తహసీల్దార్ల పవర్‌ కట్

Telangana Government Ready To Reduce Tahsildar Powers Under New Revenue Act - Sakshi

రేషన్‌ కార్డుల జారీ, రైసుమిల్లులపై అజమాయిషీ ‘పౌరసరఫరాల’ కిందకు..

భూ ఆక్రమణలపై నిఘా, నాలా చట్టం అమలు బాధ్యత ఎంపీడీవోలకు..

రైతు సంబంధ వ్యవహారాలు కొన్ని వ్యవసాయశాఖ చేతుల్లోకి..

జనాభా లెక్కలు పోలీసు శాఖకు.. పశుగణన పశుసంవర్థక శాఖకు..

ప్రొటోకాల్, భూసేకరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ బాధ్యతలకే తహసీల్దార్లు పరిమితం

సీసీఎల్‌ఏ పోస్టును ప్రభుత్వం రద్దు చేసే  అవకాశం 

జాబ్‌చార్ట్‌ సిద్ధం.. కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచనున్న ప్రభుత్వం!

సాక్షి, హైదరాబాద్ ‌: రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్‌ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో భూ వ్యవహారాలపై సర్వాధికారాలు ఎమ్మార్వోలకే ఉండగా.. ఇప్పుడు వాటిలో సగం అధికారాలకు కత్తెర వేయబోతోంది. రెవెన్యూ అంశాల్లోనే కాకుండా తహసీల్లార్దు ప్రతిష్టాత్మకంగా భావించే రేషన్‌ వ్యవహారాల్లోనూ కోత విధిస్తోంది. రేషన్‌కార్డులు జారీచేసే అధికారం, రేషన్‌షాపుల పర్యవేక్షణ, రైసుమిల్లులపై అజమాయిషీ బాధ్యతల నుంచి వారిని తప్పించబోతోంది. ఇక, రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహసీల్దార్ల పాత్రను పరిమితం చేస్తోంది. జనగణన, పశుగణన వంటి అదనపు భారాల నుంచి కూడా విముక్తి కల్పించ బోతోంది. ఈ మేరకు తహసీల్దార్లకు ఉన్న ప్రధానమైన 44 అధికారాల్లో 20 మాత్రమే వారి పరిధిలో కొనసాగిస్తూ, 17 అధికారాలను వ్యవసాయ, పశుసంవర్థక, పోలీసు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్‌ శాఖలకు బదలాయించబోతోంది. కాలం చెల్లిన మరో ఏడు అధికారాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో రక్షితదారు చట్టం కూడా ఉంది.

తహసీల్దార్లకు గల అధికారాల్లో ప్రధానమైనవి-44
ఇకపై తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు-20
ఇతర శాఖలకు బదలాయించే అధికారాలు-17
రద్దు చేయాలని నిర్ణయించినవి-7

అంతర్గత కసరత్తు పూర్తి
రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడమేగాకుండా.. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన ఫలితంగానే తహసీల్దార్ద విధుల్లో పెనుమార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార పాత్రను స్పష్టంగా ప్రస్తావించనుంది. తహసీల్దార్లతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) విధుల్లో కూడా ఈ చట్టం ద్వారా మార్పులు చేయనున్నారు. వాస్తవానికి మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లోనే రెవెన్యూ ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించినా.. రెవెన్యూ కోడ్‌ తీసుకురావాలా? సంపూర్ణంగా కొత్త చట్టమే తీసుకురావాలా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ముందడుగు పడలేదు. అయితే, చట్టం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చిన ఉన్నతాధికారులు... వీఆర్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాలు, ఇతర శాఖల్లో బదలాయింపుపై మాత్రం అంతర్గత కసరత్తు పూర్తిచేశారు. ఇక, కీలకమైన మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ అధికారాలను తహసీల్దార్లకే ఉంచాలా లేదా ఆర్డీఓలకు బదలాయించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఒకే గొడుగు కిందకు..
రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టును రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులోభాగంగానే గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయట్లేదని తెలుస్తోంది. సీసీఎల్‌ఏ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా కుదించి.. సచివాలయంలోని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయార్జన శాఖలన్నింటికీ ఒకే ముఖ్య కార్యదర్శి ఉండేలా, ఆ పోస్టులో స్పెషల్‌ సీఎస్‌ హోదా అధికారిని నియమించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న శాఖలను భారీగా కుదించాలని, కేవలం 18 శాఖలకే పరిమితం చేస్తే బాగుంటుందని గతంలో సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు చేసే దిశగా ఆలోచన సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులను ఆ శాఖకు శాశ్వతంగా బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు, బాధ్యతలు
► మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై పర్యవేక్షణ, సమన్వయం
► సాధారణ విచారణలు
► వీఐపీల పర్యటనల ప్రొటోకాల్‌ విధులు
► కుల, ఆదాయ, వాల్యూయేషన్, స్థానికత, న్యాయబద్ధమైన వారసుల సర్టిఫికెట్ల జారీ
► ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ హోదాలో జ్యూడీషియల్‌ అధికారాలు, భూసేకరణాధికారి (ఎల్‌ఏవో)
► రోడ్డు, రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన ప్రొటోకాల్‌ డ్యూటీ
► వెట్టి కార్మికుల విముక్తి చట్టం అమలు
► రెయిన్‌గేజ్‌ మీటర్ల నిర్వహణ
► నీటి వనరులు, నీటి పరివాహక ప్రాంతాల పర్యవేక్షణ
► వ్యవసాయేతర రంగాలకు నీటి వనరుల కేటాయింపులపై అధికారం
► రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం
► గ్రామ పద్దుల పరిశీలన
► ప్రకృతి విపత్తుల నిర్వహణ, పునరావాసం
► సాధారణ భూసేకరణ
►  సాధారణ ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌
► ఓటర్ల జాబితా రూపకల్పన
► ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ బాధ్యతలు
► చెట్లపై హక్కుల జారీ
►  రివాల్వర్‌ లైసెన్సులు, పేలుడు సంబంధిత అనుమతుల లైసెన్సుల తనిఖీ
► భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు

రద్దు కానున్న అధికారాలు
 సర్వే సబ్‌ డివిజన్‌ నంబర్ల జారీ
► ఉప్పు భూమి లీజులు, అద్దె వసూళ్లు
► సర్వే హద్దురాళ్ల తనిఖీ
► ఆక్రమణదారులకు బీ–మెమోల జారీ
► వ్యవసాయ, ఇళ్ల స్థలాల అసైన్‌మెంట్‌
► హోమ్‌ స్టెడ్‌ యాక్ట్‌ కింద పట్టాల జారీ
► టెనెన్సీ యాక్డు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Liveblog - తహసీల్దార్ల పవర్‌ కట్

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top