ఒక ఇంట్లో ఎనిమిది మందికి కొలువులు

Village People Getting Government Jobs In Khammam - Sakshi

విద్యకు ప్రాధాన్యమిస్తున్న గిరిజన గ్రామం పడుగోనిగూడెం 

ఇంటికొకరు చొప్పున ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు  

సాక్షి, గుండాల: మండలంలోని పంచాయతీ కేంద్రమైన పడుగోనిగూడెం గ్రామంలో 46 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 200 మంది ఉన్నారు. అన్ని కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డా.. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గ్రామం నుంచి 100 మంది పైగా విద్యనభ్యసిస్తున్నారు. 12 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో మరో 16 మంది వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఇద్దరు విద్యావలంటీర్లు, సింగరేణిలో ఇద్దరు, అటవీశాఖలో ముగ్గురు బీటు ఆఫీసర్లుగా, గురుకుల పాఠశాల, కళాశాలల్లో మరో ముగ్గురు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు.

పెండెకట్ల ఎల్లయ్య కుటుంబంలోనే 8 మంది ఉద్యోగులు ఉండగా, ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే. అదే గ్రామానికి చెందిన పోతయ్య కుమారుడు భాస్కర్‌ బెంగళూరులో స్టీల్‌ ప్లాంట్‌లో ప్రభుత్వద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వివిధ పీజీ కోర్సుల్లో ఆరుగురు, డిగ్రీ కోర్సుల్లో 20 మంది, ఇంటర్మీడియట్‌లో 12మంది విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతిలో 9 మంది, 1 నుంచి 9వ తరగతులలో 21 మంది చదువుతున్నారు.

ఇందులో ఎక్కువ మంది పట్టణాల్లోనే చదువుతున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. 5వ తరగతి వరకు గ్రామంలోనే చదివించి.. ఆ తర్వాత గుండాల, ఇల్లెందు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించి చదివిస్తున్నారు. మరికొందరు దూర విద్యావిధానంలో చదువుకుంటున్నారు. ఇటీవల కొందరు ఓపెన్‌ టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించారు. గ్రామానికి చెందిన ఓ బాలిక ఎంసెట్‌ ర్యాంకు సాధించి, ప్రతిభ చూపింది. ప్రస్తుతం వెటర్నరీ కోర్సు చదువుతోంది. గ్రామంలోని ఏ ఇంట్లో చూసినా సరస్వతీ పుత్రులే. చదువుతోపాటు గిరిపుత్రులు క్రీడల్లో కూడా ప్రతిభ చూపుతున్నారు.

యువతను ప్రోత్సహిస్తూ.. 
మా ఊళ్లో టెన్త్, ఇంటర్‌ అయిపోయిన పిల్లలు మధ్యలో చదువు ఆపకుండా పై చదువుల కోసం ప్రోత్సహిస్తున్నా. మా ఇంట్లో అందరూ ఉద్యోగం చేస్తున్నారు. అక్షరాస్యత బాగుంది. ఉన్నత స్థాయికి చేరేలా చదివిస్తున్నాం 
–పెండెకట్ల సత్యం, పోస్టు మాస్టర్‌ 

మా ఊరు ఆదర్శంగా నిలవాలి 
మండలంలోనే కాదు జిల్లాలో మా ఊరు ఆదర్శంగా నిలవాలి. చదువురాని వారు, నిరుద్యోగులు ఉండకూడదనే ప్రతీ ఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. అప్పుడుడప్పుడు ఇంటికి వెళ్లే యువతకు అవగాహన కల్పిస్తాను. 
–భాస్కర్, ప్రభుత్వ ఉద్యోగి 

అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..  
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే చదువును కొనసాగిస్తున్నా. ఎంసెట్‌లో 1400 ర్యాంకుతో వెటర్నరీ కోర్సులో ఉన్నాను. భవిష్యత్‌లో డాక్టర్‌ కావాలన్నదే నా ఆశ. మా ఊళ్లో ఉద్యోగంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకున్నా. –జోగ కావ్య 

కూలీలుగా ఉండకూడదనే..  
మా ఊళ్లో యువకులను, మా పిల్లలను మాలాగా వ్యవసాయ కూలీలుగా చూడకూడదనే చదివిస్తున్నం. ఏ ఒక్కరు బడి మానేసినా అవగాహన కల్పించి తిరిగి కాలేజీకి, బడికి పంపిస్తున్నాం.  
–పెండెకట్ల బాటయ్య    
 
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top