మూడేళ్ల బాలుడికి కరోనా

Three Years Boy Infected With Coronavirus In Telangana - Sakshi

సౌదీ నుంచి తల్లిదండ్రులతో రాక 

అలాగే 43 ఏళ్ల మహిళకు కూడా

రాష్ట్రంలో 41కి చేరిన బాధితులు

అందులో ఆరుగురికి రెండో కాంటాక్ట్‌తో వైరస్‌ వ్యాప్తి

ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌లో 813 మంది 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మొదటిసారి బుధవారం మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ నమోదైంది. సౌదీ అరేబియా నుంచి అతని తల్లిదండ్రులతో హైదరాబాద్‌ రాగా, ఈ బాలుడికి వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. వీరు హైదరాబాద్‌ గోల్కొండలో నివసిస్తున్నారు. మరోవైపు కోకాపేటకు చెందిన 43 ఏళ్ల మహిళకు కూడా పాజిటివ్‌ నమోదైంది. ఆమె భర్త (49)కు మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అంటే భార్యాభర్తలిద్దరూ కరోనా బారిన పడినట్లయింది. అయితే ఆమె భర్త లండన్‌ నుంచి రాగా, ఆమె ఇక్కడే ఉంది. అతని ద్వారా ఆమెకు కాంటాక్ట్‌ కావడంతో స్థానికంగానే వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తుంది. (ఇదొక్కటే మార్గం.. భేష్‌) 

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన ఒక వ్యాపారి కుటుంబంలో ఇలాగే భార్యాభర్తలిద్దరికీ కరోనా రాగా, వారి ద్వారా కుమారుడికి ఇక్కడే సోకడం గమనార్హం. అలాగే కొత్తగూడెం డీఎస్పీకి అతని కుమారుడి ద్వారా వచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 41 మంది కరోనా బారినపడ్డారు. అందులో ఆరుగురికి విదేశీ చరిత్ర లేకుండా, స్థానికంగా రెండో కాంటాక్టు ద్వారా వ్యాప్తి చెందడం గమనార్హం. రోజురోజుకూ స్థానికంగా రెండో కాంటాక్ట్‌ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

813 మంది ఆసుపత్రిలో ఐసోలేషన్‌.. 
కోవిడ్‌ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్‌ అయినవారి సంఖ్య ఇప్పటివరకు 813 కాగా, అందులో ఒక్క బుధవారమే 50 మంది ఆయా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తాను విడుదల చేసిన బులిటెన్‌లో వివరించారు. ఇదిలావుండగా కొత్తగూడెం డీఎస్పీ, అతని కుమారుడు, వాళ్ల వంట మనిషి ముగ్గురికీ ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా గుర్తించి పరీక్షిస్తున్నారు. వాటి వివరాలు రావాల్సి ఉంది. ఈ ముగ్గురు చాలా మందితో కలిసిమెలిసి తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వారందరినీ గుర్తించి పరీక్షించాకే వైరస్‌ ఏమేరకు విస్తృతమైందో తెలుస్తుంది. వారిలో కొందరికి నెగిటివ్‌ వచ్చింది. మిగిలిన వారి వివరాలు రావాల్సి ఉంది. 
చదవండి: ఇదొక్కటే మార్గం.. భేష్‌ 
చదవండి: వైద్యులు తెల్లకోటు దేవుళ్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top