33 డాక్టరేట్లతో గిన్నిస్‌ రికార్డ్‌

Telugu Doctor Sagi Satyanarayana Set Three Guinness World Records - Sakshi

మూడోసారి రికార్డుకెక్కిన హైదరాబాద్‌ వైద్యుడు

సాక్షి, హైదరాబాద్‌: భాగ్య నగరానికి చెందిన వైద్యుడు సాగి సత్యనారాయణ అత్యధికంగా 33 డాక్టరేట్‌ డిగ్రీలు చేసి మూడోసారి గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. అందులో 22 పీహెచ్‌డీలు, ఆరు డీలిట్‌ (డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌)లు, 5 డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌లు ఉన్నాయి. స్పిరిచ్యువాలిటీ, ఆస్ట్రాలజీ, జనరల్‌ అండ్‌ క్లినికల్‌ సైకాలజీ, మెడికల్‌ సైన్సెస్, లిటరేచర్, ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్, యోగా అండ్‌ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, యోగా అవేర్‌నెస్, మెడికల్‌ ఆస్ట్రాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, థెరప్యూటిక్‌ సైకాలజీ, హెల్త్‌ అండ్‌ సైన్సెస్, బ్రహ్మజ్ఞానం అంశాలపై ఆయన ఈ పట్టాలను అందుకున్నారు.

ఏడాది కాలంలో వరుసగా 72 పుస్తకాలు రచించడంతోపాటు అవి ముద్రణకు నోచుకున్న నేపథ్యంలో 2016 జనవరి 28న డాక్టర్‌ సాగి తొలిసారి గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కారు. 2006 ఏప్రిల్‌ నుంచి 2012 జనవరి మధ్యలో 125 పుస్తకాలు రచించడంతో 2016 ఆగస్టు 28న రెండోసారి గిన్నిస్‌కు ఎక్కారు. ఈ నెల మూడోసారి ప్రపంచ గిన్నిస్‌ రికార్డులో ఆయన పేరు నమోదైంది. 

సాగి సత్యనారాయణ గుంటూరులో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది. వైద్య, ఆరోగ్య, జనరల్, ఆధ్యాత్మిక, సోషల్ సైన్స్, యోగా, వేదాలు, సైకాలజీలపై అనేక వ్యాసాలు రాయడమే కాకుండా ఆయా అంశాలపై పరిశోధనలు సాగించారు. మన దేశంలోని ఐదు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సాయిలో వివిధ దేశాలకు చెందిన తన పరిశోధనల సారాంశం పంపి.. 25 వర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. మల్కాజిగిరిలో సాయంత్రం పూట ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తూ మంచి మనసును చాటుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top