేలవచ్చు.

తాడ్వాయి కుటీరాల్లో..
తాడ్వాయిలో పర్యాటకుల కోసం వన కుటీరాలను తీర్చిదిద్దారు. వీటికి తోడు వేసవిలో చెట్ల మధ్య కనాపీ వాకింగ్, ట్రీ కాన్వాస్, పిల్లల కోసం నెట్‌ ప్లే ఏరియా తదితర ఆకర్షణలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పొల్లాల్లో రైతుల కట్టే మంచెపై సేదదీరడం భలేగా ఉంటుంది. అలాంటి అనుభూతి పొందేందుకు లక్నవరం వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. దానిపైకి ఎక్కి హాయిగా పరిసరాలను తిలకించవచ్చు. ప్రస్తుతం ఎండల దృష్ట్యా లక్నవరం ఫెస్ట్‌ను మధ్యాహ్నం వేళల్లో నిర్వహించడం లేదు. సరస్సు వద్ద రివర్‌ క్రాసింగ్‌ బర్మా బ్రిడ్జ్, ప్లేట్‌ బ్రిడ్జ్, నెట్‌ బ్రిడ్జ్‌ తదితర సాహస క్రీడలు త్వరలో ప్రారంభించనున్నారు. ఇటీవల ఇక్కడ ప్రారంభించిన ఎకో పార్కులో జింకలను చూడొచ్చు.

సాహస క్రీడ.. క్లైంబింగ్‌
పాండవుల గుట్ట రాక్‌ క్లైంబింగ్‌ ప్రసిద్ధి చెందింది. కొండలెక్కేందుకు నగరాల నుంచి విద్యార్థులు, ఇతరులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నైట్‌ క్యాంపింగ్‌కు ఏర్పాటు చేశారు. వేసవిలో రాక్‌ క్లైంబింగ్‌ ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్నారు. పర్యాటకుల దాహార్తిని తీర్చేందుకు ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. మరి కొద్దిరోజుల్లో రెస్టారెంట్‌ను సైతం ప్రారంభించనున్నారు.

ప్రకృతి అందాలకు సొబగులు  
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పాకాల సరస్సు ప్రకతి అందాలకు పుట్టినిల్లు. ఇప్పటికే అటవీ శాఖ అనేక కొత్త ఆకర్షణలు తీసుకొచ్చింది. పర్యాటకుల సంఖ్య పెంచడానికి ఏసీ గదుల నిర్మాణం, కట్ట మరమ్మతు, బ్యాటరీ కార్లు, అదనపు బోట్లు, హెర్బల్‌ గార్డెన్‌ తదితరాలను అభివృద్ధి చేసింది. తాజాగా గ్రానైట్‌ రాళ్లతో 16 రకాల జంతువుల బొమ్మలు త్రీడీ, టూడీలో తీర్చిదిద్ది పెట్టారు. పుదుచ్చేరికి చెందిన యూనివర్సల్‌ ఎకో ఫౌండేషన్‌ సాయంతో వీటికి శ్రీకారం చుట్టారు. ఊసరవెల్లి, కొండచిలువ, సీతాకోక చిలుకలు, ఇంకా పలు రకాల పక్షులు త్రీడీలో అలరించనున్నాయి.

వేసవిలో జలధారలు
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని బొగత జలపాతం ఎంతో ప్రాచుర్యం పొందింది. వర్షాకాలంలో జలధారలతో ఆకట్టుకొనే ఈ వాటర్‌ ఫాల్స్‌ వేసవి వచ్చిందంటే పూర్తిగా ఎండిపోతుంది. ఈ క్రమంలో అటవీ శాఖ జలపాతం పైభాగంలో చెక్‌ డ్యాంలు నిర్మించి బోరు బావుల ద్వారా వాటిలో నీరు నింపుతోంది. వేసవిలో ఆదివారాలు, ఇతర పండగ రోజుల్లో చెక్‌డ్యాం నుంచి నీటిని కిందకు వదలడంతో జలపాతం ధారలు దూకుతున్నాయి. ఇక సాహసికుల కోసం ఎన్నో క్రీడలు సైతం అందుబాటులోకి రానున్నాయి. బర్మా వంతెన, కమాండో టవర్, నెట్‌ క్లైంబింగ్, జిప్‌లైన్‌ సైక్లింగ్, రైడ్‌ వంటి క్రీడల్లో మునిగితేలేందుకు ఆయా పరికరాలు సిద్ధమయ్యాయి. కొన్ని రోజుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. 

టీఎస్‌టీడీసీ వాహనాలు సిద్ధం

వేసవి సెలవుల్లో వచ్చేవారి కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశాం. ఎవరైనా తమకు నచ్చిన ప్రాంతాలకు కుటుంబాలతో కలసి, పిల్లలతో కలసి వెళ్లాలనుకుంటే నగరంలోని టీఎస్‌టీడీసీ సీఆర్‌ఓ కేంద్రాల్లో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. అధునాత లగ్జరీ వాహనాలే ఉన్నాయి. నగర వాసులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.     – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top